సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యలక్ష్మి పథకానికి ఆదరణ తగ్గుతోంది. ఈ పథకం కింద నమోదైన లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పతనమవుతోంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఆరో గ్యలక్ష్మి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంతో పథకం అమలు గాడితప్పుతోంది.
ఆరోగ్యలక్ష్మి పథకం అమలుపై క్షేత్రస్థాయి నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం జనవరిలో గర్భిణులు, బాలింతల హాజరు 42.43 శాతం మాత్రమే నమోదవడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 31,711, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డుతో పాటు 150గ్రాముల బియ్యం, 30గ్రాముల పప్పు తదితరాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని భోజన రూపంలో అందించాలి. అంతేకాకుండా వారంలో ఒక రోజు 200 మిల్లీలీటర్ల పెరుగు, ఎగ్ కర్రీ పంపిణీ చేయాలి.
గాడి తప్పిన పాలన..
సకాలంలో అంగన్‌వాడీ కేంద్రాలను తెరవకపోవడం.. కేంద్రాలు తెరిచినా పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు విసుగు చెందుతున్నారు. దీంతో లబ్ధిదారుల హాజరు గణనీయంగా పడిపోతోంది. మరోవైపు పాలు, పెరుగు, వండిన కూరగాయలకు బదులుగా సరుకులను పంపిణీ చేస్తున్నారు. వంటసామగ్రి లేదనే సాకుతో సరుకులు పంపిణీ చేస్తుండటంపై లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు ఇదే తరహాలో పంపిణీ ప్రక్రియ పునరావృతం కావడంతో లబ్ధిదారులు క్రమంగా కేంద్రాలకు వెళ్లడం మానుకుంటున్నారు. ఇటీవల రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా సంక్షేమాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఇలాంటి అంశాలు వెలుగు చూశాయి. ఫిబ్రవరిలో సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ క్రమపద్ధతిలో ఉంటేనే పథకాల అమలు సంతృప్తికరంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.


