ఎదురుదాడితో నేరం మాసిపోదు

Article On AP Data Theft Case In Sakshi

విశ్లేషణ  

‘మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కడం’ అనే సామెత చంద్రబాబు లాంటివారిని చూసి పుట్టిందేమో? తెలంగాణ రాజ ధాని హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థ దగ్గర ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు సంబంధించిన రహస్యమైన డేటా అక్రమంగా ఉన్నదని, ఆ డేటా ఆధారంగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని లోకేశ్వర్‌ రెడ్డి అనే పౌరుడు, పార్లమెంట్‌ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.

దీనిపై తెలంగాణ పోలీసులు ఆ ఐటీ సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేపడితే, దానికి ఏపీ సీఎం చంద్రబాబు గగ్గోలు పెట్టడం పైగా వైఎస్సార్‌సీపీయే తెలుగుదేశం అనుకూల ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నిందని, దానికి కేసీఆర్‌ ప్రభుత్వం సహకరిస్తున్నదని ఎదురుదాడికి దిగడం ఏమిటి? పోలీసులు దాడి చెయ్యగానే, ఐటీ గ్రిడ్స్‌ సంస్థ యజమాని అశోక్‌ పోలీసులకు దొరకకుండా అమరావతి పారిపోవడం ఎందుకు? పోలీసుల ముందే తన వాదనను వినిపించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా? ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన రహస్య సమాచారం ఒక ప్రయివేట్‌ సంస్థకు ఎలా చేరింది? ఆ సంస్థకు పౌరసమాచారం చేరవేసినవారు ఎవరు? ఆ సంస్థకు సమాచారం ఇవ్వuraడం సబబే అనుకుంటే, ఆ సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి ఎందుకు నడిపిస్తున్నారు? అమరావతి నుంచే నిర్వహించుకోవచ్చు కదా?  ఇక్కడే ఒక కుట్ర కోణం ఉన్నదని నిరక్షరాస్యులకు కూడా అర్ధమవుతోంది.

ఈ ఐటీ గ్రిడ్స్‌ సంస్థ యజమాని అశోక్‌కు, చంద్రబాబుకు, ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖామంత్రి లోకేష్‌కు అతి దగ్గరి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఈ సంస్థ స్థాపన వెనుక లోకేష్‌ ప్రోద్బలం, సహకారం ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. డేటా చౌర్యం విషయం బయటపడగానే చంద్రబాబు రాష్ట్ర డీజీపీ, న్యాయ సలహాదారులతో గంటన్నర పాటు సమావేశం అయ్యారన్నది ఒక వార్త అయితే, ఈ అంశం మీద ఏకంగా కేబినెట్‌ సమావేశాన్ని కూడా నిర్వహించి, వైఎస్సార్‌సీపీ మీద ఎలా ఎదురు దాడి చెయ్యాలో సీఎం ఆదేశాలు జారీ చెయ్యడం మరింత విస్తుగొలిపే అంశం. అది ఏపీకి చెందిన కంపెనీ అయితే కావచ్చు. కానీ, దాని కార్యస్థానం ఉన్నది తెలంగాణలో అయినపుడు ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చెయ్యకుండా ఎలా ఉంటారు? పోలీ  సులనుంచి పారిపోయిన అశోక్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలను కూడా తీసుకునే అవకాశం ఉన్నది. 

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ చేసిన డేటా చౌర్యం రాజ్యాంగ బద్ధంగా పౌరులకు సంక్రమించిన వ్యక్తిగత గోప్యత, ఓటు హక్కులను కాలరాయడమే అని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రయి వేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం అని, ఆ వివరాలను అడ్డం పెట్టుకుని పాలకపక్షం వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, అది తీవ్రమైన రాజ్యాంగ అపచారంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే లక్షలాది ఓట్లు గల్లంతు అయ్యాయని తెలుస్తున్నది. చివరకు ఈ నైచ్యం ఎంతవరకు వెళ్లిందంటే సాక్షి దినపత్రికను ఎవరు కొంటున్నారో చూసి వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారట! 

ఒక ఐటీ సంస్థ సైబర్‌ నేరానికి పాల్పడితే, తెలంగాణ పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తే, అదేదో ఆంధ్రా తెలంగాణ మధ్య యుద్ధం లాగా చంద్రబాబు చిత్రించడానికి తెగిస్తున్నారు. సీమాంధ్రులలో సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు. తాను తలచుకుంటే తెలంగాణలో ఒక్క ఐటీ కంపెనీ ఉండదని çహూంకరిస్తున్నారు.  చంద్రబాబు అంతటి సమర్థుడే అయితే.. గత నాలుగున్నరేళ్లలో ఇప్పటికి ఎన్ని ఐటీ కంపెనీలు ఆంధ్రా వెళ్లిపోయాయి? ఎన్ని కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో స్థాపితమయ్యాయి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఒక కంపెనీ చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తే.. దానికి భయపడి హైద్రాబాద్‌లోని ఐటీ కంపెనీలు ఆంధ్రాకు వెళ్ళిపోతాయా? ఏమిటీ బెదిరింపులు?

నిజానికి అనుకూల ఓట్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నది. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మొరపెట్టుకున్నది. గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం అయిదు లక్షలు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం అని ఎప్పటి నుంచో పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తమ అవినీతి, దోపిడీ పాలనను చూపించి ఓట్లు సాధించి అధికారాన్ని చేపట్టే అవకాశం లేదని గ్రహించిన చంద్రబాబు చివరకు ఇలాంటి సైబర్‌ నేరాలకు పాల్పడటం ద్వారా మళ్ళీ అధికారాన్ని చేపట్టాలని విఫల ప్రయత్నాలను చేస్తున్నారు.

ఆయన కోరిక ఫలించే సూచనలు లేవు కానీ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎంతమంది సిబ్బందిని అయినా రంగంలోకి దించి ఇంటింటికీ తిరిగి ఓటర్లను మళ్ళీ నమోదు చేయించాలి. అవకతవకలు కనిపిస్తే సరిదిద్దాలి. ప్రతి ఒక్క ఓటరుకు ఓటు ఉన్నదని ధ్రువపరచుకున్న తరువాతే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. ఎన్నికలకు ఇంకా రెండు మాసాల వ్యవధి ఉన్నది కాబట్టి, తక్షణమే ఓటర్ల నమోదు ప్రక్రియను యుద్ధప్రాతిపదిక మీద చేపట్టాలి.

ఇలపావులూరి మురళీ మోహనరావు
వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు
మొబైల్‌ : 81433 18849

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top