
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆర్‌కే పురం రైతుబజార్‌లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు
రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లోని రెండు లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, దీన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.
- 2న హైదరాబాద్‌లో లక్ష మందికి ఇళ్ల పట్టాలిస్తామన్న కేసీఆర్
హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లోని రెండు లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, దీన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో 125 చదరపు గజాల్లోపు ఇళ్లు నిర్మించుకున్న లక్ష మంది పేదలకు జూన్ 2న పట్టాలిస్తామని ప్రకటించారు. మరో 25వేల మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.
‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం చివరిరోజైన బుధవారం ఆయన పాత నగరంతో పాటు ఎల్బీనగర్, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్‌టీఆర్ నగర్‌లో జరిగిన బస్తీ సభలో మాట్లాడారు. నాంపల్లిలోని భీంరావుబాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తాము ఆందోళన చేపట్టినా వినకుండా పేదల నుంచి బలవంతంగా స్థలాలను లాక్కున్నారని.. ఆ స్థలంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ నాయకులను పిలిచి తానే స్వయంగా మాట్లాడతానని వారికి ఇంకో చోట జాగా ఇస్తానని చెప్పారు. ఈ విషయంలో అనవసరంగా బదనాం కావద్దని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గ్రేటర్ నగరం నలుమూలలకు వెళ్లి వచ్చిన 400 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.
రాబోయే 45 రోజుల్లో చెత్త తరలించేందుకు 2500 ఆటో ట్రాలీలు, ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలను సమకూర్చుతామన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నెలలో ఒకరోజు అధికారులే బస్తీలకు వస్తారన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తామని సీఎం చెప్పారు. ఎన్‌టీఆర్ నగర్‌లో నివసిస్తున్న పేదలకు 45 రోజుల్లో ఇళ్ల పట్టాలిస్తామని, రాబోయే ఆరు నెలల్లో ఇక్కడ వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
పాతబస్తీని అభివృద్ధి చేస్తాం
పాతబస్తీని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రిపిలుపునిచ్చారు. నూర్‌ఖాన్‌బజార్, డబీర్‌పురాలోని సయ్యద్ సాబ్ కా బాడ, చంచలగూడ, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నూర్‌ఖాన్‌బజార్‌లో రూ.12 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తామన్నారు. పెండింగ్ డ్రైనేజీ పనులకు రూ. 25 కోట్ల వరకు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో రెండు రోజుల పాటు పాతబస్తీలో విస్తృతంగా పర్యటించి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సైదాబాద్‌లోని ఎర్రగుంట శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిషన్ కాకతీయ కింద ఎర్రగుంట చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. చంచలగూడలోని పిల్లిగుడిసెల ప్రాంతంలో జీ+5 నిర్మాణానికి సంబంధిత అధికారులతో చర్చించారు. పాతబస్తీలో లో-వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థల సేకరణ జరపాలని సూచించారు. కుర్మగూడాలో 224, రాజేంద్రనగర్ కిస్మత్‌పురాలో 228 ఇళ్లు, సయ్యద్‌సాబ్‌కా బాడాలో 48 ఇళ్లు పేదల కోసం నిర్మిస్తామని చెప్పారు. అనంతరం సరూర్‌నగర్ చెరువును పరిశీలించారు. ఇక్కడ నాలాల నుంచి వస్తున్న నీటిని మూసీలోకి మళ్లిస్తామన్నారు. ఇక నాచారం సింగం చెరువు తండాలో పర్యటించిన ఆయన నాలుగైదు నెలల్లో బస్తీవాసులు కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు.
చెత్తపై యుద్ధం చేద్దాం
‘హైదరాబాద్ నగరం పైన పటారం లోన లొటారం లెక్క ఉంది. ఏ బస్తీని చూసినా దుఃఖం, బాధ కలుగుతున్నాయి. నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయి. సికింద్రాబాద్‌లో మూడు రోజులు తిరిగిన. ఏ బస్తీకి వెళ్లినా అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో దుర్భరంగా బతుకుతున్నారు. ఈ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం బయలుదేరింది. అందరం కలసి చెత్తపై యుద్ధం చేయాలె. చెత్తాచెదారం వల్ల దోమలు వ్యాపిస్తాయని, వాటికి ధనికులు, పేదలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కుడతాయి. దోమను మించిన సోషలిస్టు లేదు’ అని కేసీఆర్ చమత్కరించారు.