
ఆన్‌లైన్‌లో ఆటో గుట్టు!
ఒంటరిగా ప్రయాణించే మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలకు ఉపక్రమిస్తోంది.
యజమానుల వివరాల నమోదు
మహిళల భద్రత కోసం సర్కారు చర్యలు
పోలీసు, రవాణాశాఖ ఆధ్వర్యంలో భారీ కసరత్తు
పూనం మాలకొండయ్య కమిటీ సిఫారసుతో కదలిక
సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ప్రయాణించే మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలకు ఉపక్రమిస్తోంది. గతంలో రాత్రి వేళ ఇళ్లకు చేరుకునే ప్రయత్నంలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులపై క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో క్యాబ్‌ల నియంత్రణకు చర్యలు చేపట్టిన సర్కారు తాజాగా ఆటోలపై దృష్టి సారించింది. రవాణా శాఖ-పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ఆటోల అసలు యజమానులెవరో తేల్చే భారీ కసరత్తుకు తెరలేపింది. రవాణా శాఖ వద్ద ఉన్న నంబర్ల ఆధారంగా అన్ని ఆటోలను, వాటి యజమానులను ఒకచోట చేర్చి ఒక్కో ఆటో వారీగా పూర్తి వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
యజమాని ఎవరు, ఆటో నడుపుతోంది ఎవరు, ఒక్కొక్కరికి ఎన్ని ఆటోలున్నాయి, వాటి రిజిస్ట్రేషన్, చిరునామా, ఫోన్ నంబర్లు, వారికి నేర చరిత్ర ఉందా, పోలీసు స్టేషన్‌లలో కేసులున్నాయా... ఇలా అన్ని వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచబోతున్నారు. ఈ వివరాలు ఇటు రవాణాశాఖ వెబ్‌సైట్‌లో, అటు పోలీసు శాఖవద్ద నమోదవుతాయి. భవిష్యత్తులో ఆటో చేతులు మారితే కచ్చితంగా ఆ వివరాలు అప్‌డేట్ అయ్యేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూలైలో ఈ కసరత్తు మొదలవుతుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 1.26 లక్షల ఆటోల వివరాలను సేకరిస్తారు.
ఆటో వ్యవస్థ గందరగోళం
ఇంతకాలం రవాణా శాఖ, పోలీసు విభాగం పట్టించుకోకపోవటంతో హైదరాబాద్‌లో ఆటోల అసలు యజమానులెవరో తెలిసే దాఖలాలే లేకుండా పోయాయి. రవాణా శాఖ రికార్డులకు, వాస్తవ వివరాలకు పొంతనే లేదు. ఎక్కడైనా ఆటో డ్రైవర్ నేరానికి పాల్పడితే అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముప్పతిప్పలు పడాల్సివస్తోంది. రవాణాశాఖ నుంచి తీసుకున్న నంబరు ఆధారంగా ఇంటికి వెళ్తే ఆ పేరు గల వ్యక్తులు లేకపోవటమో, అసలు ఆటోకు ఆ ఇంటికి సంబంధమే లేకపోవటమో జరుగుతోంది.
దీంతో నేరగాళ్లను పట్టుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. సైబరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులపై గతంలో వరుసగా లైంగిక దాడులు జరిగిన నేపథ్యంలో మహిళల భద్రతపై సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుతో ప్రభుత్వం ఆటోలపై నిర్ణయం తీసుకుంది. గతంలో ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి మహిళలపై జరిగిన అకృత్యాలపై కమిటీ దృష్టిసారించగా ఆటో వ్యవస్థలోని అయోమయం బయటపడింది.
చాలామంది ఫైనాన్షియర్లు బోగస్ పేర్లతో ఆటోలు పొంది వాటిని వేరే వారికి అమ్మేస్తున్నారు. డబ్బులు చెల్లించలేని పక్షంలో అవి క్రమంగా చేతులు మారుతూనే ఉన్నాయి. దీంతో మొత్తం వ్యవస్థను సరిదిద్దాలని కమిటీ సిఫారసు చేసింది. నగరంలోని గోషామహల్ స్టేడియంలో వివరాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆటోను తీసుకుని యజమాని అక్కడికి రావాలి. ఇందుకోసం అన్ని ఆటోల యజమానులకు సమాచారం ఇవ్వనున్నారు.