బాల్యం ‘తట్టు’కోవాలని! | MR universal vaccine from tomorrow | Sakshi
Sakshi News home page

బాల్యం ‘తట్టు’కోవాలని!

Aug 16 2017 12:33 AM | Updated on Sep 17 2017 5:33 PM

బాల్యం ‘తట్టు’కోవాలని!

బాల్యం ‘తట్టు’కోవాలని!

ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అతి పెద్ద సవాలుగా మారుతున్న తట్టు(మీజిల్స్‌), రుబెల్లా వ్యాధుల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి.

రేపటి నుంచి ఎంఆర్‌ సార్వత్రిక టీకా
- తెలంగాణలో 90 లక్షల మంది పిల్లలకు..
ఆంధ్రప్రదేశ్‌లో 1.35 కోట్ల మందికి..
9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్‌
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు కార్యక్రమం
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అతి పెద్ద సవాలుగా మారుతున్న తట్టు(మీజిల్స్‌), రుబెల్లా వ్యాధుల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా వీటి అంతానికి ఎంఆర్‌ సార్వత్రిక టీకాను అమల్లోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఉచితంగా ఎంఆర్‌ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 9 నెలలు నిండిన పిల్లల నుంచి 15 ఏళ్ల లోపు వారందరికీ ఈ టీకా వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న 90,00,117 మంది పిల్లలకు టీకా వేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు ఈ టీకా వేయనున్నారు. బడి బయట ఉండే పిల్లలకు కూడా ఈ టీకా వేసేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు గతంలో టీకాలు వేయించినా మరోసారి కూడా వేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, గతంలో తట్టు, రుబెల్లా నివారణకు టీకా వేయించిన సమయంలో అలర్జీకి గురైన వారు ఈ టీకా వేయించుకోవద్దని పేర్కొంది.
 
ఏటా 1.14 లక్షల మంది మృతి..
తట్టు వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.14 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. మన దేశంలో ఏటా 49,200 మంది చనిపోతున్నారు. చిన్నారుల పాలిట ప్రమాదకరంగా మారుతున్న తట్టును 2020 లోపు మన దేశంలో పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం నిర్ణయించింది. రుబెల్లాతో కలిపి తట్టును నిర్మూలించేందుకు ఎంఆర్‌ సార్వత్రిక టీకాను ప్రవేశపెట్టింది. 1985 నుంచే ప్రైవేట్‌ రంగంలో తట్టు, గవద బిల్లలు, రుబెల్లా (ఎంఎంఆర్‌) టీకాలను పిల్లలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఉచితంగా ఎంఆర్‌ టీకా వేయనున్నారు. 2018 లోపు దేశంలోని 40 కోట్ల మంది (95 శాతం) చిన్నారులకు ఈ టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 దశల్లో అన్ని రాష్ట్రాల్లోనూ టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. 2017 ఫిబ్రవరి 6న మొదటి దశ ఎంఆర్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు నిర్వహిస్తున్న రెండో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, చండీగఢ్, డయ్యూ–డామన్, దాద్రానగర్‌ హవేలీలోని 3.66 కోట్ల మంది పిల్లలకు ఎంఆర్‌ టీకా వేయనున్నారు. పుట్టే ప్రతి పిల్లలకు 12 నెలల వయసులో ఒకసారి, 24 నెలల వయసులో మరోసారి ఈ టీకా వేయించాల్సి ఉంటుంది. 
 
తట్టు లక్షణాలు..
ప్రమాదకరమైన అంటు వ్యాధి. వైరస్‌ ద్వారా సోకుతుంది. చిన్నారుల్లో వైకల్యాలకు, మరణాలకు కారణమవుతుంది. దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపర్లతో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అతిసారం, న్యుమోనియా, నోటి పూత, చెవి ఇన్‌ఫెక్షన్, కళ్లు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 
రుబెల్లా లక్షణాలు..
గర్భంతో ఉన్నప్పుడు రుబెల్లా ఇన్‌ఫెక్షన్‌ సోకితే గర్భస్రావం జరుగుతుంది. మృత శిశువు జన్మించే అవకాశముంది. నవజాత శిశువుల్లో అంధత్వం, వినికిడిలోపం, గుండె వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. రుబెల్లా వచ్చిన వారికి ఒళ్లంతా దద్దుర్లు కనిపిస్తాయి. రుబెల్లాతో ఉన్న చిన్నారులతో సన్నిహితంగా ఉండే వయోజనులకూ ఇది సోకుతుంది. 
 
ఇది ముఖ్యమైన టీకా
తట్టు, రుబెల్లా టీకా చాలా ముఖ్యమైనది. చిన్న పిల్లల తల్లి దండ్రులు దీన్ని ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలి. యూరప్‌లో ఇప్పుడు తట్టు ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎంఆర్‌ టీకాను రాష్ట్రంలో 90 లక్షల మంది పిల్లలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్టు 17 నుంచి మొదలవుతుంది.  దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నా.
– వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement