బలాంగులు

Today 'International Day of Persons with Disabilities' - Sakshi

 కవర్‌ స్టోరీ

నేడు ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌’ సందర్భంగా

అంగ వైకల్యం ఆశయ సాధనకు అవరోధం కాదు. మానసిక వైకల్యం మనిషి పురోగతికి లోపం కాదు. జనాభాలో చాలామందికి ఎలాంటి శారీరక వైకల్యాలూ, మానసిక వైకల్యాలూ ఉండవు. మనశ్శరీరాలను బాధించే సమస్యలు ఏవీ లేకున్నా, జీవితం గడవటానికి ఏ లోటూ లేకున్నా పుట్టినది మొదలు పోయేలోగా జీవితంలో అలాంటి వాళ్లు సాధించేదేమీ ఉండదు. దృక్పథంలోని వైకల్యాల కారణంగానే చాలామంది నిరర్థకంగా బతుకులు లాగించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల కంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన గల వికలాంగులే మెరుగైన వాళ్లు. కుంగదీసే వైకల్యాలు ఉన్నా, వివిధ రంగాల్లో ఎవరికీ తీసిపోని ఘనవిజయాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరు ప్రముఖుల గురించి...

స్టీఫెన్‌ హాకింగ్‌
సమకాలీన ప్రపంచంలో సాటిలేని మేటి మేధావిగా గుర్తింపు పొందిన మనతరం మహా శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌. భౌతికశాస్త్రంలోను, అంతరిక్ష శాస్త్రంలోను ఆయన సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. స్టీఫెన్‌ హాకింగ్‌ 1942 జనవరి 8న ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ నగరంలో పుట్టాడు. తండ్రి ఫ్రాంక్, తల్లి ఇసోబెల్‌. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఫ్రాంక్, ఇసోబెల్‌ ఒక మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేవారు. ఫ్రాంక్‌ పరాన్నజీవుల మీద పరిశోధనలు సాగించేవాడు. ఇసోబెల్‌ అక్కడే సెక్రటరీగా పనిచేసేది. అక్కడి పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు స్టీఫెన్‌ పుట్టాడు. పుట్టినప్పుడు సాధారణంగానే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. కాలేజీలో ఉన్న కాలంలోనే ఐన్‌స్టీన్‌కు సాటి వచ్చే మేధావిగా గుర్తింపు పొందాడు. సాటి విద్యార్థులే కాదు, అధ్యాపకులు సైతం స్టీఫెన్‌ మేధాశక్తికి అబ్బురపడేవారు. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న కాలంలో మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌కు లోనయ్యాడు. క్రమక్రమంగా వ్యాధి శరీరాన్ని లొంగదీసుకుంటుండడంతో చాలా రోజులు డిప్రెషన్‌లో పడ్డాడు. ఇతరుల సాయం లేనిదే నడవలేని స్థితికి చేరుకున్నాడు. మాటల్లో స్పష్టత కోల్పోయాడు. అప్పట్లో స్టీఫెన్‌ హాకింగ్‌ను పరీక్షించిన వైద్యులు రెండేళ్లకు మించి బతకడం సాధ్యం కాదని పెదవి విరిచేశారు. అంతరిక్ష రహస్యాల అంతు తేల్చాలన్న హాకింగ్‌ సంకల్పం ముందు వైద్యుల అంచనాలు తల్లకిందులయ్యాయి. దాదాపు కదల్లేని స్థితిలో ఉన్నా, పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాడు. పూర్తిగా వీల్‌చైర్‌కు పరిమితమైన స్థితిలో సైతం భౌతిక శాస్త్రంలో, అంతరిక్ష శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ‘ఆడమ్స్‌ అవార్డు’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను, సత్కారాలను పొందాడు. శారీరక పరిస్థితి వల్ల హాకింగ్‌ నిమిషానికి పదిహేను పదాలను మాత్రమే మాట్లాడగలడు. అయినా, ఏమాత్రం సడలని పట్టుదలతో ప్రస్తుతం డెబ్బై అయిదేళ్ల వయసులోనూ తన కాలాన్ని శాస్త్ర పరిశోధనలకే వెచ్చిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

హెలెన్‌ కెల్లెర్‌
ఊహ తెలియని బాల్యంలోనే కంటిచూపును, వినికిడి శక్తిని కోల్పోయినా మొక్కవోని దీక్షతో రచయిత్రిగా, ఉద్యమకారిణిగా, సామాజిక సేవకురాలిగా ఎదిగిన గొప్ప మహిళ హెలెన్‌ కెల్లెర్‌. అమెరికాలో అలబామా రాష్ట్రంలోని టస్కంబియా పట్టణంలో 1880 జూన్‌ 27న పుట్టిందామె. ఆమె తండ్రి చార్లెస్‌ ఆడమ్స్‌ అమెరికన్‌ సివిల్‌ వార్‌లో సైనికాధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత ఒక పత్రికకు సంపాదకుడయ్యాడు. తల్లి కేట్‌ ఆడమ్స్‌ సాధారణ గృహిణి. మాటలైనా సరిగా పలకడం రాని పంతొమ్మిది నెలల వయసులో హెలెన్‌ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఫలితంగా కంటిచూపును, వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయింది. కాస్త ఎదుగుతున్న వయసులో తన మనసులోని మాటలను సైగల ద్వారా చెప్పడానికి ప్రయత్నించేది. మొదట్లో ఆమె సైగలను వాళ్ల ఇంట్లో పనిమనిషి కూతురు ఆరేళ్ల పసిపాప మార్తా వాషింగ్టన్‌ మాత్రమే అర్థం చేసుకోగలిగేది. హెలెన్‌ తనకు ఏడేళ్ల వయసు వచ్చేనాటికి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి తనకు తానుగానే అరవై రకాల సైగలను రూపొందించుకుంది. అప్పట్లో లారా బ్రిడ్గ్‌మాన్‌ అనే బధిరాంధ మహిళ సాధించిన విజయాల గురించి ప్రఖ్యాత రచయిత చార్లెస్‌ డికెన్స్‌ రాసిన వ్యాసం హెలెన్‌ తల్లి కేట్‌పై ప్రభావం చూపింది. ప్రయత్నిస్తే తన కూతురు కూడా విజయాలు సాధించగలదని ఆమె విశ్వసించింది. తొలుత ఒక వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచనపై టెలిఫోన్‌ ఆవిష్కర్త అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ వద్దకు కూతురిని తీసుకువెళ్లింది. గ్రాహంబెల్‌ అప్పటికే బధిర బాలల విద్య కోసం కృషి కొనసాగిస్తున్నాడు. అతని సలహాపై పెర్కిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్లైండ్‌ను ఆశ్రయించింది. ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ హెలెన్‌ కోసం ఏన్‌ సులివాన్‌ అనే టీచర్‌ను కుదిర్చాడు. హెలెన్‌కు ఏన్‌ ఇంటి వద్దనే పాఠాలు చెప్పేది. పెర్కిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాక మసాచుసెట్స్‌లోని ర్యాడ్‌క్లిఫ్‌ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి, అమెరికాలోనే డిగ్రీ సాధించిన తొలి బధిరాంధ మహిళగా గుర్తింపు పొందింది. డిగ్రీ పూర్తయ్యాక ఏదో ఉద్యోగం చూసుకుని స్థిరపడిపోకుండా, సాటి వికలాంగుల అభ్యున్నతి కోసం అహరహం పాటుపడింది. సామాజిక కార్యకర్త జార్జ్‌ ఏ కెస్లర్‌తో కలసి మూగ, బధిర, అంధ బాలల చికిత్స కోసం, అందుకు సంబంధించిన వైద్య పరిశోధనల కోసం హెలెన్‌ కెల్లెర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థను స్థాపించింది. అమెరికాలోని సోషలిస్టు పార్టీలో చేరి, మహిళలకు ఓటు హక్కు, పేదరిక నిర్మూలన వంటి పలు సామాజిక సమస్యలపై పోరాటం సాగించింది. వక్తగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించింది.

బీథోవెన్‌
పాశ్చాత్య శాస్త్రీయ సంగీత ప్రపంచంలో మైలురాయిగా నిలిచిన జర్మన్‌ సంగీత విద్వాంసుడు లుడ్విన్‌ వాన్‌ బీథోవెన్‌ ఎప్పుడు పుట్టాడో వివరాలు తెలియవు. అయితే, 1770 డిసెంబర్‌ 17న బాప్టిజం స్వీకరించాడు. అప్పట్లో జర్మనీ అధీనంలో ఉన్న మెషెలిన్‌ అనే పట్టణంలో బీథోవెన్‌ బాల్యం గడిచింది. ఆ పట్టణం ఇప్పుడు బెల్జియంలో ఉంది. బధిరుడైన తర్వాత కూడా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన విద్వాంసుడిగా బీథోవెన్‌ పేరు చరిత్రలో సుస్థిరంగా నిలిచి ఉంది. తాత పేరు పెట్టుకున్న బీథోవెన్‌కు సంగీతం వారసత్వంగా అబ్బింది. బాన్‌ నగరంలో తండ్రి జోహాన్‌ చిన్న చిన్న సంగీత నాటక సంస్థల్లో పనిచేసేవాడు. బీథోవెన్‌ తన తండ్రి దగ్గరే సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నాడు. ఐదారేళ్ల వయసులోనే బీథోవెన్‌ సంగీతంలో అపారమైన ప్రతిభ చూపేవాడు. పియానో ముందు గంటల కొద్దీ గడిపేవాడు. ఆ వయసులోనే అతడు చేసే స్వర విన్యాసాలకు సంగీత పాఠాలు చెప్పే పెద్దలు సైతం దిగ్భ్రమ చెందేవారు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే స్వయంగా మూడు సొనాటాలకు స్వరకల్పన చేశాడు. అప్పటికే సంగీత దిగ్గజంగా వెలుగుతున్న మోజార్ట్‌ను కలుసుకునేందుకు బీథోవెన్‌ వియన్నా బయలుదేరాడు. అయితే, కుటుంబ సమస్యల వల్ల రెండువారాలకే అక్కడి నుంచి వెనుదిరిగి రావాల్సి వచ్చింది. కొద్ది రోజులకే తల్లి మరణించింది. మానసికంగా కుంగిపోయిన తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. చిన్న పిల్లలైన ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత పూర్తిగా బీథోవెన్‌పై పడింది. వారి బాగోగులు చూసుకుంటూ ఐదేళ్లు బాన్‌లోనే ఉండిపోయాడు. బాధ్యతల నుంచి తేరుకున్నాక తిరిగి వియత్నాం చేరుకున్నాడు. మోజార్ట్‌ అప్పటికే కాలం చేయడంతో బీథోవెన్‌ తన జీవితకాలంలో మోజార్ట్‌ను కలుసుకోలేకపోయాడు. వియన్నాలో బీథోవెన్‌ జీవిక కోసం పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేవాడు. కచేరీలు చేసేవాడు. మరోవైపు నిద్రాహారాలను పట్టించుకోకుండా సంగీతంలో ప్రయోగాలు కొనసాగించేవాడు. ఒకనాడు సంగీత సాధనలో ఉండగానే అకస్మాత్తుగా మూర్ఛపోయాడు. స్పృహవచ్చాక తాను వినికిడి శక్తి కోల్పోయినట్లు గ్రహించాడు. ఈ ఉపద్రవం 1798లో సంభవించింది. చికిత్స తీసుకుంటున్నా, వినికిడి శక్తి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో బీథోవెన్‌ నిరాశలో కూరుకుపోయి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వైద్యుల సలహాపై వియన్నా శివారు పట్టణం హీలిజెన్‌స్టాట్‌కు మకాం మార్చాడు. నెమ్మదిగా మళ్లీ సంగీత సాధనలో పడ్డాడు. బీథోవెన్‌ 1824లో తొమ్మిదో సింఫనీని ప్రదర్శిస్తుండగా అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న అతడి వినికిడి శక్తి పూర్తిగా పోయింది. అయినా బీథోవెన్‌ సంగీతానికి దూరం కాలేదు. పూర్తి బధిరుడుగా మారిన తర్వాత తన సంగీతాన్ని తానే వినలేని స్థితిలో సైతం శ్రోతలను ఉర్రూతలూగించే స్వరకల్పనలు చేశాడు. పాశ్చాత్య సంగీత ప్రపంచంలో మైలురాయిగా నిలిచిపోయాడు.

ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌
అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ పోలియో బాధితుడు. అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి అంగవైకల్యం ఆయనకు ఏమాత్రం అవరోధం కాలేదు. పైగా అమెరికా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్న నాయకుడిగా చరిత్రను సృష్టించడం విశేషం. అంతేకాదు, టీవీ తెరపై కనిపించిన తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ 1882 జనవరి 30న న్యూయార్క్‌లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. తండ్రి జేమ్స్, తల్లి సారా. ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ నాయనమ్మ మేరీ రెబెక్కా అమెరికా ఐదో అధ్యక్షుడు జేమ్స్‌ మన్రో భార్య ఎలిజబెత్‌ మన్రోకు సోదరి వరుస. ఉన్నతస్థాయి రాజకీయ సంబంధాలు గల సంపన్న కుటుంబం కావడంతో ఫ్రాంక్లిన్‌ బాల్యం బాగానే గడిచింది. మసాచుసెట్స్‌లోని గ్రాటన్‌ బోర్డింగ్‌ స్కూల్‌లోను, అక్కడకు చేరువలోని హార్వర్డ్‌ కాలేజీలోను అతని చదువు సంధ్యలు సాగాయి. హార్వర్డ్‌ కాలేజీ నుంచి చరిత్రలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత కొలంబియా లా కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఒక వాల్‌స్ట్రీట్‌ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. బంధువుల అమ్మాయి అయిన ఎలినార్‌ను 1905లో పెళ్లాడాడు. వారికి ఐదుగురు పిల్లలు. ఫ్రాంక్లిన్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనసాగాడు. యువ నాయకుడిగా దూసుకుపోతున్న రోజుల్లో 1921లో అకస్మాత్తుగా పోలియో బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. నడవలేని పరిస్థితిలో ఇక ఇంటికి పరిమితం కావడమే మంచిదని ఫ్రాంక్లిన్‌ తల్లి సారా అభిప్రాయపడింది. అయితే, ఫ్రాంక్లిన్‌ భార్య ఎలినార్, స్నేహితురాలు లూయీ హోవె అతడికి ధైర్యం చెప్పారు. చికిత్స కోసం రకరకాల ప్రదేశాలకు తిరుగుతూనే డెమోక్రటిక్‌ పార్టీ నాయకులతో సంబంధాలు కొనసాగించేవాడు. అధ్యక్ష పదవికి 1928లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీపడ్డ స్మిత్‌కు మద్దతు పలికాడు. స్మిత్‌ ఇందుకు ప్రతిఫలంగా అదే ఏడాది న్యూయార్క్‌ గవర్నర్‌ ఎన్నికల్లో ఫ్రాంక్లిన్‌ను బరిలోకి దించాడు. అధ్యక్ష ఎన్నికల్లో స్మిత్‌ పరాజయం చెందినా, న్యూయార్క్‌ గవర్నర్‌ ఎన్నికల్లో ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ అతి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందాడు. ఫ్రాంక్లిన్‌ గవర్నర్‌ అయిన ఏడాదిలోగానే ఆర్థికమాంద్యం దెబ్బకు వాల్‌స్ట్రీట్‌ కుదేలై, వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి ఆయన చరిత్రలోనే తొలిసారిగా నిరుద్యోగ బీమా ప్రవేశపెట్టారు. తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టి, 1932 నాటి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 1933లో అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత మరో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తాను 1945లో మరణించేంత వరకు ఈ పదవిలో కొనసాగారు. ఫ్రాంక్లిన్‌ హయాంలోనే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. జపాన్‌ పెర్ల్‌ హార్బర్‌పై దాడి చేయడంతో అమెరికా జపాన్‌పై యుద్ధం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు పదవిలో కొనసాగుతుండగానే 1945 ఏప్రిల్‌ 12న ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ కన్నుమూశారు.

థామస్‌ అల్వా ఎడిసన్‌
ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన ఆవిష్కర్తగా, విజయవంతమైన వాణిజ్యవేత్తగా గుర్తింపు పొందిన థామస్‌ అల్వా ఎడిసన్‌ ప్రమాదవశాత్తు బాల్యంలోనే బధిరుడయ్యాడు. అతడు సాధించిన శాస్త్ర సాంకేతిక, వ్యాపార విజయాలకు బధిరత్వం అవరోధం కాలేదు. థామస్‌ ఎడిసన్‌ 1847 ఫిబ్రవరి 11న అమెరికా ఓహాయో రాష్ట్రంలోని మిలాన్‌ నగరంలో శామ్యూల్, నాన్సీ దంపతులకు పుట్టాడు. వారి ఏడుగురు సంతానంలో థామస్‌ చివరివాడు. డచ్‌ సంతతికి చెందిన శామ్యూల్‌ పూర్వీకులు కెనడా నుంచి బతుకుదెరువు వెదుక్కుంటూ అమెరికాకు వలస వచ్చారు. శామ్యూల్‌ చిన్నా చితకా వ్యాపారాలు చేసేవాడు. మిలాన్‌లో వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబంతో పాటు మిషిగాన్‌ చేరుకున్నాడు. అక్కడే థామస్‌ను స్కూల్‌లో చేర్చారు. ఎంత చెప్పినా అతడు పాఠాలను ఏమాత్రం తలకెక్కించుకోవడం లేదని టీచర్లు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి నాన్సీ కొడుకును స్కూలు మాన్పించింది. ఇంట్లోనే అతడికి పాఠాలు బోధించడం ప్రారంభించింది. ఒకవైపు ఇంట్లో చదువుకుంటూనే ఇంటికి ఆసరాగా ఉండటానికి లోకల్‌ ట్రైన్‌లలో క్యాండీలు, న్యూస్‌పేపర్లు అమ్మేవాడు. పదహారేళ్ల వయసులో గ్రాండ్‌ ట్రంక్‌ రైల్వే సంస్థలో కొంతకాలం టెలిగ్రాఫ్‌ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఆ పని మానేశాక మిషిగాన్‌లో వీధి పక్కన న్యూస్‌పేపర్లు అమ్మే హక్కులను సొంతం చేసుకున్నాడు. న్యూస్‌పేపర్ల అమ్మకాల కోసం నలుగురు అసిస్టెంట్లను నియమించుకున్నాడు. కాగితంపై టైప్‌రైటర్‌తో ముద్రించిన కథనాలతో ‘గ్రాండ్‌ ట్రంక్‌ హెరాల్డ్‌’ అనే స్థానిక పత్రికను తెచ్చాడు. ఒకవైపు వ్యాపారాలతో ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే, మరోవైపు సొంతగా శాస్త్ర సాంకేతిక ప్రయోగాలను కొనసాగించేవాడు. కొన్నాళ్లకు న్యూజెర్సీలోని నెవార్క్‌కు మకాం మార్చి, శాస్త్ర పరిశోధనలను మరింత ముమ్మరం చేశాడు. ఏ విద్యాసంస్థలోనూ అధికారికంగా చదువుకోకున్నా, స్వయంకృషితోనే శాస్త్రవేత్తగా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పురోగతినే మలుపుతిప్పిన విద్యుత్తు బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్‌ పిక్చర్, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ, బ్యాటరీ, రబ్బర్‌ టైర్లు వంటి ఆవిష్కరణలను అందించాడు. అమెరికాతో పాటు పలు యూరోప్‌ దేశాల్లో తాను రూపొందించిన వస్తువులకు వందలాది పేటెంట్లు పొందిన ఎడిసన్‌ 1931 అక్టోబర్‌ 18న డయాబెటిస్‌తో బాధపడుతూ కన్నుమూశాడు.
– పన్యాల జగన్నాథదాసు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top