మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు నిమిత్తం అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ హెవీ
పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం సర్కారు సంప్రదింపులు
2,900 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్ల కొనుగోలుకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు నిమిత్తం అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్.. భెల్) నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి గురువారం సచివాయలంలో బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాల నిమిత్తం బీహెచ్‌ఈఎల్ ప్రతినిధులతో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 1,066 మోటార్లు అవసరమని, 10 నుంచి 2,900 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటర్లను తయారు చేసి సకాలంలో అందించాలని ప్రశాంత్‌రెడ్డి బీహెచ్‌ఈఎల్ అధికారులను కోరారు.
అంతకు మునుపు భగీరథ ప్రాజెక్ట్ లక్ష్యం, పురోగతి, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును అధికారులకు ప్రశాంత్‌రెడ్డి వివరించారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై అవగాహనతోనే, కాంటూర్ల ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారని చెప్పారు. రాష్ట్రంలోని 26 సెగ్మెంట్లలో, 250 ప్రదేశాల్లో ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. బీహెచ్‌ఈఎల్ అధికారులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం తమకప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని, ప్రాజెక్ట్ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను అందిస్తామన్నారు.
త్వరలోనే సమగ్ర ప్రొడ క్షన్ ప్లాన్‌తో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహా దారు జ్ఞానేశ్వర్, ఓఎస్‌డీ సత్యపాల్, బీహెచ్‌ఈఎల్ జనరల్ మేనేజర్లు నరేంద్ర కుమార్, జీకే హెడూ, అదనపు జీఎం పంకజ్ రస్తోగి, మార్కెటింగ్ నిపుణుడు గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.