
వినాయకుణ్ని పెంచుకుందాం..!
దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం.
దేవుడికి అలసట అంటూ ఒకటి ఉండదేమో! ఎలా కొలిచినా తనవాణ్ని చేసేసుకుంటాడు. ఇక విఘ్నాలను తొలగించే దేవుడిగా పేరున్న వినాయకుడికైతే ఏటా పెద్ద ఉత్సవమే నిర్వహిస్తాం. ఇంట్లో చిన్న వినాయకుణ్ని పెట్టుకుంటాం. వీధిలో పదడుగులు ఉంటుంది ఒక విగ్రహం. ఓ ఊర్లో యాభై అడుగులు ఉంటుంది ఇంకో విగ్రహం. ఎలా కొలిచినా సరే కదా అని చెప్పి రకరకాల రంగులు వాడేస్తున్నాం. విగ్రహం తయారీకి ఏవేవో కృత్రిమ పదార్థాలు వాడేస్తున్నాం. అవన్నీ నిమజ్జనం రోజున చెరువుల్లో, నదుల్లో మునిగిపోయి ప్రకృతిని పాడు చేస్తున్నాయి. విఘ్నాలను తొలగించే దేవుణ్ని కొలిచేందుకు ప్రకృతికి ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నాం? అందుకే ఇప్పటికైనా ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణహిత) మార్గానికి వెళ్దాం అంటూ పుట్టుకొచ్చిన కొత్త వినాయకుణ్ని కొలుద్దాం...
దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే వినాయకుడికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజున మొదలయ్యే ఈ ఉత్సవాన్ని ఏటా తొమ్మిది నుంచి 21 రోజుల పాటు జరుపుతున్నాం. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఆయన మరణం తర్వాత ఈ వేడుక మళ్లీ ఇంటివరకే చేసుకునే పండుగగానే మిగిలిపోయింది. 1880వ దశకంలో, బ్రిటిష్ పాలన జరుగుతున్న రోజుల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలను మరోసారి పెద్ద ఎత్తున నిర్వహించడం మొదలైంది. ఇక నాటినుంచి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అదే స్థాయిలో జరుగుతూనే వస్తున్నాయి.
మొదట్లో వినాయక చవితి ఉత్సవాలకు పూర్తిగా మట్టి విగ్రహాలనే తయారు చేసేవారు. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాకతో విగ్రహాల తయారీల ఖర్చు ఊహించని స్థాయిలో తగ్గడం, సులువుగా, కలర్‌ఫుల్‌గా విగ్రహాలను తయారుచేసే అవకాశం దొరకడంతో దాదాపుగా సమాజమంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకే ఓటు వేస్తూ వచ్చింది. అయితే విగ్రహాల తయారీకి ఇలా వాడుతోన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగులు వినాయక నిమజ్జనం తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయని, పర్యావరణానికి హాని చేస్తున్నాయని చెబుతూ గత ఐదారు సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల వైపుకు సమాజం అడుగులేస్తోంది. ఏటా ఇదే విషయంపై ఎన్నో క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. అలాంటి కొత్త వినాయకుడి విశేషాలు..
వినాయకుణ్ని పెంచుకుందాం..!
వినాయకుణ్ని తొమ్మిది రోజుల పాటు ఇష్టంగా కొలుస్తాం. పూజలు చేస్తాం. ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను పెడతాం. పదోరోజు భారీగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేసి, కైలాసానికి సాగనంపుతాం. అక్కడితో మన పని అయిపోతుంది. నిమజ్జనం జరిగాక కూడా ఆ దేవుడే చెట్టంతై మనతోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది 30 ఏళ్ల కొతూర్ దత్తాద్రికి. అనుకున్నదే తడవు ట్రీ వినాయకుణ్ని తయారు చేశాడు. ఎర్ర మట్టిలో కొన్ని రకాల విత్తనాలను కలిపి, ఆ మట్టితో చిన్న వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఓ కుండీలో పెట్టి పూజించుకున్నాడు. పదో రోజున దగ్గర్లో ఉన్న చెరువులో కాకుండా అదే కుండీలో నీళ్లు పోసి నిమజ్జనం చేశాడు. ఆ మట్టిలోని విత్తనం మొక్కగా మారింది. నిమజ్జనం తర్వాత కైలాసానికి వెళ్లిపోయినా, ఆ దేవుడింకా మొక్కలా అదే ఇంట్లో కొలువై ఉన్నాడు. వినాయకుణ్ని పెంచుకోవాలన్న దత్తాద్రికి వచ్చిన ఈ ఆలోచన ఎంత బాగుందీ!! ఎకో ఫ్రెండ్లీ క్యాంపెయిన్‌లో భాగంగా గతేడాది చాలామంది ఈ దారిని ఎంచుకున్నారు. ఈ ఏడాది ట్రీ వినాయకుడికి మరింత క్రేజ్ పెరిగింది.
ఆకలి తీర్చిన వినాయకుడు
రింతూ రాథోడ్‌కు వినాయకుణ్ని పూజించడం ఎంతిష్టమో, పర్యావరణాన్ని కాపాడుకోవడమూ అంతే ఇష్టం. దీంతో ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ని తయారు చేయాలని నిశ్చయించుకుంది. స్వతహాగా హోమ్ బేకర్ అయిన రింతూ, చాకొలేట్‌తో 35 కిలోల వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. కొన్ని ఫుడ్ కలర్స్‌ను వాడుతూ ఆ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దింది. తొమ్మిది రోజులు ఏసీ గదిలో ఆ వినాయకుణ్ని పూజించింది. నిమజ్జనం రోజున 90 లీటర్ల పాలు తీసుకొచ్చి, చాకొలేట్ వినాయకుణ్ని నిమజ్జనం చేసింది. నిమజ్జనం అయ్యాక ఆ పాలు, చాకొలేట్‌లతో తయారైన ఆహారాన్ని ఏం చేసిందో తెలుసా? దగ్గర్లోని నిరుపేద పిల్లలకు పంచి పెట్టింది. పండుగరోజున చాకొలేట్ వినాయకుడు ఎంతమంది పిల్లల చిన్ని బొజ్జలను నింపాడో!!
టేస్టీ వినాయకుడు
ఈ వినాయకుడు నిజంగానే టేస్టీ! తినే పదార్థాలతోనే ఈ వినాయకుణ్ని తయారు చేస్తున్నారు. బిస్కెట్స్, బాదం, జీడిపప్పు, గోధుమ పిండి, క్యాండీలు.. ఇలా రకరకాల తినే పదార్థాలను వాడుకుంటూ అందంగా, ఆకర్షణీయంగా వినాయకుణ్ని తయారు చేయడం కూడా ఇప్పుడు బాగా కనిపిస్తోంది. కొంత శ్రమ, ఆసక్తి ఉంటే సొంతంగానే ఈ టేస్టీ వినాయకుణ్ని తయారు చేసుకోవచ్చు.
విశ్వ వినాయకుడు
వినాయకుడు కేవలం హిందూమతానికి మాత్రమే, కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. వినాయకుణ్ని జైనులు, బౌద్ధులు కూడా తమ తమ రీతుల్లో ఆరాధిస్తారు. భారతదేశంతో పాటు పలు ఆసియా దేశాల్లో వినాయకుడి ఆరాధన వేల ఏళ్ల కిందటే ఉండేదనేందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రమథ గణనాయకుడైన వినాయకుడు నిజానికి విశ్వవినాయకుడు. భారత భూభాగానికి వెలుపల గజాననుడి ఆరాధన విశేషాలు మీ కోసం...
వినాయకుణ్ని వ్యాపారవర్గాల వారు విశేషంగా ఆరాధించేవారు. సముద్ర వర్తకుల పుణ్యమా అని వినాయకుడు భారత భూభాగాన్ని దాటి బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, జపాన్ తదితర దేశాలకు విస్తరించాడు. హిందువుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్‌లోను, శ్రీలంకలోను, నేపాల్‌కు పొరుగునే ఉండే భూటాన్, టిబెట్ ప్రాంతాలలో కూడా శతాబ్దాల కిందటే వినాయకుడి ఆరాధన ఉండేది. హిందూ మతస్తులతో పాటు వారితో సన్నిహితంగా మెలగిన జైనులు, బౌద్ధులు కూడా వినాయకుణ్ని ఆరాధించేవారు.
జైన వినాయకుడు
జైన మత నిబంధనలకు సంబంధించిన సాహిత్యంలో ఎక్కడా వినాయకుడి ప్రస్తావన కనిపించకపోయినా, జైనులు వినాయకుణ్ని శతాబ్దాల కిందటే ఆరాధించేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. పన్నెండో శతాబ్దికి చెందిన జైన గురువు హేమచంద్ర రాసిన ‘అభిధాన చింతామణి’, పదిహేనో శతాబ్దికి చెందిన జైన గురువు వర్ధమాన సూరి రాసిన ‘ఆచార దినకర’ వంటి గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. వినాయకుణ్ని ఈ గ్రంథాలలో హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా అభివర్ణించారు. ఇవి శ్వేతాంబర జైన గ్రంథాలు. దిగంబర జైన గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన పెద్దగా కనిపించదు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని ఖండగిరి, ఉదయగిరి గుహలలోను, మథురలోను మధ్యయుగాల నాటి జైన ఆరాధనా కేంద్రాలలో వినాయకుడి శిల్పాలు కనిపిస్తాయి. రాజస్తాన్, గుజరాత్‌లలోని జైన ఆలయాల్లోనూ వినాయకుడి చిత్రాలు కనిపిస్తాయి.
బౌద్ధ వినాయకుడు
ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. గుప్తుల కాలం నాటి బౌద్ధ శిల్పాలలో వినాయకుడి శిల్పాలు కూడా కనిపిస్తాయి. టిబెటన్ల వినాయకుడు రుధిరవర్ణంలో ఉగ్రరూపంలో కనిపిస్తాడు. ‘మహారక్త’ గణపతిగా టిబెటన్లు వినాయకుణ్ని తాంత్రిక పద్ధతుల్లో కొలిచేవారు. టిబెట్‌లోని వజ్రయాన బౌద్ధులు, చైనాలోని షింగాన్ బౌద్ధులు వినాయకుణ్ని ఆరాధించేవారు. షింగాన్ బౌద్ధుల ద్వారానే వినాయకుడి ఆరాధన జపాన్‌కు పాకింది. జపాన్ రాజధాని టోక్యో శివార్లలోని అసాకుసా ప్రాంతంలో పన్నెండో శతాబ్ది నాటి గణపతి ఆలయం ఉంది. బౌద్ధులు గణపతిని తమ దైవాలలో ఒకరిగా ఆరాధిస్తే, హిందువుల గణపతి పురాణం, ముద్గల పురాణాలు బుద్ధుణ్ని గణపతి అవతారంగా అభివర్ణించడం విశేషం. థాయ్‌లాండ్ వాసులు వినాయకుణ్ని ఆరాధించడం ద్వారా అదృష్టం కలసి వస్తుందని, విజయాలు వరిస్తాయని విశ్వసిస్తారు. ఇండోనేసియన్లు గణపతిని జ్ఞానప్రదాతగా పూజిస్తారు. ఇండోనేసియాలోని బేండుంగ్‌లో గణేశుడి పేరిట ఒక వీధి ఉంది. జావాకు చేరువలోని ఒక దీవిలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటి పురాతన వినాయకుడి విగ్రహం బయటపడింది. ఇండోనేసియాలోని ప్రంబానన్ ఆలయంలో తొమ్మిదో శతాబ్ది నాటి వినాయకుడి విగ్రహం ఉంది. ఇవన్నీ ప్రాచీనకాలం నుంచే ఇతర దేశాల్లోని వినాయకుడి ఆరాధనకు, ఉనికికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉన్నాయి.
లంబోదరునికి నైవేద్యం...
వినాయక చవితి అనగానే గుర్తొచ్చేవి... తొమ్మిది లేదా పదకొండు రోజులు జరిగే పూజలు, పెట్టే రకరకాల ప్రసాదాలు. అలాగే పండుగ రోజు ఇళ్లలో దేవుడికి పెట్టే నైవేద్యాలు. ఇవి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కానీ ఉండ్రాళ్ల పాయసం, కుడుములు మాత్రం తప్పనిసరిగా చేస్తారు. అలాగే పులిహోర, శనగ గుగ్గిళ్లు కూడా ఉంటాయి. వీటితో పాటు వాళ్లవాళ్ల ఆచారాలను, ఇష్టాలను బట్టి స్వీట్లు, రకరకాల పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. తెలంగాణలో ప్రత్యేకంగా ఆరోజు పెసర పప్పులో తుమ్మికూర, చింతకాయ వేసి పప్పు చేస్తారు. తుమ్మికూరంటే వినాయకుడికి బాగా ఇష్టమని నమ్ముతారు.
ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు...
వీధిలో పెద్ద వినాయకుడు ఉన్నా, ఇంట్లో చిన్న వినాయకుణ్ని ప్రతిష్టించుకొని కొలుస్తూనే ఉంటాం కదా! ఆ వినాయకుణ్ని స్వయంగా మనమే సులువుగా 9 అంచెల్లో తయారు చేసుకోగల మార్గం ఇది.
కావాల్సినవి :
ఒక కిలో బంకమట్టి పౌడర్ (క్లే పౌడర్ అని మార్కెట్‌లో దొరుకుతుంది)
పౌడర్‌ను ముద్దగా చేసేందుకు సరిపడేన్ని నీళ్లు
విగ్రహంపై మార్క్స్ పెట్టుకునేందుకు టూత్‌పిక్స్
1
ముందుగా క్లే పౌడర్‌ను తీసుకొని నీళ్లు కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి. ఆ మట్టి ముద్దను కింద ఫొటోలో చూపిన విధంగా 5 చిన్న ముద్దలుగా, 3 మధ్యస్థంగా ఉండే సైజు ముద్దలుగా, 2 పెద్ద ముద్దలుగా చేసి పెట్టుకోవాలి.
2
రెండు పెద్ద ముద్దలతో అడుగు భాగం, ఉదర భాగం రెడీ చేసుకోవాలి.
3
మరో మట్టి ముద్దను తీసుకొని కింద చూపినట్టు నాలుగు పొడవు ముద్దలను రెడీ చేసుకోవాలి.
4
పొడవు ముద్దను ఉదర భాగం చుట్టూ కింద చూపినట్టు పేర్చుకోవాలి.
5
మరో పొడవు ముద్దను కూడా అలాగే పేర్చుకొని, చేతులుగా రెండు చిన్న ముద్దలను పెట్టుకోవాలి. ఒకటి లడ్డుగా కనిపించేలా, ఇంకొకటి దీవించే చెయ్యిగా కనిపించేలా చూస్కోవాలి.
6
మధ్యస్థ సైజులో ఉన్న ఓ ముద్దను తీసుకొని ఉదర భాగం పైన నిలబెట్టాలి.
7
మరో పొడవు ముద్దను తొండంగా పేర్చుకోవాలి. ఇక రెండు చిన్న ముద్దలను చెవులుగా తీర్చి దిద్దుకోవాలి.
8
తల మీద మూడు ముద్దలను పేర్చుకుంటూ వెళ్లాలి. తల ముందు భాగానికి కూడా రెండు ముద్దలను ఫొటోలో చూపించినట్లు పెట్టుకోవాలి. ఉదర భాగం మీదుగా చిన్న జంజం ఒకటి పెట్టుకోవాలి.
9
ఇప్పుడు మరీ చిన్న చిన్న ముద్దలను రెడీ చేసుకొని ముఖ భాగాన్ని మరింతగా డెకరేట్ చేసుకోవాలి. టూత్ పిక్ తీసుకొని ఫొటోలో చూపినట్లు మార్క్స్ గీసుకుంటూ పోవాలి. అంతే! మన ఇంట్లోనే మట్టి వినాయకుడు రెడీ అయిపోతాడు. ఇక కొన్ని సహజ సిద్ధమైన రంగులను వాడుతూ ఇదే విగ్రహాన్ని కలర్‌ఫుల్‌గానూ చేసుకోవచ్చు.
నీటిని శుద్ధి చేసే వినాయకుడు
వినాయక నిమజ్జనం అంటే ఇప్పుడు పర్యావరణానికి హాని తలపెడుతున్న ఓ చర్యగానే చెప్పుకుంటూ ఉంటారు పర్యావరణ ప్రేమికులంతా! అందులో వాడుతున్న కలర్స్, మెటీరియల్స్ ఇందుకు కారణం. అయితే కొందరు యువకులు ఇందుకు భిన్నంగా నీటిని కలుషితం చేయకుండా, అదే వినాయక నిమజ్జనంతో నీటిని శుద్ధి చేయగలిగితే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే పటిక (ఆలమ్) వినాయకుడు. రెండు పెద్ద సైజులో ఉండే పటికలను తీసుకొని వాటిని వినాయక విగ్రహంగా తీర్చిదిద్దారు. అదనపు హంగుల కోసం కొన్ని సహజ సిద్ధమైన రంగులను వాడారు. పటికకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. దీంతో పటిక వినాయకుణ్ని నిమజ్జనం చేస్తే, ఆ నీరు ఇంకా శుద్ధి అవుతుంది. గతేడాది ముంబైలో పటిక వినాయక విగ్రహాలతో ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఈ ఆలోచనకు మూల కారకుడైన బిçశ్వరంజన్ రథ్ తన టీమ్‌తో కలసి రాబోయే కాలంలో పటిక వినాయకుడి విగ్రహాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వినాయకుడంటే చేపలకు భలే ఇష్టం!
‘‘ఏటా వినాయక నిమజ్జనంతో నీళ్లన్నీ కలుషితం అవుతున్నాయి. విగ్రహాల తయారీకి వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి లక్షల్లో చేపలను చంపేస్తున్నాయి.’’ ఈ ఆలోచన స్ప్రౌట్స్ ఎన్విరాన్‌మెంట్ ట్రస్ట్‌ను కలచివేసింది. ఇందుకోసం ఏదైనా చేయాలని తపించింది. అలా పుట్టిందే ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుడు. చేపలకు ఇష్టమైన ఆహార పదార్థాలతో స్ప్రౌట్స్ టీమ్ వినాయకుణ్ని తయారు చేసింది. ఆ విగ్రహానికి ఫుడ్ కలర్స్ కూడా ఇచ్చేసి తీర్చిదిద్దారు. నిమజ్జనం రోజున నీటిని కాలుష్యం చేస్తున్నామన్న ఒక ఫీలింగ్ కూడా ఉండదు. చక్కగా నీళ్లలో కలిసిపోయిన దేవుడి వైపుకు ఇష్టంగా చేపలన్నీ పరుగులు పెడతాయి. ఈ వినాయకుడికి ఇప్పుడు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ‘గాడ్ సేవ్ ఓషియన్’ పేరుతో స్ప్రౌట్స్ టీమ్ మరింత మందికి ఫిష్ ఫ్రెండ్లీ వినాయకుడు చేరువయ్యేలా ప్లాన్ చేస్తోంది. దేవుడంటే ఎవ్వరికైనా ఇష్టమే! ఇలా కడుపు నింపే దేవుడంటే..!
పండ్లు, కూరగాయల వినాయకుడు!
అచ్చంగా పండ్లు, కూరగాయలు వాడుతూ తయారు చేసే వినాయకుడికి కూడా ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. కాస్తంత శ్రద్ధ పెడితే ఇంట్లోనే కూరగాయలతో వినాయకుణ్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే చాలా రకాల కూరగాయలను తీసుకొని కొందరు డిజైనర్స్ ప్రత్యేకంగా ఈ తరహా వినాయకుణ్ని తయారు చేయడం మొదలుపెట్టారు. కొత్తగా ఉంటుందని చెప్పి యువత కూడా ఈమధ్య కాలంలో వెజిటెబుల్, ఫ్రూట్స్ వినాయకుడికి ఓటేస్తున్నారు. ‘గ్రీన్ గణేశ’ పేరుతో జరుగుతున్న క్యాంపెయిన్స్‌లో పర్యావరణానికి హాని కలిగించని ఐడియాల్లో ఈ కొత్త వినాయకుడూ బాగా వినిపిస్తోంది. వెదురుతో, కొబ్బరికాయలతో, చెరకు గడలతో, సొరకాయలతో.. ఇలా అన్నిరకాలతో వినాయకుణ్ని తయారు చేస్తున్నారు. ఏటా ఈ ట్రెండ్‌ను చాలామందే అందిపుచ్చుకుంటున్నారు.
మట్టి వినాయకుడు
ఎకో ఫ్రెండ్లీ కొత్త వినాయకుడిలో పైన చెప్పుకొచ్చిన విధంగా ప్రయత్నించాలంటే ఆసక్తి ఎక్కువ ఉండాలి. సమయం కూడా ఎక్కువే పట్టే అవకాశం ఉంది. సులువుగా తయారు చేసుకోగల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడంటే మట్టి వినాయకుడే! అదేవిధంగా కాస్త పెద్ద సైజులో వినాయకుడి విగ్రహం ఉండాలనుకునే వారికీ ఇదే మంచి ఆప్షన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు ఇదొక్కటే అతిపెద్ద ప్రత్యామ్నాయంగా కనిపిస్తూ ఉండటంతో గత ఐదారు సంవత్సరాలుగా మట్టి వినాయకుడికి క్రేజ్ బాగా పెరిగింది. చాలా మండపాల్లో యువతరం మట్టి వినాయకుణ్ని ప్రతిష్టించేందుకే మక్కువ చూపుతున్నారు. కలర్స్ కూడా న్యాచురల్‌గా వాడుతూ ఉండటంతో పర్యావరణాన్ని పరిరక్షించుకునే భాగంలో సమాజం వేస్తున్న గొప్ప ముందడుగు మట్టి వినాయకుడు. దేవుణ్ని పూజించేదే అందరం బాగుండాలని. ఇంత పెద్ద ఉత్సవానికి అడ్డుచెప్పని ప్రకృతి ఫలాలు తరువాతి తరాలకూ అందాలను కోరుకోవడం కూడా ఓ అవసరమే! ఆ అవసరాన్ని గుర్తించడమే ఎకో ఫ్రెండ్లీ కొత్త వినాయకుడి వైపుకు వేసే అడుగు. జై ఎకో ఫ్రెండ్లీ గణేశ్!!
– ఫన్‌డే డెస్క్