ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరు పెరిగింది. మొన్నటివరకు నాలుగైదు కేసులే నమోదు కాగా...
సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు పెరిగిన కాపీయింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరు పెరిగింది. మొన్నటివరకు నాలుగైదు కేసులే నమోదు కాగా, శనివారం కాపీయింగ్ చేస్తూ 28 మంది పట్టుబడ్డారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో 8 మంది, రంగారెడ్డిలో 8 మంది, మెదక్‌లో ఏడుగురు, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, కరీంనగర్, నల్లగొండ, అదిలాబాద్‌ల్లో ఒక్కరు చొప్పున పట్టుబడ్డారు. శనివారం జరిగిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 4,31,898 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,08,151 మంది(94.50 శాతం) హాజరయ్యారు.
ఒకరికి బదులు ఇంకొకరు...: ఇంటర్ పరీక్షల్లో ఓ విద్యార్థి తన పరీక్షను స్నేహితుడితో రాయించబోయి ఇన్విజిలేటర్‌కు చిక్కాడు. చంచల్‌గూడకు చెందిన ఓ విద్యార్థి హిమాయత్‌నగర్‌లోని న్యూ సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఇంగ్లిష్ పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థి తన హాల్‌టికెట్‌ను డిగ్రీ చదువుతున్న తన స్నేహితుడికి ఇచ్చి పరీక్ష రాయాల్సిందిగా కోరాడు.
దీంతో అతను హిమాయత్‌నగర్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఫొటో చెకింగ్‌లో ఇన్విజిలేటర్‌కు చిక్కాడు. దీంతో ఇద్దరు విద్యార్థులతో పాటు వీరికి సహకరించిన మరో యువకుడిని కూడా నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మైనర్ కావడం వల్ల జువెనైల్ హోంకి పంపిస్తామని సీఐ భీమ్‌రెడ్డి తెలిపారు.