రచయితలు ఏకతాటిపై నడవాలి


కవులు, రచయితలు ఏకతాటిపై నిలవాలని రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అన్నారు. రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ లోగో ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేపల్లి మాట్లాడుతూ విభజనానంతరం రాష్ట్రంలో కవులు, కళాకారులు, రచయితలు అనేక రకాలుగా వెనుకబడి ఉన్నారని, తెలుగుభాషా ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం రాష్ట్రంలోని పద మూడు జిల్లాల్లోని కవులను కలిసి వారి అభిప్రాయాల మేరకు నూతన సంస్థను స్థాపించామన్నారు.


ఉన్నతాశయాలతో సంస్థను ముందుకు నడిపించాల్సిన అవసరం కవులు గుర్తించాలన్నారు. సీనియర్ పాత్రికేయుడు, కవి, రచయిత సీహెచ్ శర్మ మాట్లాడుతూ రచయిత సంఘాలు రచయితలను ప్రోత్సహించాలని అన్నారు. రచయితలు రాయడం అలవాటుగా చేసుకోవాలని, సాహిత్యాన్ని చదవాలని సూచించారు. రచయితల సంఘం కోశాధికారి కలిమిశ్రీ చిత్రించిన రచయితల సంఘం లోగోను సోమేపల్లి ఆవిష్కరించారు. 


సంస్థ ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ సంఘం లక్ష్యాలను వివరించారు. రచయిత్రులు వై.పాప, కోపూరి పుష్పాదేవి తదితరులు ప్రసంగించారు. రచయితలు వి.సుధారాణి, పి,రాజశేఖర్, పద్మావతి శర్మ, బి.ఆంజనేయరాజు, అరసవిల్లి కృష్ణ, శిఖా ఆకాష్, కె.ఆంజనేయకుమార్ సంఘ అభివృద్ధికి పలు సూచనలు చేశారు.



 




 

Read also in:
Back to Top