కోట్ల విలువైన నిధిని గుర్తించిన వ్యక్తి

10 Year Treasure Quest Gets a Happy Ending - Sakshi

వాషింగ్టన్‌: వేల కోట్ల విలువైన నిధినిక్షేపాలను ఎక్కడో దాచడం.. దాన్ని చేరుకోవడానికి రెండు గ్రూపులు పోటీ పడటం.. చివరకు హీరో దాన్ని దక్కించుకోవడం.. ఇలాంటి సినిమాలు దాదాపు అన్ని భాషల్లోను వచ్చాయి. సూపర్‌హిట్‌ అయ్యాయి కూడా. అయితే అచ్చంగా ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా 2 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన నిధిని గుర్తించాడో వ్యక్తి. ఉత్తర అమెరికాలోని రాకీ పర్వత ప్రాంతాల్లో ఈ నిధిని కనుగొన్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి దీనిని గుర్తించాడు. వివరాలు.. న్యూ మెక్సికోకు చెందిన ఫారెస్ట్‌ ఫెన్‌ అనే పురాతన వస్తువులు సేకరించే ఓ వ్యక్తి తనకు కిడ్నీ క్యాన్సర్‌ ఉందని తెలిసిన తర్వాత ఈ నిధి వేటను(ట్రెజర్‌హంట్‌) రూపొందించాడు. జబ్బు నయమైన తర్వాత కూడా ఫెన్‌ ఈ అలవాటును కొనసాగించాడు. 

ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఓ రాగి పెట్టెలో బంగారు ముద్దలు, నాణేలు, వజ్రాలు, ప్రీ కొలంబియన్‌ కాలానికి చెందిన కళాకళాఖండాలు, ఇతర విలువైన వస్తువులను దాచాడు ఫెన్‌. తర్వాత నిధి వేటకు అవసరమైన క్లూస్‌ని ‘ది థ్రిల్‌ ఆఫ్‌ ది చేజ్‌’ పేరుతో ప్రచురించాడు. 24 లైన్ల నిగూఢ పద్యంలో నిధి ఉన్న తావుని వర్ణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి రాకీ పర్వతాల్లో సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో దాగి ఉన్న ఈ నిధిని కనుగొన్నట్లు ఫెన్‌ తెలిపాడు. సదరు వ్యక్తి  నిధిని గుర్తించిన ఫోటొను తనకు పంపినట్లు ఫెన్‌ ‘ది శాంటా ఫే న్యూ మెక్సికన్’ వార్తాపత్రికకు తెలిపాడు. అయితే నిధిని కనుగొన్న వ్యక్తి పేరును ఫెన్‌ వెల్లడించలేదు. నిధి ఉన్నవస్తువు బరువు 9 కిలోలు ఉంటే దాని లోపల ఉన్న వస్తువులు మరో 10 కిలోల బరువు ఉంటాయని ఫెన్‌ తెలిపాడు.

గత దశాబ్దంలో పదివేల మంది అన్వేషకులు ఈ నిధి జాడను కనుగొనేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. చాలామంది తమ ఉద్యోగాలను వదిలి పెట్టి.. ప్రమాదకరమైన భూభాగాల్లోకి ప్రవేశించారు. నివేదికలను అనుసరించి కనీసం ఇద్దరు మరణించారు. దాంతో ఫెన్‌ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేశారనే ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. మరికొందరు ఈ నిధి వేట ఒక బూటకమని కొట్టి పారేశారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top