చార్జీ తక్కువ.. మన బస్సే ఎక్కండి ..!

చార్జీ తక్కువ.. మన బస్సే ఎక్కండి ..! - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సరికొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. పొరుగు రాష్ట్రాల టిక్కెట్టు చార్జీలు.. టీఎస్ ఆర్‌టీసీ టిక్కెట్టు చార్జీలలో వ్యత్యాసాన్ని ప్రయాణికులకు వివరించి.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టీఎస్‌ఆర్‌టీసీకి రోజుకు సగటున రూ. 54 లక్షల చొప్పున నష్టం వస్తుందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో మూడు డివిజన్ల పరిధిలో 11 రీజి యన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 95 డిపోలలో 10,521 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాష్ట్ర పరిధితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా మన బస్సులు తిరుగుతున్నాయి.ప్రస్తుతం ఏపీకి వెళ్లే టీఎస్‌ఆర్‌టీసీ బస్సులు తిరుగు ప్రయాణంలో చాలావరకు ఖాళీగా వస్తున్నాయి. దీంతో తీవ్రంగా నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. ఏపీఎస్‌ఆర్‌టీసీ కంటే టీఎస్ ఆర్‌టీసీలో టిక్కెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిని ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు సూచించారు. ఈ క్రమంలో డిపో మేనేజర్లు తమ పరిధిలో నడిచే బస్సులలో చార్జీల తీరు.. అదేవిధంగా ఇవే రూట్లలో నడిచే ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలతో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు రూపొందించారు.వీటిని బస్‌స్టాప్‌ల వద్ద ప్రయాణికులకు కనిపించే విధంగా ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ రూట్‌లో నడిచే దేవరకొండ డిపో బస్సుల చార్జీలు, ఇదే రూట్‌లో నడిచే ఆంధ్రప్రదేశ్ బస్సు చార్జీలు పేర్కొంటూ సైదాబాద్, సాగర్ రింగ్‌రోడ్ బస్‌స్టాపుల్లో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలో రూ.8, డీలక్స్ బస్ చార్జీల్లో రూ. 9 చొప్పున వ్యత్యాసం ఉన్నట్లు ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top