
కడియం, ఎర్రబెల్లి మధ్య సఖ్యత కుదిరేనా?
ఆ ఇద్దరు నాయకులకు ఒకరంటే మరొకరికి సరిపడదు. ఒకే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులైన వారిద్దరు ఇప్పుడు మళ్లీ ఒకే గూటిలో చేరిపోయారు.
హైదరాబాద్: ఆ ఇద్దరు నాయకులకు ఒకరంటే మరొకరికి సరిపడదు. ఒకే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులైన వారిద్దరు ఇప్పుడు మళ్లీ ఒకే గూటిలో చేరిపోయారు. ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా అంటే... సన్నిహితంగా ఉండే నేతలు మాత్రం ఆ అవకాశాలే లేవని చెబుతున్నారు. అలాంటి వారిద్దరిని పార్టీలో చేర్పించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నిన్నటి వరకు టీడీపీలో ఉన్న సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు... వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో రాజకీయంగా విభేధాలున్నాయి. గత సాధారణ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరగా, టీడీపీ శాసనసభా పక్షం నేతగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం చేరారు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నాయకులు గత కొంత కాలంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు కూడా పరస్పరం ఘాటు విమర్శలు సంధించుకున్న సందర్భాలున్నాయి. జిల్లా రాజకీయాల్లో తమ మాట నెగ్గించుకునే ప్రయత్నాల్లో అనేకసార్లు వీరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి.
సాధారణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొత్తలోనే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరతారన్న వార్తలొచ్చాయి. అయితే సందర్భంగానుసారంగా ఆయన వాటిని ఖండిస్తూ వచ్చారు. ఎర్రబెల్లి చేరికను ఏదోరకంగా కడియం శ్రీహరి అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారని చెబుతుంటారు. ఆ కారణంగానే ఇంతకాలం ఎర్రబెల్లిని టీఆర్ఎస్ లో చేర్పించుకోలేదన్న ప్రచారం కూడా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎర్రబెల్లి వ్యవహారం తెరమీదకు రావడం, వెనువెంటనే ఆయన పార్టీ మారడం జరిగిపోయింది. ఎర్రబెల్లిని తీవ్రంగా వ్యతిరేకించే కడియం శ్రీహరికి తెలియకుండా జరిగిందా... లేక ఆయనకు చెప్పే చేర్పించుకున్నారా అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.
ఎంతో కాలం నుంచే ఎర్రబెల్లి నేరుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం సమయం కోసం వేచిచూసిన కేసీఆర్ ఒక్కసారిగా ఎర్రబెల్లి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే వరంగల్ జిల్లాలో ఎడమొహం పెడమొహంగా ఉండే వీరిద్దరిని ఏవిధంగా ఒకే వేదికపైకి తెస్తారు. అసలు వీరిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందా, ఈ విషయంలో కేసీఆర్ కు మరో ప్లాన్ ఏమైనా ఉందా అన్న విషయాలు ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైనా చివరి నిమిషయం వరకు కడియంకు ఎలాంటి సమాచారం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరిన విషయంలో కడియం శ్రీహరి ఇంతవరకు స్పందించలేదు. ఎర్రబెల్లి చేరికను కడియం శ్రీహరి ఏరకంగానూ సమర్థించరని, అయితే పార్టీ నాయకత్వం ముందు ఎలాంటి అంగీకారం కుదిరిందో తమకు తెలియదని కడియం వర్గీయులు చెబుతున్నారు. ఇంతకాలం రాజకీయంగా బద్ధశత్రువులుగా వ్యవహరించిన వీరిద్దరు రానున్న రోజుల్లో ఎలా ఉంటారన్న విషయం వేచిచూడాల్సిందే.