తెలంగాణలో ‘విమోచనం’ గల్లంతు

Kishan Reddy Special Aricle On Telangana Liberation Day - Sakshi

సందర్భం

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నేటికీ జరుపుకోలేకపోవడంతో నాటి తెలంగాణ పోరాట యోధుల ఆత్మలు ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. నాటి భారత హోమ్‌ శాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ధైర్యంగా చేపట్టిన ‘పోలీస్‌ యాక్షన్‌’తోనే ప్రజలకు స్వతంత్రం లభించింది. కానీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి నేటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరకు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. మజ్లిస్‌ పార్టీ ఒత్తిడికి తలొగ్గడం, మైనార్టీల ఓట్ల కోసం పాట్లు కారణం కావచ్చు.. హిందూ మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం పాలనను ఎంతో గొప్ప పరిపాలనగా కేసీఆర్‌ అభివర్ణిస్తున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ నిర్వహించకపోవటం బాధాకరం. తెలంగాణ సాయుధ పోరాట విరమణకు సంబంధించి నాటి కమ్యూనిస్టు ఉద్యమ నేతల మధ్య విభేదాలు ఉండటం కూడా గమనార్హం.

‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి గోల్కొండ కోట కింద నీ గోరి కడతాం నైజాం సర్కరోడా’ అంటూ నినదించిన నాటి తెలంగాణ పోరాట యోధుల ఆత్మలు ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. కారణం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేకపోవడమే. ఉద్యమాల గడ్డ తెలంగాణ ఆది నుంచి తన విశిష్టతలను చాటుకుంటోంది. భారతదేశానికి ఆగస్టు 15 1947న స్వాతం త్య్రం వస్తే తర్వాత 13 నెలల 2 రోజులకు అంటే 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ స్వేచ్ఛ పొందింది. నిరంకుశ నిజాం నవాబు పాలన నుంచి పూర్తిగా విముక్తమైంది. నాటి భారత హోం శాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ధైర్యంగా చేపట్టిన ‘పోలీస్‌ యాక్షన్‌’తోనే ప్రజలకు స్వతంత్రం లభిం చింది. అయితే ఉమ్మడి రాష్ట్ర పాలకులే దుర్బుద్ధితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు. కారణం నిజాం రజాకార్ల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మజ్లిస్‌ పార్టీ ఒత్తిడికి తలొగ్గడమే. హైదరాబాద్‌ సంస్థానంలో హిందువులను, హిందూ మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన నిజాం పాలనను ఎంతో గొప్ప పరిపాలనగా కేసీఆర్‌ అభివర్ణిస్తున్నారంటే మైనార్టీల ఓట్ల కోసమేనని విడమరిచి చెప్పనవసరం లేదు.

రజాకార్ల హింస అమానుషం
నిజాం పాలన నుంచి విముక్తి కోసం ఏళ్ళ తరబడి పోరాటాలు ఎంతోమంది బలిదానాలు చేయవలసి వచ్చింది. రాక్షసత్వానికి మారు పేరు అయిన రజాకార్లు, నిజాం అధికారులు హిందూ మహిళల చేత నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. పన్నులు కట్టలేని నిరుపేద రైతులను మండుటెండలలో వంగోపెట్టి గుండెలపై బండలు ఎత్తిం చారు. సలసల కాగే నూనెలో చేతులు పెట్టించారు. బహిరంగంగా ఉరి తీసేవారు. ఆడపిల్లలను ఎత్తుకు పోయి అత్యాచారాలు చేసేవారు. ఇంకా ఎన్నో దురాగతాలకు పాల్పడేవారు. జైళ్లలో ఉద్య మకారులకు విషం ఇచ్చి చంపేవారు. వీరి దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పరకాలలో వంద మందిని చెట్టుకఅు కట్టేసి కాల్చి చంపేశారు. బీబీ నగర్‌లో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు చిన్న పిల్లలను సైతం కర్కశత్వంగా నరికేసి ఆ ఊరిపై పడి బీభత్సాన్ని సృష్టించారు.

‘ఉరులమర్రి’ చెబుతున్న సాక్ష్యం
రజాకార్లను మూడుసార్లు పారిపోయేలా చేసిన జైరాంపల్లి వాసులు 92 మందిని, కూటిగాట్లలో 25 మంది ఉద్యమకారులను, ఏరుపాలెంలో 70 మందిని, పెరుమాండ్ల సంకేసలో 21 మంది రైతులను, ఈ విధంగా రజాకార్ల ఆకృత్యాలను ఎదురించిన నల్గొండ జిల్లాలో మొత్తం 2,000 మందికి పైగా రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. షోలాపూర్‌ సమీపంలోని మంగోలు గ్రామంలో 43 మందిని స్త్రీ పురుషులను చెట్లకు కట్టేసి తుపాకీ మడమలతో చచ్చేంతవరకు కొడుతూ పైశాచికానందాన్ని పొందారంటే నిజాం పాలన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో స్త్రీలను వాళ్ళ భర్తలు, పిల్లలు చూస్తుం డగానే చెరిచారు. పంజాగుట్టలో తల్లి కూతుళ్లను కూడా బలాత్కరించారు. నిర్మల్‌లో వందలాది మందిని మర్రి చెట్టు కొమ్మలకు బహిరంగంగా ఉరి తీశారు. దీనితో ఆ మర్రి చెట్టుకు ‘ఉరుల మర్రి’గా పేరొచ్చింది. కొడకండ్లలో బ్రాహ్మణులను చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడ దీసి కింద మంటపెట్టి సజీవ దహనం చేయటం కేసీఆర్‌ మెచ్చుకున్న నిజాం పాలనలో రాక్షసత్వానికి కొన్ని మచ్చు తునకలు. దాదాపుగా తెలంగాణ పల్లెల్లో ఇదే దుస్థితి.

బలవంతపు మత మార్పిడులు
హైదరాబాద్‌ సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణలో మత మార్పిడుల కోసం స్థాపించిన అంజుమన్‌–2 –తిజ్లిక్‌–ఎ–ఇస్లాం కాలక్రమంలో మజ్లిస్‌ ఇథెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎం.ఐ.ఎం) అయింది. ముస్లిం ఎక్తేదార్‌ అంటే ముస్లిం ఆధిక్యత అని సంస్థ నినాదం. ఎంతో మంది హిందువులపై హత్యాచారాలు చేసి, ప్రలోభాలకు గురిచేసి, మరికొంతమందిని బలవంతంగా ముస్లింలుగా మార్చింది ఈ రాక్షస మూక. ఈ దౌర్జన్యాలను రాష్రీ్టయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరె స్సెస్‌), ఆర్య సమాజ్‌తో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ప్రతిఘటించాయి. రజాకార్ల దౌర్జన్యాలను అడ్డుకునేందుకు దొడ్డి కొమురయ్య, కొమరం బీం, జర్నలిస్ట్‌ షోయబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మలాంటి ఉద్యమకారులు ఎందరో ప్రయత్నించి అసువులు బాశారు.

కమ్యూనిస్టుల ‘తప్పు’టడుగులు!
భారతదేశంలో మొదటినుంచి కమ్యూనిస్టులు చిత్ర విచిత్రమైన విధానాలనే అనుసరిస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన 1948 సెప్టెంబర్‌ 17 వరకు కొనసాగడానికి వారు కూడా కారణమే. బ్రిటిష్‌ పాలకులు దేశం నుంచి వెళ్లిపోతూ నెహ్రు నేతృత్వంలోని ప్రభుత్వానికి అధికారాలు అప్పగించారు. దీనితో బ్రిటిష్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించాలంటూ భారత కమ్యూనిస్టులను కోరడంతో ఒక్కసారిగా వారికి నెహ్రూ గొప్ప కమ్యూనిస్టుగా కనిపించారు. అయితే 1947లో ఉక్రెయి¯Œ కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం నిరాకరించేసరికి అంతర్జాతీయ కమ్యూనిస్ట్‌ పార్టీ పాలసీ మారి పోయింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నిటిని వ్యతిరేకించాలని తీర్మానించారు. అప్పటినుంచి మిలిటెంట్‌ కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. నెహ్రూ కూడా వారికి సామ్రాజ్యవాద శక్తుల తొత్తుగా కన్పించారు. దీనితో నెహ్రు ప్రభుత్వాన్ని కూలదోయాలని భారత కమ్యూనిస్టులు తీర్మానించారు. 

భారత సైన్యంపై గుడ్డి వ్యతిరేకత
నిజాం రాజ్యంలో కూడా కమ్యూనిస్టులు నిజాంకు అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర కమ్యూనిస్ట్‌ పార్టీ నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘భారత ప్రభుత్వం బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వం. అది బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంతో లంకె వేసుకుంది. కాబట్టి హైదరాబాద్‌ సంస్థానంలో భారత సైన్యాల ప్రవేశాన్ని వ్యతిరేకించాలి. హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపి వేసుకునే అన్ని ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలి’ ఇది ఆ ప్రకటన సారాంశం. అంతేకాదు స్వతంత్ర హైదరాబాద్‌ ఏర్పడాలి అని కూడా నినదిం చారు. దీనితో నిజాంకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. స్వతంత్ర హైదరాబాద్‌కు మద్దతిచ్చేవారు లేక చతికిలపడ్డ నిజాంకు కమ్యూనిస్టులు మిత్రులుగా మారారు. అంతకుముందు ఇదే నిజాం చేతిలో ఎన్నో ఇబ్బందులు పడ్డ కమ్యూనిస్టుల వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. భారత ప్రభుత్వంతో పోరాడేందుకు నిజాం నుంచి వారికి ఆయుధాలు కూడా అందాయి అంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

నేతల విభేదాల్లో దాగిన చరిత్ర
హైదరాబాద్‌ సంస్థానంపై భారత సైన్యం విజయం సాధించినా కమ్యూనిస్టుల అరాచకాలు ఆగలేదు. భారత దేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు’ అనే పుస్తకంలో పుచ్చలపల్లి సుందరయ్య కేవలం తెలంగాణ రైతాంగం సాధించుకున్న భూముల పరిరక్షణ కోసమే.. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన తరువాత కూడా, సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అనుకున్నారని పేర్కొన్నారు. అయితే పార్టీకి చెందిన రావి నారాయణరెడ్డి ‘పోలీస్‌ చర్యకు కొంతమేరకు భూస్వామ్య వ్యతిరేక స్వభావం కూడా ఉంది. తర్వాత ఏర్పడిన సైనిక పాలకులు రాష్ట్రంలోని జాగీర్దార్‌ విధానాన్ని రద్దు చేశారు. అభ్యుదయకరమైన ఒక కౌలుదారీ చట్టాన్ని రూపొం దించటం వలన పై అంశం రుజువు అవుతుంది’ అని ‘వీర తెలంగాణ –నా అనుభవాలు, జ్ఞాపకాలు’ పుట 70లో విశ్లేషించారు.

ఆయన తన ‘తెలంగాణ నగ్నస్వరూపం’ అనే డాక్యుమెంట్‌లో నిర్మొహమాటంగా ‘చారిత్రక నేరం.. ఆంధ్ర నాయకత్వం బాధ్యులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ.. పోలీస్‌ చర్య తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వానికీ, మిలటరీకీ వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగిం చడం పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతం లాంటిదని అంటే తప్పేం కాదు’ అని పేర్కొన్నారు అంటే ఆనాడు భారత కమ్యూని స్టులు చేసిన తప్పుడు నిర్ణయాలు ఎలా ఉండేవో తెలుస్తుంది. హైదరాబాద్‌ సంస్థానంలో ఉండి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భూభాగాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణలో ఇప్పటికీ నిర్వహించకపోవటం బాధాకరం.


జి. కిషన్‌ రెడ్డి 
వ్యాసకర్త కేంద్ర హోం శాఖ సహాయమంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top