'దృశ్యం' చెక్కిన జీవితమిది

'దృశ్యం' చెక్కిన జీవితమిది


ఇప్పటి వరకు గడిచిన తన జీవితాన్ని రెండు భాగాలు చేస్తే.. దృశ్యం సినిమాకు ముందు, తర్వాత అని చెప్పాల్సి ఉంటుందని అంటోంది నటి కృతికా జయరామ్. వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో హీరో పెద్ద కూతురిగా నటించింది కృతిక. కథలోని కీలక మలుపులకు కారణమయ్యే పాత్ర పోషించిన కృతిక ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతోంది. సిటీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కృతికతో ముచ్చటించినప్పుడు పలు విషయాలు పంచుకున్నారిలా..

 

 నృత్యం మార్చిన దృశ్యం

 మేం తమిళులమే అయినా బెంగళూర్‌లో స్థిరపడ్డాం. నాన్న బిజినెస్. అమ్మ హౌస్‌వైఫ్. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. మలయాళీ నృత్యకారులు మిథున్ శ్యామ్ దగ్గర శిక్షణ పొందాను. ఒకసారి కేరళ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చాను. అప్పుడు నన్ను చూసిన ఒక మలయాళ దర్శకులు 'నువ్వు సినిమాల్లో రాణిస్తావం'టూ ప్రోత్సహించారు. అంతే కాకుండా దృశ్యం సినిమా ఆడిషన్లు జరుగుతున్నాయని చెప్పి తన వంతుగా నన్ను రికమెండ్ చేశారు. జర్నలిజం కోర్సు చేస్తున్న నేను ఆ సినిమాకి ఎంపికవడంతో జీవితం కీలకమలుపు తిరిగింది.

 

అవకాశాలొస్తున్నాయి

'దృశ్యం' సూపర్ హిట్టవడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో 'రామయ్యా వస్తావయ్యా'లో అవకాశం వచ్చింది. ఇక అక్కడి నుంచి సినిమా రంగంలో ప్రొఫెషనల్ అయిపోయాను. ప్రస్తుతం దర్శకుడు మారుతి, నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న 'రోజులు మారాయి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నాను. ప్రధాన పాత్రలని కాదు.. మంచి అభినయ ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేనెంతో ఇష్టపడే క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో నటించే అవకాశం వస్తే.. అంతకన్నా కావాల్సిందేముంది? నా అభిమాన నటీనటులు నిత్యామీనన్, అల్లు అర్జున్.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top