రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు! | Heavy rainfall recorded in Hyderabad rural areas | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు!

Sep 21 2016 7:43 PM | Updated on Mar 28 2018 11:26 AM

వరుణుడు ఝడిపించాడు. మల్కాజ్‌గిరి డివిజన్‌పై ప్రతాపాన్ని చూపాడు.

రంగారెడ్డి జిల్లా : వరుణుడు ఝడిపించాడు. మల్కాజ్‌గిరి డివిజన్‌పై ప్రతాపాన్ని చూపాడు. మంగళవారం రాత్రి నుంచి ఈ డివిజన్లో కురిసిన భారీ వర్షాలకు కాలనీలన్నీ నీటిమునిగాయి. దాదాపు ఏడు మండలాల్లో బుధవారం ఉదయం వరకు భారీ వర్షమే నమోదైంది. దీంతో పలు కాలనీలు జలమయం కాగా... రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. బాలానగర్ మండలం కూకట్‌పల్లిలోని చెరువులకు గండిపడడంతో ఇళ్లలోని నీరుచేరింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క్రమంలో ఆ డివిజన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం... పాఠశాలలకు బుధవారం ఉదయమే సెలవును ప్రకటించింది.

ఈ సీజన్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. పదిరోజుల క్రితమం పరిగి, వికారాబాద్‌లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డు సృష్టించగా... తాగాజా బుధవారం కుత్భుల్లాపూర్ మండలంలో ఏకంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై గత రికార్డును బద్దలు కొట్టింది. అదేవిధంగా కీసర మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా జిల్లాలో బుధవారం నాడు 5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈనెలలో కురిసిన వర్షాలను పరిశీలిస్తే... ఇప్పటివరకు జిల్లాలో 24 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 11 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మాత్రం లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం.

కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్...
వర్షాల వల్ల ఏర్పడే సమస్యల్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దమవుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసింది. 18004250817 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యల్ని వివరించాలని కలెక్టర్ రఘు నందన్‌రావు సూచించారు. ఈ కంట్రోల్‌రూమ్‌ను నిరంతరం ముగ్గురు పర్యవేక్షిస్తున్నారని, సమస్య విన్నవించిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు(సెంటీమీటర్లలో)...
మండలం వర్షపాతం
కుత్బుల్లాపూర్ 23.0
బషీరాబాద్ 10.4
బాలానగర్ 11.0
శామీర్‌పేట్ 13.4
కీసర 15.0
మల్కాజ్‌గిరి 10.5
మేడ్చల్ 10.6.

Advertisement
 
Advertisement
Advertisement