ఈ యేడు ఖైరతాబాద్ గణేష్ ఇదే | this year khirathabad ganesh story | Sakshi
Sakshi News home page

ఈ యేడు ఖైరతాబాద్ గణేష్ ఇదే

Jul 20 2016 10:12 AM | Updated on Sep 4 2017 5:19 AM

ఈ యేడు ఖైరతాబాద్ గణేష్ ఇదే

ఈ యేడు ఖైరతాబాద్ గణేష్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్‌ గణేశుడు సిద్ధమవుతున్నాడు.

  ♦  సిద్ధమవుతున్న ఖైరతాబాద్‌ గణేశుడు
  ♦  చవితికి వారం రోజుల ముందే దర్శనం
  ♦  ఈ ఏడాదీ తాపేశ్వరం లడ్డూ ప్రసాదం

ఖైరతాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్‌ గణేశుడు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది 58 అడుగుల ఎత్తులో ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా భక్తులకు దర్శనమీయనున్నాడు. విగ్రహ తయారీ పనులు శిల్పి రాజేంద్రన్‌ నేతృత్వంలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీకాయుడిని తీర్చిదిద్దడంలో ఎంతో మంది శ్రామికుల శ్రమ ఉంది.       

తయారీ ఇలా..
ఈ ఏడాది నెలకొల్పే గణపతి విగ్రహం 58 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో రూపు దిద్దుకుంటోంది. ఇందుకు 20 టన్నుల స్టీల్, కెమికల్‌ కేవలం ఒకశాతం మాత్రమే ఉండే విధంగా సముద్రపు గవ్వల నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తమిళనాడు నుంచి తీసుకువచే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ 1750 బ్యాగులు (ఒక్కో బ్యాగు 50 కేజీలు), నార 45 బండిల్స్, గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి బంకమట్టి 200 బ్యాగులు (ఒక్కో బ్యాగు 35 కేజీలు), వాటర్‌ కలర్స్‌ 150 లీటర్లు వాడుతున్నారు.

వీటితో పాటు షెడ్డు వేసేందుకు నర్సాపూర్‌ నుంచి 25 టన్నుల సర్వీ కర్ర, 50 బండిళ్ల కొబ్బరి తాడుతో నిర్మించిన 60 అడుగుల షెడ్డు  అదనం. వీటన్నింటికీ కమిటీ రూ.55 లక్షలు వెచ్చించింది. వినాయకుడి మొత్తం బరువు సుమారు 45 టన్నులు ఉంటుందని శిల్పి రాజేంద్రన్‌ తెలిపారు.

(శిల్పి రాజేంద్రన్)
 

పనులు సాగే తీరిదీ..
మహాగణపతి విగ్రహం నెలకొల్పే షెడ్డును వేసేందుకు ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్‌ నేతృత్వంలో 20 మంది శ్రామికులు 15 రోజుల పాటు శ్రమించారు. మచిలీపట్నంకు చెందిన నాగబాబు ఆధ్వర్యంలో 12 మంది వెల్డింగ్‌ పనులు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ పనులను చెన్నైకి చెందిన ఆర్టిస్టు మూర్తి ఆధ్వర్యంలో 25 మంది పనిచేస్తున్నారు. విగ్రహం ఫినిషింగ్‌ వర్క్‌ కోసం మహారాష్ట్ర, యూపీ, కోల్కతా నుంచి 25 మంది కళాకారులను తీసుకువచ్చారు. మౌల్డింగ్‌ పనులను నగరానికి 20 మంది చూస్తున్నారు. చివరగా చేసే ఫినిషింగ్‌ పెయింటిగ్‌ పనులను కాకినాడకు చెందిన భీమేష్‌ ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు పనిచేస్తారు.

నైవేద్యం లడ్డూ 500 కేజీలే..
ఖైరతాబాద్‌ మహాగణపతికి మొదటిసారిగా 2010లో తాపేశ్వరం నుంచి సురుచి ఫుడ్స్‌ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. ఆ తరువాత 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోలు, 2014లో 5200 కిలోలు, 2015లో 5600 కిలోల మహాలడ్డూను ప్రసాదంగా సమర్పించారు. ఈ ఏడాది గణపతికి కేవలం నైవేద్యంగా మల్లిబాబు నుంచి 500 కేజీల లడ్డూను మాత్రమే తీసుకుని సమర్పిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతితో పాటు లడ్డూ పెరుగుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం వినాయకుడి ఎత్తు తగ్గినట్లుగానే లడ్డూ సైజు కూడా మొదటి సారిగా 2010లో వలే 500 కేజీలు మాత్రమే.. అదీ నైవేద్యంగా మాత్రమే పెట్టాలని నిర్ణయించారు.

 గత సంవత్సరం ఖైరతాబాద్ గణేషుడి ప్రతిమ(ఫైల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement