కశ్మీరీ శాంతి కపోతం

K Ramachandra Murthy Article On Kashmir Issue - Sakshi

త్రికాలమ్‌

మతాలవారీగా, కులాలవారీగా, ప్రాంతాలవారీగా, రాజకీయ భావజాలాల వారీగా చీలిపోయిన నేటి భారతంలో గౌరవప్రదంగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా నిలబడి రాణించడం దాదాపు అసాధ్యం. కల్లోల కశ్మీరంలో అయితే జర్నలిజం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసమే. వస్తునిష్టంగానే రాస్తామంటే కుదరదు. ఉంటే ప్రభుత్వ పక్షాన ఉండాలి లేదా వేర్పాటువాదులకు విధేయంగా ఉండాలి. జరిగిన వాస్తవాలు మాత్రమే ప్రచురించడం అంటే అందరినీ శత్రువులను చేసుకోవడమే. ప్రభుత్వం లేదా సైనికాధికారులు చెబుతున్న సంగతులే ప్రచురిస్తే ‘సర్కారీ పత్రకార్‌’ అంటూ నిందిస్తారు. డబ్బు తీసుకొని ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారంటూ పాకిస్తాన్‌ అనుకూలవర్గాలూ, మిలిటెంట్లూ, వేర్పాటువాదులూ ఈసడించుకుంటారు.

వేర్పాటువాదుల అభి ప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తే ‘దేశద్రోహులు’ అంటూ హిందూత్వవాదులూ,  వీర దేశాభిమానులూ ముద్రవేస్తారు. ఈ నేపథ్యంలో అటు వేర్పాటువాదుల తోనూ, పాకిస్తాన్‌ ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోనూ, కశ్మీర్‌లోని ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఉన్నత సైనికాధి కారులతోనూ సమాన ఫక్కీలో సత్సంబంధాలు కలిగిఉంటూ శాంతి నెలకొల్ప డానికి ప్రయత్నించడం సాహసం. అటువంటి అరుదైన సాహసి మొన్న తూటా లకు బలైన ప్రఖ్యాత జర్నలిస్టు సుజాత్‌ బుఖారీ. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన పత్రిక ‘రైజింగ్‌ కశ్మీర్‌’ కార్యాలయం బయటనే ఇఫ్తార్‌కు వెళ్ళేందుకు కారు ఎక్కబోతుండగా హంతకులు జరిపిన కాల్పులలో నేలకొరిగాడు. 

సుజాత్‌ బుఖారీ వివేకవంతుడు. సాహసి. స్నేహశీలి.  ఎత్తుగా, అందంగా, హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉండే బుఖారీకి అన్ని రంగాలవారితోనూ పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. అందరితో మాట్లాడే చనువుంది. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో పని చేస్తున్నారు. హురియత్‌ కాన్ఫరెన్స్‌లో మిత్రులు ఉన్నారు. మనసు విప్పి మాట్లాడే ఆర్మీ జనరల్స్‌ ఉన్నారు. కనుకనే బారాముల్లా జిల్లాలో క్రీరీ గ్రామంలో శుక్రవారం జరిగిన బుఖారీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరైనారు.

కొందరు సీనియర్‌ జర్నలిస్టులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వెళ్ళారు.  కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుఖారీ హత్యవార్త విని కన్నీటి పర్యంతం అయిపోయారు. ఆమె సోదరుడూ, మంత్రి తస్దీఖ్‌ముఫ్తీ, ప్రతిపక్ష నాయకుడూ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, జమ్మూ–కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధినేత యాసిన్‌ మాలిక్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్‌ లోయలోనే కాకుండా దేశవ్యాప్తంగా బుఖారీని అభిమానించేవారు ఉన్నారు. యావద్భారతం శోకతప్తమైన సందర్భం ఇది. బుఖారీతో పాటు ఆయన అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు ఆగంతకుల తూటాలకు నేలకొరిగారు. అంతకు కొన్ని గంటల ముందే జౌరంగజేబు అనే జవాన్‌ శవం పుల్వామాలో దొరికింది.

రంజాన్‌ సెలవుపై ఇంటికి వెడుతున్న జౌరంగజేబును దుండగులు కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. రంజాన్‌ మాసం సందర్భంగా దేశీయాంగ శాఖ కశ్మీర్‌లో స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించిన ఫలితంగా లభించిన అవకాశాన్ని ఉగ్రవాదులు పూర్తిగా వినియోగించుకున్నారు.  కాల్పుల విరమణకు ముందు ఏప్రిల్‌ 19 నుంచి మే 16 వరకూ ఉగ్రవాద సంబంధమైన ఉదంతాలు 25 జరిగితే, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మే 17 నుంచి జూన్‌ 13 వరకూ 66 ఘటనలు జరిగాయి. కాల్పుల విరమణను పొడిగించి, చర్చల ప్రక్రియను పునరుద్ధరించకపోతే కశ్మీర్‌లో 1990 దశకం ఆరంభంనాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. హింసాకాండ కొనసాగి ఉగ్రవాదులది పైచేయి అయితే కశ్మీర్‌ అంతర్జాతీయ వివాదంగా మళ్ళీ తెరపైకి ప్రముఖంగా వస్తుంది. ఇతర దేశాల జోక్యాన్ని నివారించడం కష్టం అవుతుంది. 

కశ్మీరీల ఆత్మగౌరవాన్ని (అస్మితను) సుజాత్‌ బుఖారీ ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. కశ్మీరీ భాష అన్నా, సంస్కృతి అన్నా చెవికోసుకునేవాడు. కశ్మీరీ భాషలో వార్తాపత్రికలు రావడానికి ఉద్యమం చేశాడు. కశ్మీరీ భాషలో కవులూ, రచయితల కోసం స్థాపించిన ‘అబ్దీ మక్రజ్‌ కమ్రాజ్‌’ అనే సంస్థకు బుఖారీ అధ్యక్షుడు. ఈ సంస్థ కృషి ఫలితంగానే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2017లో  కశ్మీర్‌ పాఠశాలల్లో పదో తరగతి వరకూ కశ్మీరీ భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. కశ్మీరీ భాషకు పర్షియన్‌–అరబిక్‌ లిపిని రద్దు చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని ఈ  సంస్థ జయప్రదంగా ఆడ్డుకున్నది. ఉర్దూ, ఇంగ్లీష్, కశ్మీరీ భాషలలో అధికారం కలిగిన రచయిత బుఖారీ. మంచి వక్త. సాహిత్యసభలలో తరచుగా పాల్గొనేవాడు.

అతడు కేవలం జర్నలిస్టు కాదు.  శాంతికోసం పరితపించిన∙యాక్టివిస్టు కూడా. ‘రికన్సీలియేషన్‌ రిసోర్సెస్‌’ అనే సంస్థను నెలకొల్పి కశ్మీర్‌లో శాంతి సాధనకు చొరవ తీసుకొని సమాలోచనలు నిర్వహించే బృందంలో బుఖారీ ముఖ్యపాత్రధారి. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య సమాంతర దౌత్యం (ట్రాక్‌–2 డిప్లొమసీ) నిర్వహించేవారు. రెండు దేశాల ప్రభుత్వాల, పౌరసమాజాల ప్రతినిధులతో సమాలోచనలు అమెరికాలో, ఇంగ్లండ్‌లో, ఇతర దేశాలలో నిర్వహించేవారు. పీవీ  నరసింహారావు ప్రధానిగా ఉండగా ఈ రకం దౌత్యంలో ప్రముఖ సంపాదకుడు శేఖర్‌గుప్తా పాల్గొనేవారు. గత నెల దుబాయ్‌లో బుఖారీ ఆధ్వర్యంలో జరిగిన కశ్మీర్‌ ఇనీషియేటివ్‌ భేటీ వివాదాస్పదమైంది.

ఇండియా, పాకిస్తాన్‌లు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని అనుకున్నట్టు వార్త పొక్కింది. తీర్మానం ఆమోదానికి పెట్టలేదు కానీ అందులోని అంశాలపై రకరకాల వ్యాఖ్యలూ, ప్రతిస్పందనలూ సోషల్‌ మీడియాలో స్వైరవిహారం చేశాయి. ఇది ఉగ్రవాదులను ఆగ్రహోదగ్రులను చేసింది. కశ్మీర్‌లో శాంతి నెలకొనే అవకాశాలు మెరుగైన ప్రతిసారీ ఉగ్రవాదులు రెచ్చిపోతారు. ‘కశ్మీర్‌లో ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నది ఉల్లిగడ్డల లేదా ఆలుగడ్డల వ్యాపారం కోసమో, కశ్మీర్‌ను శాశ్వతంగా విభజించడం కోసమో కాదు. కశ్మీర్‌కు విమోచన కలిగించడానికి.  దుబాయ్‌లో జరిగిన భేటీ భారత ఇంటెలిజెన్స్‌ సంస్థల నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తులు నిర్వహించింది. అటువంటి సమావేశాలు నిరర్థకమైనవి’ అంటూ  భారత ఇంటెలిజెన్స్‌ సంస్థల తొత్తుగా సుజాత్‌ తదితరులను జగమెరిగిన ఉగ్రవాది సలాహుద్దీన్‌ నిందించాడు. హిజ్బుల్‌ ముజాహిదీన్, యునైటెడ్‌ జిహాద్‌ కౌన్సిల్‌లు బుఖారీని భారత సైన్యానికీ, ఇంటెలిజెన్స్‌ సంస్థలకీ డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తిగా అభివర్ణించాయి.

హంతకులెవరు?  
సుజాత్‌ బుఖారీని ఎవరు చంపారు? ఈ  ప్రశ్నపైన సోషల్‌ మీడియాలో అనేక రకాల పోస్టింగ్‌లు  కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి నివేదికపైన సుజాత్‌ బుఖారీ వ్యాఖ్య చేసిన కొన్ని గంటలకే అతడిని హత్య చేయడం విశేషం అంటూ పాకిస్తాన్‌ విదేశాంగ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సుజాత్‌ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉన్నదంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపిస్తున్నది.  బుఖారీని ఎవరు చంపారనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి లేదు. అతడిని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? వేర్పాటువాదులతో, పాకిస్తాన్‌ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని కశ్మీర్‌ ముఖ్యమంత్రి పలుసార్లు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ గడువును పొడిగించాలనీ, అవసరమైతే వేర్పాటువాదులతో సైతం చర్చలు జరపాలనీ ఎన్‌డీఏ ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో శాంతికాముకుడైన బుఖారీని చంపవలసిన అవసరం కల్లోలం కోరుకునేవారికే ఉంటుంది. ముగ్గురు ఉగ్రవాదులు బైక్‌పైన వచ్చి కాల్పులు జరిపినట్టు జమ్మూ–కశ్మీర్‌ డీజీపీ ఎస్‌పి వెయిద్‌ అంటున్నారు. కశ్మీర్‌ లోయలో ప్రభుత్వానికీ, వేర్పాటువాదులకూ మధ్య, ఇండియాకూ,  పాకిస్తాన్‌కూ మధ్య, ముస్లింలకూ, కశ్మీరీ పండిట్లకూ మధ్య వారధిగా ఉన్న మానవతామూర్తిని పొట్టనపెట్టుకున్నారు. కశ్మీరీ  పండిట్లకు అండగా ఉంటూ, వారిని తిరిగి కశ్మీర్‌కు  రప్పించాలని కోరుకునేవారిలో బుఖారీ అగ్రగణ్యుడు. అటువంటి ఉదారవాదులకు కశ్మీర్‌లో స్థానం లేదనీ, భద్రత లేదనీ స్పష్టం చేయడం, ఉదారవాదంవైపు మొగ్గు చూపవద్దని ఇతరులను హెచ్చరించడం హంతకుల లక్ష్యం.

ఉగ్రవాదులకు హెచ్చరిక
బుఖారీ అంత్యక్రియలకు హాజరైన జర్నలిస్టులు అతడి స్ఫూర్తితో మరింత ధైర్యంగా వ్యవహరించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని ఓyì ంచడమే అతడికి నిజమైన నివాళి. కడచిన 15 సంవత్సరాలలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు హత్య చేసిన మొదటి ఉదారవాది బుఖారీ. 2003లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ అబ్దుల్‌ మాజీద్‌ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపివేశారు. అంతకు పది నెలల ముందు ప్రొఫెసర్‌ అబ్దుల్‌ ఘనీ లోన్‌ని మీర్వాయిజ్‌ మౌల్వీ ఫారూఖ్‌ వర్థంతి సభలో ప్రసంగిస్తున్న సమయంలో హత్య చేశారు. 12 ఏళ్ళ కిందట  మౌల్వీ ఫారూఖ్‌ని కూడా ఉగ్రవాదులే చంపారు. ఫారూఖ్‌కీ, లోన్‌కీ, దార్‌కూ, బుఖారీకి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం– ఉదారవాదం. ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు శాంతిమంత్రం జపిస్తారు కనుక వారిని ఉగ్రవాదులు ఉపేక్షించరు. 

స్నేహశీలి, క్రియాశీలి
సుజాత్‌ బుఖారీని  నేను 2010లో మొదటి సారి కలుసుకున్నాను. వందమందికిపైగా యువకులు చేతుల్లో రాళ్ళు పట్టుకొని మరతుపాకుల ఎదురుగా నిలిచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పారామిలటరీ సైనికులు కాల్పులకు నేలకూలిన ఘటనలు జరిగిన తర్వాత కొన్ని వారాలకు హెచ్‌ఎంటీవీ తరఫున అక్కడికి వెళ్ళాను. సహచరుడు జమీల్‌–ఉర్‌–రెహ్మాన్‌ తోడు ఉన్నాడు. గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నాయకుడూ, పాకిస్తాన్‌ అనుకూలుడూ అయిన సయ్యద్‌ అలీ షా గిలానీనీ, మీర్వాయిజ్‌  ఉమర్‌ ఫారూఖ్‌ వంటి హురియత్‌ నాయకులనూ, ఇతరులనూ ఇంటర్వ్యూ చేశాను. సాధారణ ప్రజలతో మాట్లాడాను.

చివరి అంశంగా శ్రీనగర్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాం. అందులో సుజాత్‌ బుఖారీతో పాటు శ్రీనగర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ, పౌరహక్కుల  నేతలూ, విద్యార్థులూ అనేక మంది చురుగ్గా పాల్గొన్నారు. కశ్మీర్‌లో పరిస్థితీ, సైన్యం నీడలో ప్రజల జీవితాలూ, కశ్మీరీ పండిట్ల వలస, ఇండియా, పాకిస్తాన్‌ ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న కశ్మీరీల బతుకులూ చర్చకు వచ్చాయి. కశ్మీరీలతో సంబంధాలు లేకుండా ఈ రోజుల్లో  ఢిల్లీ స్టుడియోలలో కూర్చొని దేశభక్తి వండివార్చే టీవీ యాంకర్లకు వివేకం కానీ, వినయం కానీ లేవు. విషయపరిజ్ఞానం అంతకంటే లేదు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాలనీ, పాకిస్తాన్‌ సహకారంతో కశ్మీర్‌ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనీ సూచించే వ్యక్తులను పాకిస్తానీ  ఏజెంట్లుగా, దేశద్రోహులుగా చిత్రంచే జర్నలిస్టులు ఢిల్లీలో కొన్ని చానళ్ళను శాసిస్తున్నారు. వారికి నమస్కారం.

కశ్మీర్‌లో ఏ ఘటన జరిగినా కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలంటే అక్కడి సంక్లిష్టమైన పరిస్థితులపైన లోతైన అవగాహన కలిగిన బుఖారీ వంటి వ్యక్తులతో మాట్లాడాలి.  బుఖారీ అప్పుడు హిందూ పత్రిక ప్రతినిధిగా శ్రీనగర్‌లో పని చేస్తున్నాడు. ఆ పర్యటనలో  రెండు దఫాలు అతడితో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కలిగింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. కశ్మీర్‌ చరిత్రను సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన కలిగింది.  బాలగోపాల్‌ అంటే బుఖారీకీ, హక్కుల నాయకులకూ, ప్రొఫెసర్లకూ ఇష్టం, గౌరవం. అప్పటికి  సంవత్సరం క్రితమే కన్నుమూసిన బాలగోపాల్‌ను చాలామంది గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన సంపాదకుల సమావేశం సందర్భంగా ఒక సారి బుఖారీ, నేనూ కలుసుకున్నాం. ‘ది హన్స్‌ ఇండియా’ సంపాదకత్వం నిర్వహించిన రోజుల్లో కశ్మీర్‌లో ముఖ్యమైన పరిణామాలు సంభవించినప్పుడు బుఖారీని అడిగి ప్రత్యేక విశ్లేషణ తెప్పించుకొని ప్రచురించేవాడిని. హైదరాబాద్‌కు  కూడా వచ్చాడు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా ఆవేశం లేకుండా, చిర్నవ్వు చెదరకుండా ఉండటం, ఏది మాట్లాడినా సాధికారంగా వ్యాఖ్యానించడం అతడి ప్రత్యేకత. బుఖారీ వంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు. అతడి మరణం కశ్మీర్‌ ప్రజలకు తీరని లోటు. 

కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top