Sakshi News home page

శ్రీజకు రూ.10 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం

Published Mon, Apr 11 2016 8:44 AM

శ్రీజను ఆశ్వీరదిస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi

♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్
♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత
♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ
 
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగం, శాతవాహనుల పాలనా దక్షత, నిజాం నవాబుల హయాంలోని ప్రగతి, సమైక్య రాష్ట్రం-తెలంగాణ ఉద్యమం.. ఒక్కటేమిటి ఇలా అనేక విషయాలను ఓ చిన్నారి ధారాళంగా చెబుతుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఎలాంటి భయం లేకుండా మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి సీఎం ముందు అనేక విషయాలను అనర్గళంగా చెప్పింది. ఆ పాప జ్ఞాపకశక్తి, మేధోసంపత్తికి ముగ్ధుడైన సీఎం తన సొంత ఖాతా నుంచి రూ.10 లక్షల పదహార్లు అందజేశారు. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఏదైనా ఓ రోజు భోజనానికి వస్తానని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

అనర్గళంగా చెప్పడంలో దిట్ట
ఖమ్మంకు చెందిన కిరణ్‌కుమార్, సుధారాణి దంపతుల కూతురు లక్ష్మీ శ్రీజ.. ఎన్నో విషయాలను గుర్తుంచుకుని తిరిగి చెప్పడంలో దిట్ట. పాప ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తెలంగాణ చరిత్రతో పాటు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించేవారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్లు ఇలా అనేక విషయాలను అలవోకగా శ్రీజ చెప్పేస్తుంది. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీజ తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిశారు. ముందుగా చెప్పినవే కాకుండా అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెప్పే తీరును చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారు.

Advertisement
Advertisement