ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ ‘నిర్భయ’ పేరిట తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
=ముంబైలో విడుదల
= ఈసీఐఎల్ ఆధ్వర్యంలో తయారీ
=త్వరలో నగర మార్కెట్లోకి..
కుషాయిగూడ,న్యూస్‌లైన్: ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ ‘నిర్భయ’ పేరిట తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
ఆపదలో ఉన్న మహిళకు సహాయకారిగా ఉండేలా ఒక్క స్విచ్‌తో తాను ఎక్కడ ఉందీ, ఏ పరిస్థితుల్లో ఉందీ...తదితర విషయాలను ముందుగా నిర్దేశించిన నంబర్లకు సమాచారమందడం ఈ పరికరం ప్రత్యేకత. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఉదంతంతో పాటు హైటెక్‌సిటీలో చోటుచేసుకున్న ‘అభయ’ ఘటనల నేపథ్యంలో ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం’తో ఈ పరికరం పనిచేస్తుంది.
ఈ పరికరాన్ని శుక్రవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అణు ఇంధనవిభాగం (డీఏఈ) చైర్మన్ డాక్టర్ రతన్‌కుమార్ సిన్హా ఆవిష్కరించారు. బార్క్ పరిశోధకులు రూపకల్పన చేయగా,ఈసీఐఎల్ సంస్థ ‘నిర్భయ’ పరికరాన్ని తయారు చేసిందని ఈసీఐఎల్ పీఆర్వో లక్ష్మీనారాయణ శనివారం ఇక్కడ తెలిపారు. సెల్‌ఫోన్‌కు అనుసంధానమయ్యే ఈ పరికరం త్వరలో మార్కెట్లోకి వస్తుందని ఆయన చెప్పారు.