ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుం రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీ,పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించాయి.
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుంను రద్దు చేయాలని జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ప్రస్తుత ఏడాది ఆస్తి పన్నులతో పాటు పాత బకాయిలను ఏకమొత్తంలో గడువులోగా చెల్లిస్తే అపరాధ రుసుం మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి.
దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గడిచిన ఆగస్టు 31లోగా బకాయిలను చెల్లిస్తే మాఫీని వర్తింపజేయాలని కోరినప్పటికీ... నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో సెప్టెంబర్ 30 వరకు అపరాధ రుసుం లేకుండా బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించవచ్చని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మాఫీ వర్తించనుంది. పురపాలక సంస్థల్లో ఆస్తి పన్నుల బకాయిల వసూళ్లను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా అపరాధ రుసుంను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటికే ఈ రుసుంతో పాటు పాత బకాయిలను చెల్లించిన వారికీ మాఫీ వర్తించనుంది. అపరాధ రుసుంను తిరిగి చెల్లించకుండా వచ్చే ఏడాది పన్నుల్లో సర్దుబాటు చేస్తారు.