ప్రభుత్వంలో ఏదైనా పనిచేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. అయినా సకాలంలో బిల్లులు వస్తాయో లేదో తెలియదు
జెన్‌కోలో విచిత్రం
కాంట్రాక్టు పొందిన కంపెనీ స్థానంలో అనుమతిలేని కంపెనీ పనులు
11 నెలలుగా పట్టించుకోని అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఏదైనా పనిచేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. అయినా సకాలంలో బిల్లులు వస్తాయో లేదో తెలియదు. అయితే, జెన్‌కోలో మాత్రం ఎటువంటి ఆర్డర్ లేకపోయినా ఒక కాంట్రాక్టు సంస్థ గత 11 నెలలుగా పనులు చేసేస్తోంది. ఇప్పుడు తీరిగ్గా తాము చేసిన పనికి బిల్లులు చెల్లించాలని దరఖాస్తు చేసుకుంది. అసలు ఆర్డరు లేకుండా బిల్లులు ఎలా ఇవ్వాలంటే.. రాజకీయ నేతల నుంచి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తోంది. జెన్‌కోలోని ఈ చిత్ర విచిత్రం వివరాలిలా ఉన్నాయి..
వరంగల్ జిల్లాలో జెన్‌కోకు చెందిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటులో యాష్ పాండ్ హ్యాండ్లింగ్ కాంట్రాక్టును పూజిత అనే సంస్థ 2013-14 సంవత్సరానికిగానూ పొందింది.
అయితే, సదరు పూజిత కంపెనీ పనులు చేయలేదు. పైగా జెన్‌కో నుంచి అనుమతి తీసుకోకుండానే వెంకట్రావు అనే కంపెనీకి అప్పగించింది.
ఈ వెంకట్రావు కంపెనీకి లేబర్ లెసైన్సు కూడా లేదు. అయినప్పటికీ వెంకట్రావు కంపెనీ పనిచేస్తున్నప్పటికీ.. స్థానికంగా జెన్‌కో అధికారులు అభ్యంతరం చెప్పలేదు.
జెన్‌కో నుంచి అధికారికంగా అనుమతి లేకపోయినప్పటికీ సదరు కంపెనీ 2013 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు అంటే 11 నెలలుగా పనులు చేస్తోంది.
సుమారు కోటి రూపాయలకుపైగా తమకు బిల్లులు చెల్లించాలని జెన్‌కోను సదరు సంస్థ కోరుతోంది.
ఇందుకోసం ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ మహిళా నేతతో పాటు అనేక మంది రాజకీయనాయకులతో పైరవీ చేయిస్తూ జెన్‌కో అధికారులపై ఒత్తిడి తెస్తోంది.
అనుమతి లేకుండా పనులు చేసిన సంస్థపైకానీ, అనుమతించిన స్థానిక అధికారులపైకానీ జెన్‌కో యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదు. పైగా సదరు కంపెనీకి బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ం