ఈ నెల 15న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి, ఎంసెట్ కమిటీ చేపట్టిన కసరత్తు పూర్తయింది.
హైదరాబాద్: ఈ నెల 15న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి, ఎంసెట్ కమిటీ చేపట్టిన కసరత్తు పూర్తయింది. 1,44,510 మంది ఇంజనీరింగ్ 1,02,012 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ సిబ్బందితోనే నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు సమావేశమై పరీక్ష కేంద్రాలను నిర్ణయించారు.
ఇంజనీరింగ్కు 276 పరీక్ష కేంద్రాలు అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు 190 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరును నమోదు చేయనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని రమణారావు తెలిపారు. పరీక్ష జరిగిన రోజే(మే15న) ఎంసెట్ కీ విడుదల చేయనున్నారు. మే 27న ఎంసెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. జూలై 1 నుంచి ఇంజనీరింగ్, మెడికల్ తరగతులు ప్రారంభం కానున్నాయి.