‘గురుకులాల్లో’ ప్రవేశాలకు దరఖాస్తులు | Biometric in Inter spot centers | Sakshi
Sakshi News home page

‘గురుకులాల్లో’ ప్రవేశాలకు దరఖాస్తులు

Mar 16 2017 1:15 AM | Updated on Sep 5 2017 6:10 AM

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7 తరగతులు, జూనియర్, మహిళా డిగ్రీ కాలేజీల్లో

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో  5, 6, 7 తరగతులు, జూనియర్, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్యభట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 16తో గడువు ముగుస్తుందని, 6, 7 తరగతులకు సంబంధించి ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూనియర్‌ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 5వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అర్హులైన విద్యార్థులు  mjptbcwreis.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్‌సైట్‌లో ‘మోడల్‌ స్కూల్‌’ మెరిట్‌ జాబితా
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు గత నెల 26న పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ వెబ్‌సైట్‌లోకి (telanganams.cgg.gov.in) వెళ్లి పాఠశాలల వారీగా పరీక్షకు హాజరైన విద్యార్థులు, వారి ర్యాంకులను పొందవచ్చని వివరించారు. ఈ సమాచారాన్ని సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్ల వద్ద కూడా పొందవచ్చని తెలిపారు. పాఠశాలల వారీగా ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలోనే ప్రిన్సిపాళ్లకు, డీఈవోలకు పంపిస్తామని పేర్కొన్నారు.

ఇంటర్‌ స్పాట్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌
ఇష్టానుసారం పేపర్లు దిద్ది ముందుగా వెళ్లిపోకుండా చర్యలు  
ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పరికరాలను ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ నెల 8న సంస్కృతం వంటి పేపర్ల మూల్యాంకనం ప్రారంభమైనా, ఈ నెల 16 నుంచి ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ మూల్యాంకనంలో దాదాపు 25 వేల మంది లెక్చరర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మూల్యాంకన కేంద్రాల్లో బయోమెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేసింది. గతంలో మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే లెక్చరర్లు కొద్ది గంటల్లోనే తమకిచ్చిన 30 జవాబు పత్రాలను ఆదరాబాదరాగా మూల్యాంకనం చేసి నిర్ణీత సమయానికంటే ముందుగానే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అనేకమంది విద్యార్థులకు మార్కుల్లో తేడాలు వచ్చాయి.

వేలమంది విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ కమ్‌ ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేయడంతో ఈ లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి లెక్చరర్లు తొందరగా పేపర్లు దిద్ది, ముందుగా వెళ్లిపోకుండా, నిర్ణీత సమయం వరకు ఉండేలా, నిదానంగా మూల్యాంకనం చేసేందుకు బయో మెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement