అయితే.. అది సమతులమైనదైతేనే సుమా

Half of indians are not getting proper food - Sakshi

మీ టూత్‌పేస్టులో ఉప్పుందా?ఇదో ఫేమస్‌ యాడ్‌లోని ప్రశ్న.. నిజానికి ఇప్పుడు మనోళ్లను అడగాల్సిన ప్రశ్నమీ తిండిలో బలముందా అనే..

ఎందుకంటే.. భారతీయులు ఏది పడితే అది తినేస్తున్నారట.. జనాభాలో సగం మంది సమతుల ఆహారం తీసుకోవడమే లేదట. 2015–16 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో సగం మంది.. ముఖ్యంగా మహిళలు సమతుల ఆహారానికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి తోడ్పడే పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, పాల ఉత్పత్తులు చాలా తక్కువగా తీసుకుంటున్నారు. పది శాతం మంది నిత్యం వేయించిన ఆహార పదార్థాలే తింటుంటే.. మరో 36 శాతం మంది వారానికోసారి ఫ్రైడ్‌ ఫుడ్‌ తింటున్నారు. 

సమతుల ఆహారం అంటే..
సమతుల ఆహారం అంటే సరిపడా ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవడమే. అయితే 45 శాతం మంది మహిళలు మాత్రమే రోజూ పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి తింటున్నారని, పాలు, పెరుగు నిత్యం తీసుకునేవారి సంఖ్య 45 శాతమే అని వారానికి ఒకసారి వీటిని వినియోగించే వారి సంఖ్య 23 శాతమని సర్వే పేర్కొంది. 7 శాతం మంది అసలు పెరుగుగానీ, పాలుగానీ తీసుకోవడం లేదని, మరో 25 శాతం మంది వీటిని అప్పుడప్పుడే తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. 54 శాతం మంది మహిళలు వారానికి ఒకసారి కూడా తాజా పళ్లు తినడం లేదని, చాలా తక్కువ మంది మహిళలే రోజువారీగా చికెన్, మటన్, చేప, కోడిగుడ్డు వంటివి తింటున్నారని తేలింది. పురుషుల పరిస్థితీ ఇంత తీవ్రంగా లేకున్నా.. వీళ్లతో పోలిస్తే.. కొంచెం బెటర్‌గా ఉందట. దేశ జనాభాలోని మొత్తం మహిళల్లో 47 శాతం మంది నిత్యం కూరగాయలను, ఆకు కూరలను తింటున్నారు. మరో 38 శాతం మంది వారానికి ఒకసారి మాత్రమే వీటిని తీసుకుంటున్నారని వెల్లడైంది.

పేదరికం..వివక్ష.. జంక్‌ఫుడ్‌..
మహిళలు అసమతుల ఆహారం తీసుకోవడానికి ప్రధాన కారణం పేదరికం, వివక్ష, జంక్‌ఫుడ్‌ అని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రంజనా కుమారి చెప్పారు. దేశ ఆహార అలవాట్లలో కూడా లింగ వివక్ష ఉందన్నారు. ఇక్కడ మహిళలు తక్కువ ఆహారం తినడానికి అలవాటు పడిపోయారని, వారి ఆహార అవసరాలను గుర్తించే పరిస్థితులు కూడా లేవని, దీని వల్ల అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఇటీవలి కాలంలో మార్కెట్‌ పరిణామాలు మారిపోయాయని, దీంతో జంక్‌ఫుడ్‌కు ప్రాధాన్యత పెరిగిందని, ఎక్కువ మంది మహిళలు ముఖ్యంగా యువతులు ఈ అనారోగ్యకర ఆహారం తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశముంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– సాక్షి, తెలంగాణ డెస్క్‌ 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top