మత విమర్శపై పరిమితులు

IYR Krishna Rao Writes On Kathi Mahesh Episode - Sakshi

సందర్భం
ఈమధ్య కత్తి మహేష్‌ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేసింది. ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానిపై పరిపూర్ణానంద స్వామి తదితరులు తీవ్రంగా స్పందిం చడంతో పరిస్థితి కొంత చేయి దాటిపోయే ప్రమా దం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహా త్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి సమస్య సమసిపోయేటట్లుగా చర్యలు చేపట్టింది.

ప్రజాస్వామ్య దేశాలలో భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రం అందరికీ ఉంటుంది. కానీ ఈ స్వాతంత్య్రం కొన్ని పరిమితులకులోనై మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే విషయం ఎవరూ మరువరాదు. అబ్రహాం లింకన్‌ చెప్పినట్టు ‘నీ పిడికిలి నా ముక్కు దగ్గర ఆగిపోతుంది.‘ అంటే పక్కవారిని భౌతికంగా గానీ మానసికంగా గానీ గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. ఈ సూత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే మూలం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని 19 (1)(ఎ) ప్రకరణలో పొందుపరచటం జరిగింది. కానీ దీనికి రాజ్యాంగబద్ధమైన పరిమితులను 19 (2)లో పొందుపరిచారు. ప్రజా నియంత్రణ, మర్యాద, నైతి కత, దేశ భద్రత వంటి మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఈ పై స్వేచ్ఛపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. కత్తి మహేష్‌ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి ఏ విధంగా పరిశీలించినా రావు.

ఇక ఈయన వ్యాఖ్యలను సమర్థించేవారు రెండు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంతకుముందు చాలా మంది నాయకులు, వ్యక్తులు చేశారు గానీ ప్రభుత్వం అప్పుడు ఈ విధంగా స్పందించలేదు. ఇతని ఒక్కని విషయంలో మాత్రం ఈ విధమైన స్పందన వివక్షా పూరితంగా ఉంది అని వీరంటున్నారు. ఇది చాలా సహేతుకమైన వాదన. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరు చేసినా అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన అవసరముంది.

ఇక వారు ప్రస్తావించే రెండవ ప్రధాన అంశం రామాయణం లాంటి పురాణాల మీద ఇంతకు పూర్వం రంగనాయకమ్మ, రామస్వామి చౌదరి, చలం లాంటి వారు చాలా వ్యాఖ్యానాలు చేశారు. వాటిని తప్పు పట్టనప్పుడు మహేష్‌ చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా తప్పు పడతారు? ఈ వాదన సరికాకపోవచ్చు. పురాణాలను విశ్లేషణాత్మకంగా పరిశీ లించి, విమర్శనాత్మక వ్యాఖ్యానం చేయటం ఒక వంతు కాగా, సభ్యసమాజం మనోభావాలు గాయపడే విధంగా విచక్షణ కోల్పోయి వ్యాఖ్యానించటం వేరొక వంతు. పైపెచ్చు ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయటం కూడా సమర్థనీయం కాదు. అలాగే కత్తి మహేష్‌ కుటుంబంపై దూషణలకు దిగిన వారి చర్య కూడా గర్హనీయమైనది.

హిందూ మతం ఏ ఒక్క ప్రవక్త బోధనలవల్ల ఏర్పడిన మతం కాదు. ఇది యుగాల కాలంలో పరిణతి చెందిన మత విధానం. ఆరాధనలో, నమ్మకంలో, ఆచరణలో భిన్నత్వం ఈ మత విధానానికి మూలస్థానం. ప్రకృతి ఆరాధన విధానాల నుంచి నిరాకార నిరామయ స్వరూపుడైన భగవంతుని ఆరాధించే విధానం వరకు అన్నీ ఈ మతంలో ఆరాధనా విధి విధానాలే. ఈ భిన్నత్వాన్ని గౌరవించి ప్రవర్తించాల్సిన బాధ్యత అందరిమీదా ఉంటుంది. ఇతర మత విధానాల పట్ల కూడా అదేవిధంగా మెలగాలి.

ఇటువంటి వ్యాఖ్యలు గతంలో పరిమితంగా చర్చకు వచ్చేవి. కానీ ప్రస్తుతం మీడియా పుణ్యమా అని శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు కూడా ఇటువంటి అంశాలకు ప్రసార అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తే మంచిది. ఈ వివాదం ఇంతటితో సమసిపోవటానికి అందరూ ముఖ్యంగా మేధావి వర్గం వారి భావజాలం ఏదైనా కానీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడించే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆర్థిక అసమానతలను రూపుమాపటం, నిరుద్యోగ సమస్య, పర్యావరణ పరిరక్షణ వంటి సమకాలీన అంశాలను వదిలివేసి చరిత్రను తవ్వుకుని సమస్యను సృష్టించుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు.

ఇందులో ఎంత చరిత్ర, ఎంత కవి కల్పన అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే చర్చించే అంశాలు చరిత్రకందని కాలం నాటివి. గత శతాబ్ది కాలంలో హిందూ సమాజానికి రామానుజాచార్యులవారి స్థాయి కలిగిన మత సామాజిక సంస్కర్త లేకపోవటం ఈ మతం చేసుకున్న గొప్ప దురదృష్టం. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా మతంలో మార్పులు రాకపోతే మతానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. ఈ అంశంపై హైందవ సమాజం మొత్తం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఐవైఆర్‌ కృష్ణారావు
ఈ-మెయిల్‌ : iyrk45@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top