గజ్జె కట్టిన ‘గబ్బు’ డబ్బు! | tdp governament bargaining to ysrcp leaders | Sakshi
Sakshi News home page

గజ్జె కట్టిన ‘గబ్బు’ డబ్బు!

Mar 2 2016 11:32 AM | Updated on Sep 22 2018 8:22 PM

గజ్జె కట్టిన ‘గబ్బు’ డబ్బు! - Sakshi

గజ్జె కట్టిన ‘గబ్బు’ డబ్బు!

ఒక ప్రభుత్వాధినేత ఈ స్థాయికి దిగజారడం, ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడానికి దేనికైనా సిద్ధపడుతుండడం చూస్తే ప్రజాస్వామ్య విలువలు ఎంత పతనమయ్యాయో తెలుస్తుంది.

నడి వీధుల్లో ‘డెమోక్రసీ’ వేలం
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని కరెన్సీ కళంకం
నిలువెత్తు ధనరాశులతో ప్రజాప్రతినిధులను బేరమాడుతున్న అవినీతి పాలకులు
ఇసుక నుంచి ఇరిగేషన్ దాకా సాగించిన లూటీ సొమ్ముతో
జుగుప్సాకరమైన రాజకీయం 20 నుంచి 30 కోట్ల ఆఫర్...
ఇప్పటికే ఆరుగురిని లొంగదీసుకున్న ప్రభుత్వం...
భారీ బేరంతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు టీడీపీ నేతల వల
ఆరునెలలుగా విశ్వప్రయత్నాలతో ఎనిమిది మందిని ఆకర్షించిన అధికార పార్టీ

 

‘ప్రతిపక్షపార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలతో సర్దుకుపోండి. మీకు ఏం కావాలన్నా చేసిపెడతా.. మీరు చెప్పినట్లే వింటా’.. - టీడీపీ కార్యకర్తలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు 

 ‘ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తాం’... - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘చినబాబు’ లోకేష్ అహంకారపూరిత కామెంట్

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : ఒక ప్రభుత్వాధినేత ఈ స్థాయికి దిగజారడం, ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడానికి దేనికైనా సిద్ధపడుతుండడం చూస్తే ప్రజాస్వామ్య విలువలు ఎంత పతనమయ్యాయో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడి అవినీతితో ఆర్జించిన కోట్లాది రూపాయలను ఎడాపెడా వెదజల్లుతూ ఫిరాయింపులను ఎగదోస్తున్న తీరు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైనం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఏడు దశాబ్దాల భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి పరిణామాలు కనీవిని ఎరుగమని రాజకీయవిశ్లేషకులంటున్నారు. ‘గతంలో మైనారిటీలో ఉన్న ప్రభుత్వాలు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించేవి.. కానీ అలాంటి సందర్భాలలో సదరు ఎమ్మెల్యేలు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజాతీర్పు కోరేవారు.

కానీ ఇపుడు అలాంటి విలువలు కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు’ అని విశ్లేషకులంటున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే ముందు పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్లడం సాంప్రదాయం. కానీ ప్రజా అవహేళన చేసే విధంగా, నిస్సిగ్గుగా అధికారపార్టీలోకి ఫిరాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. విచ్చలవిడి అవినీతితో ఆర్జించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనా ప్రజాస్వామ్యమంటే.. అలాగైతే ఇక డబ్బులున్నవాళ్లే ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే సరిపోదా.. అన్న విమర్శలు వినిపిస్తున్నాయి..

 బేరసారాలకు దిగజారారు..
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న దుగ్ధతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ఎగదోస్తున్నదని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అంతులేని అవినీతితో ఆర్జించిన వేల కోట్ల ప్రజాధనాన్ని ఇలా ఎమ్మెల్యేల బేరసారాలకు, కొనుగోళ్లకు వెచ్చిస్తుండడం చూస్తే తెలుగుదేశం అధినేత ఏ స్థాయికి దిగజారారో అర్ధమౌతున్నదని వారు పేర్కొంటున్నారు.  ముఖ్యమంత్రి, మంత్రులు ఆరునెలలుగా శతవిధాలుగా విశ్వప్రయత్నాలు చేసినా, అంతులేని డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఎరవేసినా ఆరేడుగురు మినహా తమ ఎమ్మెల్యేలంతా విలువలకు కట్టుబడి ఉండడం హర్షించదగిన పరిణామమని వైఎస్సార్‌సీపీ నేతలంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి తెలుగుదేశం పార్టీలో ఈనెల 4న చేరబోతున్నట్లు ప్రకటించగా కర్నూలుకు చెందిన మరో ఎమ్మెల్యేని కూడా ప్రలోభపెట్టేందుకు తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఏం కావాలన్నా ఇవ్వడానికి రెడీ...
ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్లు నుంచి రూ. 40 కోట్లు ఇస్తుండడం, ఇంకా మీకు ఏం కావాలని అడగడం చూస్తుంటే  ఈ 20 నెలల కాలంలో రాష్ర్టంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధమౌతోందని విమర్శకులంటున్నారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఎరవేసి ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్న అధికారపార్టీ... విమర్శకులు, మేధావుల విమర్శలను, సూచనలను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. అడ్డగోలు అవినీతితో ఆర్జించిన డబ్బుతో ఇప్పటివరకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను అధికారపార్టీ ఆకర్షించగలిగింది. కళ్లు చెదిరే ఆఫర్లతో కర్నూలుకు చెందిన మరో ఎమ్మెల్యేని కూడా ఆకర్షించబోతున్నట్లు తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు.  పెదబాబు, చినబాబు అడ్డగోలు అవినీతితో ఆర్జించిన డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఎమ్మెల్యేలను ఆకర్షించడం, అందులోనూ స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఫిరాయింపులను ప్రోత్సహించడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

 ప్రజల దృష్టి మళ్లించే యత్నాలు..
20 నెలల వ్యవధిలో అన్ని రంగాల్లోనూ అవినీతిని ఏరులుగా పారించడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇసుక రీచ్‌లలో వేలకోట్ల రూపాయలను తవ్వేయడాన్ని సొంత పార్టీ వారే ఛీకొడుతున్నారు. ఇసుక దందాల్లో రూ. 2వేల కోట్లు కొల్లగొట్టారని యనమల వంటి వారు స్వయంగా అంగీకరిస్తున్నారు. దాంతో అకస్మాత్తుగా ఇసుక విధానాన్ని మార్చేశారు. ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటూ ప్రకటించిన కొత్త విధానం కార్యకర్తలకు దోచిపెట్టేందుకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ వైఫల్యానికి తోడు అవినీతి, ఓటుకునోట్లు కేసు వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఆయన ముప్పుతిప్పలు పడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా ఏదో కలకలం సృష్టించి ఈ విపత్కర పరిస్థితి నుంచి బైటపడాలనుకుంటున్నారు. కానీ ప్రజల వివేచనా శక్తిని ఆయన తక్కువగా అంచనా వేస్తున్నారు.

 పరిపాలన గాలిగొదిలేశారు....
మరోవైపు రాష్ర్టంలో పాలన పూర్తిగా పడకేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిపాలనను గాలికొదిలేశారు. ఆరునెలలుగా ప్రతిపక్షపార్టీని నిర్వీర్యం చేయడమెలా అన్న ఏక సూత్ర కార్యక్రమంలో అధినేత నుంచి మంత్రుల వరకు తలమునకలుగా మునిగిపోయారు. ముఖ్యమంత్రి విజయవాడలో.. సెక్రటేరియట్, అధికారులు హైదరాబాద్‌లో... ఏ శాఖలో ఏం జరుగుతోందో పట్టించుకునే నాథుడే లేడు. రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరిగినా సాధారణ బడ్జెట్‌లో మొండి చేయి చూపినా అడిగే తీరిక, ఓపిక అధికార పార్టీకి, ఆ పార్టీ అధినేతకు లేవు. ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి వేసిన టూర్లు, చెప్పిన కబుర్లు నిష్ఫలమని బడ్జెట్‌లో విదిల్చిన అరకొర నిధులు రుజువుచేశాయి.

 ప్రజాస్వామ్యం అపహాస్యం..
డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఎరవేసి, అధికారాన్ని దుర్వినియోగపరచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సామదానభేద దండోపాయాలతో లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విశ్లేషకులంటున్నారు. ప్రజాస్వామ్యం వద్దు... ప్రతిపక్షం వద్దు అన్న రీతిలో ఒక ముఖ్యమంత్రి వ్యవహరించడం, కార్యకర్తలను, నాయకులను అందుకు సిద్ధం చేస్తుండడం శోచనీయమని వారంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక పక్క పార్టీలోకి ఆకర్షిస్తూనే పార్టీలో విస్తరిస్తున్న అసమ్మతిని చల్లబరిచేందుకు ముఖ్యమంత్రి నానా అగచాట్లు పడుతున్నారు. సర్దుకుపోండి అని కార్యకర్తలను బతిమాలుతున్నారు. మీకేం కావాలన్నా చేసిపెడతానని, మీరు చెప్పినట్టే వింటానని పార్టీ అధినేత బతిమాలుతున్నారంటే తెలుగుదేశంలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement