హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం | ​Heavy rain pors in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం

May 10 2017 2:32 AM | Updated on Sep 5 2017 10:46 AM

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

- వడగళ్లతో భారీ వర్షం
- వర్షంలో చిక్కుకున్న తమను ఆదుకోవాలంటూ ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌కు నగరవాసుల ఫోన్లు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. క్యుములో నింబస్‌ మేఘాల కారణంగా రాత్రి 11 గంటల నుంచి సుమారు 40 నిమిషాల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ గాలి వాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో చెట్లు, భారీ హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ఫీడర్ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది. తిరుమలగిరి, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో వంద గ్రాములకుపైగా బరువున్న వడగళ్లు పడ్డాయి.

జడివానతో భయాందోళన
పెద్ద ధ్వనితో ఉరుములు, తీవ్ర వేగంతో ఈదురుగాలులు వీయడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు చోట్ల నాలాలు పొంగిపొర్లాయి, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాత భవనాల్లో ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఇక వడగళ్ల వాన కారణంగా రహదారులపై వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల ధాటికి పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

కేటీఆర్‌కు ట్వీటర్‌లో ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్‌లో భారీ వర్షంతో ఇబ్బందులు తలెత్తడంతో చాలా మంది నెటిజన్లు తమ ప్రాంతాల్లోని సమస్యలను మంత్రి కేటీఆర్‌కు ట్వీటర్‌ ద్వారా తెలిపారు. వాటిపై తక్షణమే స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.  ఎమర్జెన్సీ బృందాలు సత్వరం రంగంలోకి దిగాలని ఆదేశించారు. మరో వైపు వర్షంలో చిక్కుకున్న తమను ఆదుకో వాలంటూ జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కాల్‌ సెంటర్‌కు వెల్లువలా ఫోన్లు వచ్చాయి.

పలు జిల్లాల్లోనూ భారీ వర్షం
మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అకాల వర్షం కారణంగా పలు జిల్లాల్లో మామిడి తదితర తోటలకు.. పలు పట్టణాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ నిలిచిపోయింది.

ఎమర్జెన్సీ నెంబర్‌లు : 100 లేదా 040 21111111


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement