వైద్యానికి కావాలి చికిత్స | Boora Narsaiah Goud Article On Medical Services In Telangana | Sakshi
Sakshi News home page

వైద్యానికి కావాలి చికిత్స

Oct 4 2019 12:39 AM | Updated on Oct 4 2019 12:39 AM

Boora Narsaiah Goud Article On Medical Services In Telangana - Sakshi

చరిత్రలోకి పోతే హైదరాబాద్‌ స్టేట్‌లో భారతదేశంలో కంటే అద్భుతమైన వైద్య సదుపాయాలు ఉండేవి. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, యునానీ హాస్పిటల్, టీబీ హాస్పిటల్, వికారాబాద్‌లో టీబీ శానిటోరియం, ఫీవర్‌ హాస్పిటల్, బొక్కల దవాఖాన ఇలా అప్పటి ఇతర ప్రాంతాల్లో కన్నా ఇక్కడ మెరుగ్గా ఉండేవి. కానీ కాలక్రమేణా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ హాస్పిటల్స్‌ రోజురోజుకు దిగజారి, 60 ఏండ్ల ఉమ్మడి ఏపీలో కేవలం మూడు మెడికల్‌ కాలేజీలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత చాలావరకు పరిస్థితి మెరుగయ్యింది. 

తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే సిద్దిపేట, మహబూబ్‌ నగర్, నల్గొండ, సూర్యాపేటలో మెడికల్‌ కాలేజీలు, అలానే కేంద్ర ఎయిమ్స్‌ భువనగిరిలో రావడం జరిగింది. మొత్తం పది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నవి. ప్రైవేట్‌ రంగంలో 17 మెడికల్‌ కాలేజీలు ఉన్నవి. కొత్తవి వస్తున్నవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత హెల్త్‌ బడ్జెట్‌ పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్, ఎల్‌ఓసీ కలిపి దాదాపు ఐదువేల కోట్ల బడ్జెట్‌ మన రాష్ట్రం ఖర్చు చేస్తున్నది. దీంతోపాటు కేసీఆర్‌ కిట్, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, కేంద్ర ప్రభుత్వ సీజీహెచ్‌ఎస్, ఈఎస్‌ఐ, సింగరేణి ఇలా ఎన్నో ఆరోగ్య పథకాలు ఉన్నవి. ప్రభుత్వం ఇన్ని చేసినా ప్రజల్లో ప్రభుత్వ వైద్యశాలల మీద ఇంకా అనుకున్నంత నమ్మకం కలగడం లేదు. దీనికి ప్రధాన కారణం డబ్బే కాదు, ఉన్న వసతులను, నైపుణ్యాన్ని సరిగ్గా ఉపయోగించడంలో కొంత లోపం ఉన్నది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలను ఇంకా వైద్యరంగంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది.

మన రాష్ట్రంలో పది ప్రభుత్వ, పదిహేడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ అనుబంధ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఆరు జిల్లా స్థాయి హాస్పిటల్స్, 37 ఏరియా హాస్పిటల్స్, 99 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్, 8 మదర్‌ అండ్‌ చైల్డ్‌ హాస్పిటల్స్, 636 పీహెచ్‌ సీలు, 249 యూపీహెచ్‌ సీలు, 4797 సబ్‌ సెంటర్లు, 106 బస్తీ దవాఖానాలు, మొత్తం కలిపితే దాదాపు 5961 హెల్త్‌ ఫెసిలిటీలు తెలంగాణ రాష్ట్ర అధీనంలో ఉన్నవి. ఇవి కాకుండా ఈఎస్‌ఐ దవాఖానాలు, సింగేరి, ఆర్‌ టీíసీ, ఆర్మీ, సీజీహెచ్‌ఎస్, రైల్వేస్‌ హాస్పిటల్స్‌ ఉంటవి. ఇక ప్రైవేట్‌ రంగంలో దాదాపు 2860 హాస్పిటల్స్, 40 కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ ఉన్నవి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య దాదాపు 80 వేల మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న వసతులు, సిబ్బందిని శాస్త్రీయ పద్ధతులలో ఉపయోగించుకుంటే ప్రస్తుతం కంటే దాదాపు 20 శాతం అధిక సేవలు అందించవచ్చు. 

తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటవి. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్లు, ప్రభుత్వం వెయ్యి కోట్లు, ప్రజలు సొంతంగా 8 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే సగటున దాదాపు ప్రతి కుటుంబం 14 వేల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి ఖర్చు పెడుతోంది. మనం ఈ ధనాన్ని ప్రణాళికాబద్ధంగా వాడితే భారత దేశంలోనే ఒక మోడల్‌ హెల్త్‌ స్టేట్‌ని మనం నిర్మాణం చేయవచ్చు. కోటి కుటుంబాల వైద్యానికి ఒక కాంట్రిబ్యూటరీ విధానం ద్వారా యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. కావలసింది ఒక దృఢ సంకల్పమే. ఉదాహరణకు ఒక పేద కుటుంబానికి నెలకు రెండు వేలు పెన్షన్‌. అంటే సంవత్సరానికి 24 వేలు పెన్సన్‌ ఇచ్చినా ఒక రెండు రోజులు జ్వరంతో ఆ ఇంట్లో వ్యక్తి హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయితే కనీసం 20 వేలు హాస్పిటల్‌ బిల్లు అవుతుంది. దానికోసం మందుల బిల్లు తక్కువ చేయగలిగితే సంపద సృష్టించినట్టే.

అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలను ఆదరించినప్పుడు వారికి ఈ ఫలాలు ఎక్కువగా దొరుకుతాయి. లేదా ఎన్నికల రోజు పంచే నోట్లు, క్వార్టర్‌ బాటిల్స్‌ మీద ప్రజాస్వామ్యం నడిస్తే చట్ట సభల్లో ఎక్కువ శాతం విద్య, వైద్య రంగలకు చెందిన  వ్యాపారవేత్తలే ఉంటారు. వారి నిర్ణయాలు కూడా వారి వారి ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటవి. ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అనువారు, కానీ ఇప్పుడు అది వైద్యో వ్యాపార హరి అని కాకుండా ఉండాలంటే అంతిమంగా ప్రజలే పాలన నిర్ణేతలు.


డా. బూర నర్సయ్య గౌడ్‌
వ్యాసకర్త మాజీ పార్లమెంట్‌ సభ్యులు (భువనగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement