
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల ను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని కోరుతూ ఈ నెల 29న హైదరాబాద్‌లో మహా సభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు రాష్ట్రంలో 2.20లక్షల మంది ఉన్నట్లు తెలిపారు.
బుధవారం బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని అర్హతల ఆధారంగా క్రమబద్ధీకరించాలన్నారు. ఔట్‌సోర్సింగ్ వారి పరిస్థితి దారుణమన్నారు.. ప్రభుత్వం నెలవారీగా వేతనాలు ఇసున్నా ఔట్‌సోర్సింగ్ సంస్థలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.కృష్ణ, అంజి, ఎస్.రామలింగం, భూపేశ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.