ఆ లేఖను బాబు రాసినట్టా, రాయనట్టా?

Chandrababu Letter To Ravi Shankar Prasad Remains Questionable - Sakshi

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు 2017లో రాసిన లేఖలను జస్టిస్‌ ఈశ్వరయ్య ఈమధ్యే బహిర్గతం చేశారు. ఇద్దరు బీసీ న్యాయవాదులు అమరనాథ్‌ గౌడ్, అభినవ కుమార్‌లను హైకోర్టు జడ్జీలుగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బాబు ఆ లేఖలు రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపించింది. బీసీ న్యాయవాదులపై బాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలడంతో ఆ ఇద్దరినీ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్రం నియమించింది.

ఈ అంశాన్ని జస్టిస్‌ ఈశ్వరయ్య ఆ లేఖల ప్రతులతో సహా విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల ఎదుట బహిర్గతం చేశారు. తర్వాత సీఎం బాబు, యనమల రామకృష్ణుడుతోపాటు బీసీ మంత్రులు ఈశ్వరయ్యను విమర్శిస్తూ ప్రకటనలు చేశారు. కానీ వీరెవ్వరూ ఆ లేఖలు బాబు రాయలేదని గానీ, రాసిన లేఖల్లో బీసీ న్యాయవాదులపై ఆరోపణలు చేయలేదని గానీ, వాటిని తిరస్కరించిన విషయాన్నిగానీ ఖండించలేదు. తమ హయాంలో బీసీ న్యాయవాదులు 9 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా అయ్యారంటూ చెబుతున్నారు తప్ప ఆ ఇద్దరు బీసీ న్యాయవాదులకు వ్యతిరేకంగా బాబు కేంద్రానికి లేఖలు రాశారా లేదా అనేదే కీలక ప్రశ్న.  

ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక్క బీసీ కూడా నియమితులు కాలేదు కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎలా నియమితులయ్యారు. ఇందులో బాబు దొడ్డిదారి ప్రయత్నం లేదా? ఏపీ హైకోర్టులో గత 7 దశాబ్దాల కాలంలో ఆయా ప్రభుత్వాల హయాంలో ఎంతమంది బీసీ న్యాయవాదులు జడ్జీలుగా నియమితులయ్యారు. అప్పుడు మొత్తం హైకోర్టు జడ్జీల సంఖ్య ఎంత? వారిలో బీసీ జడ్జీలు ఎందరు? అలాగే హైకోర్టులో, జిల్లా కోర్టుల్లో కూడా ఎంతమందిని లా ఆఫీసర్లుగా ప్రభుత్వాలు నియమించాయి? వారిలో బీసీలు ఎంత మంది? వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్రప్రభుత్వం, మంత్రి యనమల తక్షణమే ప్రకటించాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయాన్ని ఏపార్టీ, ఏమేరకు చేసిందో తేలిపోతుంది.
– వై. కోటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్, బీసీ మహాజన సమితి, 98498 56568

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top