జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు

Harish rao fires on Pending money for farmers - Sakshi

రైతుల సొమ్ము పెండింగ్‌పై హరీశ్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: కంది కొనుగోళ్ల చెల్లిం పుల్లో ఆలస్యంపై మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు అధికారులపై మండిపడ్డారు. రైతులకు చెల్లించాల్సిన సొమ్ము పెండింగ్‌లో ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.145 కోట్లు కందుల రైతులకు, రూ.21 కోట్లు మొక్కజొన్న రైతులకు చెల్లించాలని.. వీటిని వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై తాను జిల్లాలు పర్యటించినపుడు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను సందర్శిస్తానని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాత రైతులకు చెల్లింపులో జాప్యం జరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానన్నారు.

మంగళవారం సచివాలయంలో మార్కెటింగ్‌ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్‌లో కంది దిగుబడి 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా రానుందని అంచనా వేశామన్నారు. 33 వేల మెట్రిక్‌ టన్నులు కొనేందుకే కేంద్రం సుముఖత చూపిందన్నారు. ఇప్పటివరకు 26,200 మెట్రిక్‌ టన్నుల కందులు మార్కెట్‌కు వచ్చినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరుతూ బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.  వివిధ జిల్లాల్లో పెండింగులో ఉన్న చెల్లింపులను వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించనున్నందున.. అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఏర్పాటుకోసం 3 ప్రైవేటు సంస్థలు ప్రజెంటేషన్‌ ఇచ్చాయన్నారు. 15 రోజుల్లో  పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్‌ సమర్పించాలని ఆయా సంస్థలను కోరారు.  

ఏపీ మంత్రి దేవినేనికి  హరీశ్‌రావు లేఖ
రాజోలిబండ ఆధునీకరణ పనులపై చర్చి ద్దామని, అందుకు సమయమివ్వాలని ఏపీ జల వనరుల మంత్రి దేవినేని ఉమామహే శ్వర్‌రావుకు మంత్రి  హరీశ్‌ లేఖ రాశారు. ఈ నెల 14న రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఆధునీకరణ పనులను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేసేందుకు కర్ణాటక జల వనరుల మంత్రి ఎంబీ పాటిల్‌ ఒప్పుకున్నారని, ఈ అంశంలో ఏపీ సహకారం కీలకం అయినందున మూడు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 

‘కాకతీయ’ నాలుగో దశ ప్రారంభానికి ఫిబ్రవరి 3 డెడ్‌లైన్‌
మిషన్‌ కాకతీయ నాలుగో దశ పనులను ఫిబ్రవరి 3 లోగా ప్రారంభించాలని హరీశ్‌రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈసారి మిషన్‌ కాకతీయలో ఫీడర్‌ చానల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. కాకతీయ 4వ దశ పనులపై మంగళవారం సచివాలయం నుంచి ఇరిగేషన్‌ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  నెలాఖరులోగా పనుల గ్రౌండింగ్‌ జరగాలని, ఏ రోజుకారోజు పనుల ఫొటోలను వాట్సాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top