శరణార్థుల పడవ మునక | Sakshi
Sakshi News home page

శరణార్థుల పడవ మునక

Published Sat, Jun 4 2016 2:00 AM

శరణార్థుల పడవ మునక

-117 మంది మృతి 
- వందలాది మంది గల్లంతు
- గ్రీస్ తీరంలో ఘటన
 
 ఎథెన్స్: మధ్యధరా సముద్రంలో మరణ ఘోష వినిపిస్తూనే ఉంది. స్వదేశాల్లో యుద్ధంతో భీతిల్లి పొట్ట చేతపట్టుకొని  యూరప్ దేశాలకు పయనమవుతున్న శరణార్థులు ఆటుపోట్లకు బలవుతున్న విషాద ‘సాగర’గాథ కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యధరా సముద్రాన్ని దాటే క్రమంలో గ్రీస్ తీరంలో బోటు బోల్తా పడి  వందలాది గల్లంతయ్యారు. వారిలో 117 మంది మృతదేహాలు  లిబియాలోని జువారా తీరానికి గురువారం కొట్టుకువచ్చాయి. క్రీట్ ద్వీపం దగ్గర్లో పడవ మునిగిందని,  కిక్కిరిసిన పడవలో సామర్థ్యానికి మించి 125 మంది వరకు ఉండవచ్చని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లిబియా నేవీ ప్రతినిధి కల్నల్ అయూబ్ ఖాసీం తెలిపారు.

ఎవరెవరు ఏఏ దేశాలకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. బోటు ఎప్పుడు మునిగిందన్నదీ చెప్పలేకపోతున్నారు. కొన్ని శవాలు కుళ్లిపోయున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గ్రీస్ కోస్ట్ గార్డ్స్ 340 మందిని రక్షించారు. నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ప్రకటించింది. ఆఫ్రికా నుంచి బయలుదేరినట్టుగా భావిస్తున్న ఈ బోట్‌లో దాదాపు 700 మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. ఇటీవల కాలంలో సుమారు వెయ్యి మంది ఇలా బలయ్యారు. జనవరి నుంచి 2.04 లక్షల మంది మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. ఈ భయానక ప్రయాణంలో 2,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది లిబియా నుంచి ఇటలీకి వెళుతున్న క్రమంలో మృత్యువాత పడ్డవారే.

Advertisement
Advertisement