పోలీసులపైకి బ్రహ్మాస్త్రం


పంజగుట్ట: న్యాయపరమైన, చట్టానికి, రాజ్యాంగానికి సంబంధించిన సమాచారం తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయని అలాంటి సమాచారంతో కూడుకున్న పుస్తకం రావడం ఎంతో సంతోషకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది, రచయత నర్సింగరావు రచించిన ‘ప్రభుత్వ అధికారుల, పోలీసుల పైకి బ్రహ్మాస్త్రం’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ రాజకీయ జెఏసీ చైర్మర్ ప్రొఫెసర్ కోదండరామ్‌లు కలిసి ఆవిష్కరించారు.



ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ .. సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్దమయ్యే విధంగా ఎంతో క్లిష్టమైన విషయాలు పుస్తకంలో అందించారని కొనియాడారు. చట్టం, మానవహక్కులు, ప్రాథమిక హక్కులు, కలెక్టర్ విధులు, పోలీస్ ఉన్నతాధికారుల విధులు, పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఏమి చేయాలి, బెయిల్ పొందడం ఎలా, పోలీసులు, ప్రభుత్వ అధికారులు నేరం చేసినా, అవినీతికి పాల్పడినా ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి విషయాలు కూడా స్పష్టంగా పుస్తకంలో పొందుపర్చారని తెలిపారు.



ప్రభుత్వం వారు ఈ పుస్తకాన్ని అన్ని జిల్లాల్లో అన్ని లైబ్రరీల్లో ఉంచాలని, హైకోర్టు వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రతి కోర్టుకు పంపితే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ... చట్టంపై, రాజ్యాంగంపై ప్రజలకు ఎంత తెలిస్తే వారి హక్కుల సాధనకోసం అంతగా ఐక్యమౌతారని అన్నారు. గతంలో బొజ్జాతారకం పోలీసులు అరెస్టు చేస్తే అనే పుస్తకం తెస్తే ప్రజలు ఇష్టంగా కొనుక్కుని చదివి తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం చేశారని, ఈ పుస్తకం కూడా అలాంటిదేనని అన్నారు.



చట్టం కల్పిస్తున్న అనేక హక్కులు ట్రేడ్‌యూనియన్, కనీసవేతన చట్టాలు, మానవహక్కుల చట్టాలు పొందుపర్చి ఉందని ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందిన్నారు. పుస్తక రచయత నర్సింగ్‌రావు మాట్లాడుతూ ..పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఈ పుస్తకం వ్యతిరేకం కాదని, చట్ట విరుద్దమైన పనులు చేసిన వారికి బ్రహ్మస్త్రంలా ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top