ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను తామే నిలిపివేశామని స్వయంగా రాష్ట్ర మంత్రులే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించిందని, దీనిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది.
- 'సాక్షి' టీవీ ప్రసారాల నిలిపివేతపై లోక్‌సత్తా పార్టీ డిమాండ్
హైదరాబాద్: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను తామే నిలిపివేశామని స్వయంగా రాష్ట్ర మంత్రులే ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించిందని, దీనిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది. రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ శనివారం ఓ ప్రకటనలో కోరారు.
రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తప్పుగా ఆలోచించడమే తనకు తెలియదని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులకు సాక్షి టీవీ ప్రసారాలపై అభ్యంతరాలుంటే మీడియా ముందు తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.