చిన్నారి గుండెకు భరోసా | Sakshi
Sakshi News home page

చిన్నారి గుండెకు భరోసా

Published Sat, Feb 10 2018 9:18 AM

uk healing little hearts foundation help for heart problom kids - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆంధ్రా హాస్పిటల్, యూకేలోని హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ చారిటీస్‌ ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించిన శిబిరంలో వైద్యులు అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలతో బాధపడుతున్న 20 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశారు.  వారిలో రెండు వారాల శిశువు నుంచి పదేళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఉన్నట్లు ఆంధ్రా హాస్పిటల్‌ పిడియాట్రిక్‌ చీఫ్‌ డాక్టర్‌ పీవీ రామారావు తెలిపారు. ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ యూకే చారిటీకి చెందిన 11 మంది వైద్య బృందం ఐదు రోజుల పాటు ఆపరేషన్లు చేశారన్నారు. బృందం ఇప్పటివరకూ 12 సార్లు శిబిరాలు నిర్వహించి 250 మంది చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారన్నారు.

అవగాహన పెరిగింది..
పిల్లల గుండె సమస్యల విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగిందని ప్రవాసాంధ్రుడు, యూకే పిడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ రమణ ధున్నపునేని అన్నారు. రానున్న కాలంలో మరింత మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. తెలంగాణాలో కూడా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శిబిరంలో యూకేకు చెందిన వైద్యులు అమల్‌బోస్, నవీన్‌రాజ్, పీటర్‌జిరాసెక్, కృష్ణప్రసాద్, కలైమణి, విక్టోరియా, మానులెలా, కార్ల థామస్, పిడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ విక్రమ్‌ కుడుముల, కార్డియాలజిస్ట్‌ శ్రీమన్నారాయణ, డాక్టర్‌ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement