అయితే వంకాయ్..లేదా బంగాళదుంప | No quality food in government hostels says | Sakshi
Sakshi News home page

అయితే వంకాయ్..లేదా బంగాళదుంప

Published Sun, Nov 29 2015 9:18 AM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

అయితే వంకాయ్..లేదా బంగాళదుంప - Sakshi

క్యారెట్ అంటే హాస్టల్ విద్యార్థులకు తెలియదు
కుళ్లిన గుడ్లే పౌష్టికాహారమా!
మెనూ అమలులో లోపాలపై  కమిటీ ఆగ్రహం
 
విశాఖపట్నం (మహారాణిపేట) : అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలయ్యే కార్యక్రమాలు ప్రజలకు తెలియడం లేదని మహిళా శిశు సంక్షేమ శాసన సభా కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో సమస్యలపై చర్చించారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని గుర్తించామన్నారు. ఏడాదంతా వంకాయ లేకపోతే బంగాళదుంపతోనే సరిపెడుతున్నారని వారికి క్యారెట్, ఆకుకూరలు అంటే తెలియదని కమిటీ సభ్యురాలు పాలకొండ ఎమ్మెల్యే  విశ్వరాయి కళావతి చైర్‌పర్సన్ దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లే పౌష్టికాహారంగా ఇస్తున్నారన్నారు.
 
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఇటీవల అంగన్‌వాడీల్లో భర్తీ చేసిన లింక్ వర్కర్లు, ఆయా పోస్టుల్లో అవకతవకలు జరిగాయని, ఈ పోస్టుల భర్తీలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యం ఇచ్చారని చైర్‌పర్సన్ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర్రావు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు గ్యాస్ సక్రమంగా సరఫరా చేయడం లేదని, కేంద్రాలను పర్యవేక్షించడానికి సరిపడినంత మంది సూపర్‌వైజర్లు లేరని సగానికి సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏడు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు అమృత హస్తం నిధులు ఇవ్వలేదని కేంద్రాలకు అద్దె డబ్బులు సరిగా చెల్లించడం లేదని, చాలా కేంద్రాలకు సొంతభవనాలే లేవని కేంద్రాల్లో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చెరువు, రోడ్డు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఆనుకొని ఉన్న అంగన్‌వాడీలకు ప్రహరీలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. సభ్యులు అడిగిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్‌పర్సన్ మీసాల గీత అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి చిన్నపిల్లలతో వచ్చే వారందరిని ఓ దగ్గర ఉంచేందుకు ప్లే స్కూల్ మాదిరిగా ఓ గదిని ఏర్పాటు చేయాలని సూచించారు.

వికలాంగులను తీసుకు వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. జీవీఎంసీలో 2లక్షల 22వేల మంది డ్వాక్రా మహిళలుండగా కేవలం 700మందికి మాత్రమే స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని యూసీడీ పీడీ శ్రీనివాసన్ చెప్పడంపై గీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వికలాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతులు సక్రమంగా ఇవ్వని సంక్షేమశాఖ సహాయ సంచాలకులపై మండిపడ్డారు. సమావేశంలో కలెక్టర్ ఎన్.యువరాజ్, జేసీ-2 వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, జి.లక్ష్మీదేవితో పాటు  దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కమిటీ వికలాంగులకు వీల్ చైర్లు అందజేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement