సమైక్య ముసుగులో కిరణ్ దోపిడీ! | ysrcp leaders fire on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సమైక్య ముసుగులో కిరణ్ దోపిడీ!

Feb 17 2014 1:24 AM | Updated on Jul 29 2019 5:31 PM

సమైక్య ముసుగులో కిరణ్ దోపిడీ! - Sakshi

సమైక్య ముసుగులో కిరణ్ దోపిడీ!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాద ముసుగులో ‘దోపిడీవాదం’ కొనసాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది.


  వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం ధ్వజం
  స్వతంత్రంగా విచారణకు సిద్ధం కావాలని సవాల్
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాద ముసుగులో ‘దోపిడీవాదం’ కొనసాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. గతేడాది జూలై 30న రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ పాలనను గాలికొదిలేసి పగలు, రాత్రి ఫైళ్లపై రెండు చేతులతో సంతకాలు చేస్తూ దోపిడీవాదాన్ని కొనసాగిస్తున్నారని మండిపడింది. కిరణ్ దోపిడీకి పాల్పడకుంటే తక్షణం స్వతంత్రంగా విచారణకు ముందుకు రావాలని సవాల్ చేసింది. లేదంటే సమైక్యవాద ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నట్లు కిరణ్ ఒప్పుకోవాలని సూచించింది. వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి టి.బాలరాజు, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కిరణ్ గత జూలై 30 నుంచి నేటి వరకు చేసిన సంతకాలు, విడుదల చేసిన జీవోలను వెల్లడించాలని సమాచారహక్కు చట్టం కింద వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
 
  భూ బదలాయింపులు, భూ కేటాయింపులు, గుత్తేదార్లకు అప్పనంగా ధారాదత్తం చేసిన ప్రజాధనం, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖలో తీసుకున్న నిర్ణయాలపై సమాచారం కోరినట్లు చెప్పారు. ఈ వివరాలు అందాక కిరణ్ చేసిన దోపిడీపై చట్టపరంగా పోరాడి ప్రజాకోర్టులో ఆయన్ను దోషిగా నిలబెడతామని ప్రకటించారు. సీఎం కిరణ్ దోపిడీకి పాల్పడకుంటే ఈ 7 నెలల కాలంలో చేసిన కార్యక్రమాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిస్తే సీఎం కిరణ్ దానిని వక్రీకరిస్తూ సీపీఐ నాయకుల వద్ద నిరాధారమైన నిందలను మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు బురద చల్లి లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న మాదిరిగానే వారి రహస్య మిత్రుడైన కిరణ్ కూడా అదే దారిలో నడుస్తున్నట్లుందని చెప్పారు. టీడీపీ స్క్రిప్టును పక్కాగా అమలు చేస్తూ కిరణ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. జగన్‌పై చేసిన ఆరోపణలకు కిరణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement