జల వివాదాలపై కదిలిన ‘ఢిల్లీ’!

krishna , godavari Water dispute - Sakshi

కృష్ణా, గోదావరిలోని వివాదాలపై 15న భేటీ

ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాలకు కేంద్ర జల వనరుల శాఖ పిలుపు

ఏడాదిన్నర తర్వాత వివాదాలపై స్పందించిన కేంద్రం

ఎజెండా తయారీలో నిమగ్నమైన రెండు బోర్డులు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కదలింది. ఏడాదిన్నర కిందట అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించిన అనంతరం తొలిసారి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఈ నెల 15న ఢిల్లీలో జరిగే భేటీపై ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ సమాచారం పంపింది. ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై ఈ నెల 7లోగా ఎజెండా తయారు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను ఆదేశించింది. ప్రస్తుతం రెండు బోర్డులు ఎజెండా తయారీలో నిమగ్నమయ్యాయి.

గొడవంతా కొత్త ప్రాజెక్టులపైనే..
కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మూడున్నరేళ్లుగా అనేక వివాదాలు ముసురుకున్నాయి. వీటిపై 2016 సెప్టెంబర్‌లో కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమావేశం జరగలేదు. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్తగా తెలంగాణ చేపడుతున్న తుమ్మిళ్లతో పాటే ఏపీ చేపడుతున్న పట్టిసీమ, గురు రాఘవేంద్ర, శివభాష్యంసాగర్, ముచ్చుమర్రి తదితర ప్రాజెక్టులపై వివాదం కొనసాగుతోంది.

తెలంగాణ రీడిజైన్‌ చేస్తున్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులతో పాటు వాటర్‌గ్రిడ్‌పైనా అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఏపీ కేంద్రం, బోర్డులకు ఫిర్యాదు చేసింది. గోదావరిపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై తెలంగాణ అడ్డుచెబుతోంది. ఇక వర్కింగ్‌ మ్యాన్యువల్‌పై చర్చ జరిగిన సమయంలో.. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది.

నిర్ణీత కేటాయింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటున్నామని చెబుతోంది. ఏపీ మాత్రం వాటాకు తూట్లు పొడిచి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని అంటోంది. పోతిరెడ్డిపాడు వినియోగంపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీనికి తోడు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ఇంతవరకు జరగలేదు. ఆవిరి, సరఫరా నష్టాలపై తేలలేదు.

90 టీఎంసీల అదనపు వాటాకై రాష్ట్రం కొట్లాట
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీలు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. వివాదాలకు తాత్కాలిక ఉపశమనం లభించినా, శాశ్వత పరిష్కారం లభించడం లేదు.

ఈ నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించాలని తెలంగాణ కోరినా సాధ్యపడలేదు. అయితే ఇటీవల కృష్ణా బోర్డుపై ఫిర్యాదు చేస్తూ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు నేరుగా కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి దశలో కార్యదర్శుల భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌ సింగ్‌ అధ్యక్షతన 15న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో ఈ భేటీ జరిగనుంది. ఈ భేటీకి సీఎస్‌ ఎస్‌కే జోషితో పాటు, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, ఏపీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top