విశ్వనగరమా నీవెక్కడ..? | GHMC Elections Special | Sakshi
Sakshi News home page

విశ్వనగరమా నీవెక్కడ..?

Jan 22 2016 2:43 AM | Updated on Sep 3 2017 4:03 PM

విశ్వనగరమా నీవెక్కడ..?

విశ్వనగరమా నీవెక్కడ..?

హైదరాబాద్ మహానగరం.. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మక నగరం. స్మార్ట్ సిటీ, విశ్వనగరి వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ‘గ్రేటర్’ పట్టణం.

హైదరాబాద్ మహానగరం.. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన చారిత్రాత్మక నగరం. స్మార్ట్ సిటీ, విశ్వనగరి వైపు వడివడిగా అడుగులు వేస్తున్న ‘గ్రేటర్’ పట్టణం. కానీ సామాన్యుడి కళ్లెదుట కనిపిస్తున్న నిజం.. ఇదేనా. కాదు.. కానే కాదు. మురికివాడలు, ఇరుకు రోడ్లు.. క‘న్నీటి’ కష్టాలు, మరుగుకు ముప్పుతిప్పలు, గూడు లేని బీడు బతుకులు. ఇలా నగరజీవి నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలెన్నో. అయినా హైదరాబాద్ నగరం వివిధ సర్వేల్లో జీవించడానికి అనుకూలంగా ఉండే పట్టణాల్లో స్థానం సంపాదించింది. అవును ఇదీ నిజమే. భాగ్యనగరికే సొంతమైన పరిస్థితి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోయినా కాగితాల్లోకి ఎక్కిన కఠోర వాస్తవం.

గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నగర స్థితిగతులను మార్చే నాయకుడెవరని  ప్రజానీకం పరీక్షిస్తున్న వేళ.. బడుగు జీవి బతుకుకు భరోసానిస్తూ.. సౌకర్యాల కల్పనకు నాయకులు  నడుంబిగించాల్సిన అంశాలపై ‘సాక్షి’ సిటీ స్కాన్.
- సాక్షి, సిటీబ్యూరో

 
సిటీలో నానాటికీ మురికివాడల సంఖ్య పెరుగుతోంది. ఉపాధి కోసం ఇతర జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వలస రావడమే దీనికి కారణం. మురికివాడల ప్రజల స్థితిగతుల్ని మార్చడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా అవి తగిన ఫలితాలివ్వలేదు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్లో అర్ధంతరంగా ముగిసిన కొన్ని...
     
* 1984లో ప్రారంభించిన మురికివాడల అభివృద్ధి పథకం 1989లో ముగిసింది. కానీ దీని లక్ష్యం నెరవేర లేదు.
* 1996లో జాతీయ మురికివాడల అభివృద్ధి పథకం(ఎన్‌ఎస్‌డీపీ) ప్రారంభించారు. ఇదీ ఆశించిన ఫలితాలివ్వలేదు.  
* 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ అర్బన్ సర్వీసెస్ ఫర్ పూర్(ఏపీయూఎస్‌పీ)
* పథకంలో భాగంగా దాదాపు 18వేల ఇళ్లు నిర్మించారు. కానీ సదుపాయాలు లేక ఇవి నిరుపయోగంగా ఉండిపోయాయి.
* బేసిక్ సర్వీసెస్ ఫర్ అర్బన్ పూర్(బీఎస్‌యూపీ) కింద కేంద్ర ప్రభుత్వం 78 వేల ఇళ్లు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు లేక, లబ్ధిదారులు తమ వంతు వాటాలు చెల్లించలేక, బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. నిర్మించిన ఇళ్ల తలుపులు, సామగ్రి దొంగల పాలవుతోంది.
* ఐదేళ్లలో రూ.12 వేల కోట్లతో మురికివాడల రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో రాజీవ్ ఆవాస్ యోజన(ఆర్‌ఏవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి పైలట్ ప్రాజెక్టుగా కేశవనగర్‌ను ఎంపిక చేశారు. దాదాపు రూ.59 కోట్లతో 240 ఫ్లాట్లలో 334 ఇళ్లు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ జీప్లస్1, జీప్లస్2 పద్ధతిలో నిర్మాణాలకు లబ్ధిదారులు సుముఖంగా లేకపోవడంతో పథకం ముందుకు సాగలేదు.
 
‘డబుల్’ ఆశ..
ఈ పథకాలన్నీ విఫలమవడంతో ప్రస్తుత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శ్రీకారం చుట్టింది. ఐడీహెచ్ కాలనీలో వీటిని విజయవంతంగా పూర్తి చేసింది. గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లోనూ వీటి నిర్మాణానికి ఇటీవలే హడావిడిగా శంకుస్థాపనలు చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపికలో రాజకీయంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలో ఇళ్లు లేని దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా లక్షల్లో ఉన్నాయి. పూర్తిగా ఉచితంగా కాకపోయినా తమకు కూడా తగిన పథకం ద్వారా ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందని వారు ఆశపడుతున్నారు. ఆ దిశగానూ ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. లేని పక్షంలో నగరంలో గృహ సమస్య తీరదు.  
 
ఉపాధి లేమి..   
నగరం అభివృద్ధి చెందుతోందని ఎవరెంతగా చెబుతున్నా దాదాపు 45 శాతం మంది ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. మిగతా వారు వేతనజీవులుగా, దినసరి కూలీలుగా, సాధారణ పనుల ద్వారా బతుకు వెల్లదీస్తున్నారు.
 
దారులు.. దయనీయం

సిటీలో మరో ప్రధాన సమస్య రహదారులు. రోడ్లు తగినంత విస్తీర్ణం లేక తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఫుట్‌పాత్‌లు లేక, రోడ్డు దాటేందుకు వీలుగా సదుపాయాలు లేక ప్రతి ఏటా 200 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్కైవేల నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం ఫుట్‌పాత్‌లు నిర్మించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. పాదచారులు రోడ్డు దాటేందుకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదు. పాదచారుల ఫిర్యాదుల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, సమగ్ర పాదచారుల ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవేవీ అమలుకు నోచుకోలేదు.
 
అట్టడుగు...
దేశంలోని ఏ నగరం పాదచారులకు యోగ్యంగా ఉందన్న అంశంపై నిర్వహించిన ఓ సర్వేలో బెంగళూర్‌కు 44 శాతం, చెన్నైకి 28 శాతం, పుణెకు 16 శాతం ఓట్లు లభించగా.. హైదరాబాద్‌కు కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
 
విభిన్నం.. విచిత్రం
మెర్సర్ సంస్థ జీవించడానికి అనుకూలంగా ఉన్న నగరాల (లివబుల్ సిటీస్)పై 2015లో నిర్వహించిన సర్వేలో మొత్తం 230 పట్టణాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. అందులో ఆస్ట్రియాలోని వియన్నా ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్ 138వ స్థానంలో ఉంది. పుణె 145, బెంగళూర్ 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్‌కతా 160 స్థానాల్లో నిలిచాయి. మన దేశంలో మనమే టాప్‌లో ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు వెక్కిరిస్తున్నాయి. ఇదే సంస్థ 2011లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌కు చోటే లేదు. ఇదీ నగర భిన్నత్వం.
 
ఇతర నగరాల్లో పాదచారుల
సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలు...

* పుణె కార్పొరేషన్ బడ్జెట్‌లో ఒకటి నుంచి రెండు శాతం వరకు పాదచారుల సదుపాయాలకే ఖర్చు చేస్తున్నారు.
* ఢిల్లీ, బెంగళూర్‌లలో పాదచారులు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన జీబ్రా క్రాసింగ్‌ను వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానా.
* బెంగళూర్‌లో రోడ్డు దాటే సమయంలో పాదచారులకు పోలీసుల నుంచి తగిన సహకారం, చేయూత లభిస్తుంది.  
* ముంబైలో సమర్థవంతమైన సిగ్నలింగ్ వ్యవస్థతో పాదచారులకు సదుపాయంగా ఉంది.
 
గ్రేటర్‌లోని మురికివాడలు    :    1476
నోటిఫైడ్    :    1179
నోటిఫై కానివి    :    297
మురికివాడల మొత్తం విస్తీర్ణం    :    80 చ.కి.మీ.
మురికివాడల్లోని జనాభా    :    19,52,000
గ్రేటర్ జనాభాలో వీరు    :    29 శాతం  
 
పెరుగుతున్న ధరలు
రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో నగరంలో జీవనం దుర్లభమవుతోంది. కార్పొరేట్, ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగినట్లుగా మిగతా వారి వేతనాలు పెరగకపోవడంతో అసమానతలు తలెత్తుతున్నాయి. మెజార్టీ ప్రజలు ధరల భారంతో సతమతమవుతున్నారు.
 
సమస్యల పర్వం
* సిటీలో ప్రజారవాణా అస్తవ్యస్తంగా ఉంది. సరిపడా బస్సులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు.
* కాలుష్యం పెరగుదల గ్రేటర్‌ను వణికిస్తోంది. ఇప్పడికే ప్రమాదకర స్థాయికి చేరిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* నగరంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కరవై సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదు.
* గ్రేటర్‌లో నిత్యం నీటి కష్టాలే. జనాభాకు సరిపడా నీటి సరఫరా లేదు.
* పారిశుధ్య నిర్వహణ పట్టించుకున్న వారే లేరు. చెత్త రహదారులపై గుట్టలుగా పేరుకుపోతోంది.
* రోడ్లపైనే డ్రైనేజీ పొంగిపొర్లుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement