పట్టణాభివృద్ధిలో మహిళలు కీలకం | Women are important in urban development | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధిలో మహిళలు కీలకం

Published Thu, Aug 24 2017 3:00 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

పట్టణాభివృద్ధిలో మహిళలు కీలకం - Sakshi

మెప్మా ఉద్యోగులతో మంత్రి కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌:  పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలియజేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో బుధవారం ఆయన ఇక్కడ సమావేశమయ్యారు. మెప్మా రిసోర్స్‌ పర్సన్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యలు, ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన సహాయ సహకారాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

మెప్మా రిసోర్స్‌ పర్సన్లు, ముఖ్యంగా మహిళా సోదరీమణుల సహకారంతో ప్రభుత్వం పట్టణాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. పట్టణాల్లో నివసిస్తున్న పేదల అభివృద్ధికి తీసుకోవాల్సిన కొత్త కార్యక్రమాలను సూచించాలని వారిని కోరారు.   రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్లు, హరితహారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాల రూపకల్పన తదితర కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై రిసోర్స్‌ పర్సన్‌లను వాకబు చేశారు.

పలు పురపాలికలు చేపట్టిన తడి–పొడి చెత్త కార్యక్రమం అమలులో, అక్కడి పట్టణ ప్రజలను చైతన్యవంతం చేయడంలో మెప్మా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి, ప్రభుత్వ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై పట్టణ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. మెప్మా పథకం కింద మహిళలు చేస్తున్న సేవల గురించి సీఎంకి అవగాహన ఉందని, త్వరలోనే మెప్మా ఉద్యోగులతో సీఎం సమావేశమవుతారన్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలకంగా పనిచేస్తున్నా, తమకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, వీటిని పెంచాలని రిసోర్స్‌ పర్సన్లు మంత్రికి విన్నవించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement