జగన్‌ రాకకోసం... సిద్ధంగా డల్లాస్‌

Article by Telugu Times Editor on CM YS Jagan America Tour - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తిగత పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో 17వ తేదీన సమావేశం కానున్నారు. డల్లాస్‌లోని అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్స్‌లో ఒకటైన కేబిల్లే కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుంచి, కెనడా నుంచి కూడా తెలుగువాళ్ళు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలోని అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాలతోపాటు, ప్రాంతీయ తెలుగు సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తోంది. తెలుగు ఎన్నారై ప్రముఖులను, ఇతరులను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానిస్తోంది. 

ఏపీ సీఎంగా బాధ్యతలను స్వీకరించాక వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తొలిసారిగా అమెరి కాలో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నారై నాయకులు, వైఎస్‌ఆర్‌ను అభిమానించే ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) నాయకులు ఆయనను కలుసుకుని అమెరికాలోని పార్టీ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరారు. అమెరికాలోని అన్ని సంఘాలను, కుల– ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే తాను వస్తానని సీఎం చేసిన సూచన మేరకు, ఈ సమావేశంలో జాతీయ తెలుగు సంఘాలను, ఇతర సంఘాలను పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 17న జరగనున్న ఈ ఆత్మీయ సమావేశాన్ని తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్‌లో నిర్వహించనున్నారు. అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ అయిన డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను దీనికోసం బుక్‌ చేశారు. అమెరికాలో ఉంటూ వైఎస్‌ఆర్‌సీపీ విజయంకోసం శ్రమిస్తున్న వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి. నేషనల్‌ కో ఆర్డినేటర్లుగా వారిని నియమించారు.

అలాగే జాతీయ తెలుగు సంఘాలను, ఇతర సంఘాలను, డల్లాస్‌లో ఉన్న స్థానిక తెలుగు సంఘాలను కలుపుకుని హోస్ట్‌ కమిటీని రూపొందించారు. తెలుగు సంఘాల అధ్యక్షులను, స్థానికంగా ఉన్న నేతల్ని కూడా ఈ కమిటీలో తీసుకున్నారు. తానా, ఆటా, నాటా, నాట్స్, ఆటా తెలంగాణ, తెలంగాణ తెలుగు అసోసియేషన్, టాంటెక్స్, ఆప్తా, టీడీఎఫ్, డాటా, టీపాడ్, ఐఎ ఎన్‌టీ, ఎన్నారై వాసవీ అసోసియేషన్‌ వంటి ప్రముఖ సంస్థలన్నీ ఈ సమావేశంలో పాల్గొననుండటం విశేషం. వైఎస్‌ జగన్‌ డల్లాస్‌ పర్యట నను విజయవంతం చేసేందుకు అటు ఎన్నారై  వైఎస్‌ఆర్‌సీపీ నేతలతోపాటు, స్థానికంగా ఉండే తెలుగు సంఘాలు, జాతీయ తెలుగు సంఘాలు కూడా తోడ్పాటునివ్వడం మంచిపరిణామం. అన్ని సంఘాలు, తెలుగు ప్రముఖులు ఒకే వేదికపై వచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినడానికి, ఆయనను కలిసేందుకు ముందుకురావడం రాష్ట్ర ప్రయోజనాలకు తోడ్పాటునిస్తుందని ఆశిద్దాం. – చెన్నూరి వెంకట సుబ్బారావు, అమెరికాలోని ‘తెలుగు టైమ్స్‌’ పత్రిక సంపాదకులు. 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top