వెరపులేని రాజకీయం!

K Ramachandra Murthy write article on TDP Politics - Sakshi

త్రికాలమ్‌

పరిసరాల ప్రభావం మనిషిపైన తప్పనిసరిగా ఉంటుంది. పరిణామాలు మనిషి వైఖరిని మార్చివేస్తాయి. స్వాతంత్య్ర సమరం సాగిన సమయంలో సత్యం, స్వేచ్ఛ, సమానత్వం, త్యాగ భావన వంటి ఉన్నతమైన విలువలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయి. 1960లలో వియత్నాం యుద్ధం, పౌరహక్కుల ఉద్యమాలు, జాన్‌ ఎఫ్‌ కెన్నడీ హత్యోదంతం ప్రపంచవ్యాప్తంగా యువతను కది లించాయి. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ఆవిష్కృతమైన తర్వాత వ్యాపార సంస్కృతికి పెద్దపీట వేశాం. అప్పుడే హైటెక్‌ విప్లవం యువతీయువకులను అమెరికా బాట పట్టించింది. 2014లో మితవాద ధోరణులు ప్రబలిన ఫలి తంగా నరేంద్ర మోదీ బీజేపీకి అపూర్వమైన విజయం సాధించగలిగారు. నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మితిమీరిన మితవాద భావజాలానికి ప్రతీ కగా డొనాల్డ్‌ ట్రంప్‌ జయకేతనం ఎగురవేశారు. కాలానికి అనుగుణంగా విలువలు మారతాయి. అందుకే మనిషిని కాలం రూపొందిస్తుంది (Man is the  pro-duct of his times)) అంటారు.

వార్తలలో వ్యక్తి
వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వార్తలలో ఉన్న వ్యక్తి అనుముల రేవంత్‌ రెడ్డి కూడా సమకాలీన విలువలకూ, రాజకీయ సంస్కృతికీ ప్రతీక. మోదీ, ట్రంప్‌లను గెలిపించిన ధోరణులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)లు పాటిస్తున్న విలువలూ, అనుసరిస్తున్న విధానాలూ, ప్రదర్శిస్తున్న వైఖ రులూ రేవంత్‌రెడ్డి రాజకీయాన్ని నడిపిస్తున్నట్టు భావించవచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానిగా, బీజేపీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగిన రేవంత్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా ఎంఎల్‌సి ఎన్నికలలో గెలుపొందారు. ప్రస్తుతం కొడంగల్‌ శాసనసభ్యుడు (అందుకే రేవంత్‌ తాజా విన్యాసాల వెనుక చంద్రబాబు ఉన్నారా అంటూ ప్రజలు అనుమానిస్తున్నారు). టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా సన్నిహితుడు.

భార్య, కొడుకు, కోడలు సమేతంగా రేవంత్‌రెడ్డి కుమార్తె పెళ్ళికి చంద్రబాబు హాజరైనారు. భువనేశ్వరి, బ్రాహ్మణి సాధారణంగా రాజకీయనేతల కుటుంబాలలో వివాహాలకు వెళ్ళరు. రేవంత్‌రెడ్డి మాత్రం మినహాయింపు. ‘ఓటుకు కోట్లు’ ఉదంతంలో కరెన్సీ నోట్లకట్టలతో కెమెరాకు చిక్కిన రేవంత్‌రెడ్డికి సంఘీభావం తెలపడంకోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రయత్నించిన సందర్భం అది. చంద్రబాబుకూ, ఆయన కుమారుడు లోకేశ్‌కూ అత్యంత సన్నిహితుడు కాగలిగిన నేర్పరి రేవంత్‌రెడ్డి. లక్ష్యం ఛేదించడం ఎట్లాగో తెలిసిన విలుకాడు. విజయంకోసం ఉపయోగించే మార్గం ఈ తరం నాయకులలో అత్యధికులకు అంత ప్రధానం కాదు. పాతతరం విలువలు పాటించేవారికి ప్రత్యేకమైన గుర్తింపు కానీ గౌరవం కానీ లేవు. వారిని చేతగాని వాజమ్మలుగా (సన్నాసులు) పరిగణిస్తున్నారు.

ఇప్పటి రాజకీయాలలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండాలన్న పట్టింపు లేదు. మాటలను తూటాలుగా పేల్చే ప్రావీణ్యం, తెగింపు ఉంటే చాలు. చేయని మంచి పనులు చేసేసినట్టూ, చేసిన తప్పులు చేయనట్టూ దబాయించే వెరపులేని మనస్తత్వం వీరి ప్రత్యేకత. గతం అంతా చీకటేననీ, తనతోనే వెలుగు వచ్చిందనీ నిస్సంకోచంగా చెప్పగలగాలి. ఎంతటివారినైనా ఎంతమాటైనా నిస్సంకోచంగా అనాలి. అటువంటివారినే గుండెబలం ఉన్న నాయకులుగా ప్రజలు పరిగణిస్తున్నారు. నేటి వాతావరణంలో వారే మేటి నేతలు. అటువంటి నేతలనే మీడియా ప్రేమిస్తుంది. ప్రశ్నించదు.

ప్రమాదంలో టీటీడీపీ ఉనికి
ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. ఇది అనివార్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అనేక వైరుధ్యాల కారణంగా రెండు రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ ప్రజాదరణ పొందడం ప్రస్తుతానికి అసాధ్యం. 2014లో టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసినవారిలో 15 మంది విజయం సాధించగా 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయించవలసిందిగా ప్రోత్సహించిన చంద్రబాబుకు తెలంగాణ పరిణామాల పట్ల ఫిర్యాదు చేసే నైతికాధికారం లేదు. శ్రీనివాసయాదవ్‌ టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు పార్టీ ఫిరాయించడం ఎంతటి సిగ్గుమాలిన వ్యవహారమో, పార్టీని ఎట్లా వంచించి మరో పార్టీలోకి దూకుతున్నారో వివరిస్తూ నిప్పులు కక్కారు చంద్రబాబు.

కపట రాజకీయాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఫిరాయింపుల నిరోధక చట్టం అంటూ ఒకటి రాజ్యాంగంలో ఉన్నదనే స్పృహ మోదీకి కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ లేదు. రాజీవ్‌గాంధీ, వాజపేయి రూపొందించిన చరిత్రాత్మకమైన చట్టాన్ని అందరూ కలసి తుంగలో తొక్కుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను బుట్టలో వేసుకున్న చంద్రబాబు రేవంత్‌రెడ్డిని చేర్చుకున్నందుకు కాంగ్రెస్‌ను తప్పు పట్టలేరు. అనేక కారణాల వల్ల ఆయన టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని విమర్శించే స్థితిలో లేరు. ‘ఓటుకు కోట్లు’ కేసు అనంతరం సమీకరణాలు మారిపోయాయి. హైదరాబాద్‌ విడిచి హూటాహుటిన అమరావతికి తరలి వెళ్ళిన చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే సాహసం చేయడం లేదు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నాయకులనూ, కార్యకర్తలనూ కాజేస్తున్నది కేసీఆర్‌ అన్నది జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కేసీఆర్‌ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పగలిగిన నాయకులు ఏ పార్టీలోనూ లేరు.

కొన్ని మాసాల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడు రోజు లపాటు నల్లగొండ జిల్లాలో మకాం పెట్టి టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికలలో ఓడిం చేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ ప్రకటించిన తర్వాత అంగుళం కూడా ఆ పార్టీ ముందుకు కదలలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గట్టిగా, సహేతుకంగా, ప్రభావవంతంగా విమర్శించే నాయకుడు లేడు. కొత్తవారిని తమ పార్టీలో చేర్చుకొని తమలో ఇముడ్చుకునే అలవాటు బీజేపీ నాయకులకు లేదు. తమకు బలం లేని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీని సమకూర్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కి కార్యకర్తల బలం ఉంది. ముప్పయ్‌ శాతం ఓట్లు పది లంగా ఉన్నాయి. కానీ పార్టీ నాయకులనూ, శ్రేణులనూ ఒకే తాటిపైన నడిపించే గట్టి నాయకుడు లేడు.

నల్లగొండ జిల్లాలలోనే చాలామంది నాయకులు ఉన్నారు. వారిలోనే ఐక్యత లేదు. అరడజను మందికిపైగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒకరి మాట ఒకరు వినరు. కేసీఆర్‌కు సమాధానం చెప్పగల సత్తా ఉన్న నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నాడని ప్రజలు భావించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు గులాంనబీ ఆజాద్‌ జోక్యం చేసుకోవలసి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క కష్టపడుతున్నారు. జానారెడ్డికి పరిపాలనా రంగంలో విశేషానుభవం ఉన్నది. కానీ వీరిలో ఎవ్వరినీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం లేదు.

తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రేవంత్‌రెడ్డికి మంచి అవకాశం ప్రసాదించాయి. కేసీఆర్‌ మాట్లాడినంత స్ఫుటంగా, అంతే కరకుగా, అంతకంటే పదునుగా మాట్లాడే శక్తి తనకు ఉన్నదని రేవంత్‌ గత మూడున్నర సంవత్సరాలలో అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాను ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడనే అపరాధ భావన రేవంత్‌రెడ్డిలో ఎక్కడా కనిపించదు. టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ దొరికిపోయిన ఫలితంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు రేవంత్‌ ముఖం దాచుకునే ప్రయత్నం చేయలేదు. మీసాలు మెలేసి తొడగొట్టి కేసీఆర్‌ను సవాల్‌ చేస్తూ మాట్లాడారు. అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్న వ్యక్తిని తమ పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్‌ నాయకత్వం ఏ మాత్రం సంకోచం చూపించలేదు. ఎంఎల్‌ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం అక్రమమనీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మధ్య తరగతి ప్రజలు భావించవచ్చు.

కానీ రాజకీయ నాయకులు ఈ విషయం పట్టిం చుకోవడం లేదు. లేకపోతే రేవంత్‌ను రాహుల్‌గాంధీ కలుసుకోవడానికి అంగీకరించేవారు కాదు. రాబోయే ఎన్నికలలో రేవంత్‌ కాంగ్రెస్‌ ప్రచార సార«థిగా ఉండబోతున్నారనే వార్తలు వచ్చేవి కావు. తనతో పాటు కాంగ్రెస్‌లో ప్రవేశించే పాతికమంది నాయకులకు ఎన్నికలలో పార్టీ టెక్కెట్లు ఇవ్వాలంటూ వారి జాబితాను రాహుల్‌కి ఇచ్చారనే ప్రచారం అయ్యేది కాదు. రేవంత్‌ రాక పార్టీకీ, అతనికీ లాభమనీ, ఉభయతారకంగా ఉంటుందనీ కాంగ్రెస్‌ నాయకులు సంతోషంగా చెప్పుకునేవారు కాదు.

లక్ష్యం నెరవేరేనా?
రేవంత్‌రెడ్డి మంచి మాటకారి. వెలమలూ, కమ్మవారూ తెలంగాణలో ఏకం అవుతున్నారంటూ ‘వెల్‌కమ్‌’ గ్రూపుగా వారిని అభివర్ణించిన మొదటి వ్యక్తి రేవంత్‌. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మధ్య వైరుధ్యాలను ఎత్తి చూపించిన నాయకుడూ ఆయనే. టీఆర్‌ఎస్‌ ఉత్తర తెలంగాణలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్నదనీ, దక్షిణ తెలంగాణ టీఆర్‌ఎస్‌ను తిరస్కరించిందనీ ఆయన విశ్లేషణ. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని తీర్మానం. రేవంత్‌ చేరితే గాంధీభవన్‌లో హడావిడి పెరుగుతుంది. కేసీఆర్‌పై విమర్శనాస్త్రాల పరంపర సంధిస్తారు. రాజకీయ ఉష్ణోగ్రత పెంచుతారు. రేవంత్‌ పొడ గిట్టని కేసీఆర్‌పైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ రేవంత్‌ లక్ష్యం నెరవేరుతుందా? ఆయన కోరిన టిక్కెట్లు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇస్తుందా? వారందరినీ గెలిపించుకొని తన గ్రూపుగా నిలబెట్టుకోగలరా? ఇది పగటి కల కాదుకదా! ప్రాంతీయ పార్టీలతో ఉండే సౌలభ్యం జాతీయ పార్టీలతో ఉండదు.

టీడీపీలో చంద్రబాబు మాటకు తిరుగు ఉండదు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ మాట సుగ్రీవాజ్ఞ. ప్రాంతీయ పార్టీ అధినేతకు నచ్చినవారికి ఎవ్వరూ అపకారం చేయలేరు. వారికి నచ్చనివారికి ఉపకారం చేయలేరు. కాంగ్రెస్‌ పరి స్థితి ఇందుకు భిన్నం. అది మహాసముద్రం వంటిది. పార్టీలో చేరిన తర్వాత రాహుల్‌గాంధీ దర్శనభాగ్యం దొరకడమే కష్టం కావచ్చు. తన వెంట వస్తారనుకుంటున్న నాయకులు నిజంగా రాకపోవచ్చు. వారితో హరీష్‌రావు కానీ ఇతరులు కానీ మాట్లాడి టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఒప్పించవచ్చు. కాంగ్రెస్‌ టిక్కెట్టు కంటే టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు కానీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న టీటీడీపీ టిక్కెట్టు కానీ ఎన్నికలలో గెలిపిస్తుందని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌కు ఉన్నంత సామర్థ్యం, యుద్ధ కౌశలం రేవంత్‌కు ఉన్నట్టు ఇంతవరకూ ఎక్కడా వెల్లడి కాలేదు. ఆ స్థాయి నాయకుడిగా ఎదగలేదు. టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులలో అత్యధికులు టీఆర్‌ఎస్‌తో పొత్తు కోరుకుంటున్నారు.

కాంగ్రెస్‌తో పోవాలని వాదిస్తున్నవారు తక్కువ మంది. టీటీడీపీ నేతలను తన వైపు తిప్పుకునే అవకాశం కేసీఆర్‌కు ఉంది. బీజేపీ విడిగా పోటీ చేయాలనీ, అన్నిచోట్లా వారి అభ్యర్థులు నిలబడాలనీ, వారికి డిపాజిట్లు రావడమే కాకుండా గణనీయమైన సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చుకోవాలనీ కేసీఆర్‌ కోరుకుంటారు. రేవంత్‌ వాగ్బాణాలతో గాయపడి ఆగ్రహించిన కేసీఆర్‌ ప్రతీకా రేచ్ఛతో ‘ఓట్లకు కోట్లు’ కేసును తిరిగి తెర వకుండా చూడాలంటూ చంద్రబాబు వేడు కుంటారు. ప్రస్తుత దృశ్యంలో కేసీఆర్‌ అనే కొండను రేవంత్‌రెడ్డి అనే పొట్టేలు ఢీకొనడం చూస్తున్నాం. బలాబలాలు తారుమారై భవిష్యత్తులో దృశ్యం మారుతుం దేమో బుల్లితెరపై చూడాలి.

- కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top