దమ్ ‘హీరో’ దమ్
డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఎక్సైజ్ సిట్ త్వరలో సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇవ్వబోతోంది!
నేడోరేపో మరో నలుగురు సినీ ప్రముఖులకు నోటీసులు
- సుబ్బరాజు, శ్యాం కె.నాయుడు విచారణలో వారి పేర్లు తెరపైకి..
- టాప్ పొజిషన్‌లో ఉన్న ఇద్దరు కుర్ర హీరోలూ వెలుగులోకి..
- సినీ పరిశ్రమలో తొలి నుంచి హవా సాగిస్తున్న
మూడు కుటుంబాలకు చెందిన వారికీ లింకులు
- టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న
ఓ ప్రముఖ తార కూడా.. ఆధారాలు సేకరించిన అధికారులు
- కాజల్ అగర్వాల్ మేనేజర్ అరెస్ట్.. గంజాయి స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఎక్సైజ్ సిట్ త్వరలో సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇవ్వబోతోంది! ఇప్పటివరకు 12 మందికి నోటీ సులిచ్చి విచారణ జరుపుతున్న అధికారులు మరో జాబితా సిద్ధం చేశారు. విచారణలో నటుడు సుబ్బరాజు, కెమెరామెన్ శ్యాం కె.నాయుడు చెప్పిన అంశాల ఆధారంగా సినీ రంగంలోని ప్రముఖులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలి సింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్న ఇద్దరు కుర్ర హీరోలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది.
సినీ పరిశ్రమలో మొదట్నుంచీ తమ హవా కొనసాగిస్తూ వస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారికి డ్రగ్స్ వ్యవహారంలో లింకులు ఉండటం దర్యాప్తు అధికారులను నివ్వెరపరిచింది. వారిలో ప్రస్తుతం మంచి ఊపు మీదున్న యంగ్ హీరో ఒకరైతే, కుటుంబ కథలు, ఆటపాటలతో ఉర్రూతలూగించే హీరో మరొకరు. వీరిద్దరితోపాటు మరో ప్రముఖ నటి పేరు బయటపడటం సంచలనం రేపుతోంది. అలాగే వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఓ ప్రముఖ తార కూడా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ అగ్రతారకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. సుబ్బరాజు, శ్యాం కె.నాయుడు విచారణలో వీరి పేర్లు బయటపడ్డాయని సిట్ వర్గాల ద్వారా తెలిసింది.
నేడే నోటీసులు?
ఇప్పటికే నోటీసులు జారీ చేసిన 12 మందిలో ఐదుగురిని అధికారులు విచారించారు. మరో ఏడుగురిని ప్రశ్నించాల్సి ఉంది. విచారణ ఎదుర్కొన్నవారు చెబుతున్న అంశాల ఆధారంగా సిట్.. క్రాస్ చెక్ చేస్తోంది. వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చేలా ఆధారాలూ సేకరించినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే ఈ నలుగురు ప్రముఖులకు నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మంగళవారం లేదా బుధవారం నోటీసులు జారీచేస్తామని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాజల్ అగర్వాల్ మేనేజర్ అరెస్ట్!
డ్రగ్స్ కేసు ఇప్పటికే సినీ పరిశ్రమను కుదేలు చేస్తుంటే తాజాగా ఎక్సైజ్ అధికారులు ఓ ప్రముఖ హీరోయిన్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. సోమవారం మణికొండలో రాన్షన్ జోసెఫ్‌ను అరెస్ట్ చేసి అతడి నుంచి 4 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇతడు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్న కాజల్ అగర్వాల్ వద్ద మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. జోసెఫ్ ఇంటిపై అధికారులు దాడులు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. గతంలో ఇతడు హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా వద్ద పనిచేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.