
ఢిల్లీ: దివ్యాంగులపై జోకులు వేసే కమెడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులపై అనుచితమైన జోక్స్ తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవమానించే వ్యాఖ్యలు ఎప్పుడు ఆగుతాయంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అసభ్యకరమైన జోకులు వేసిన కమెడియన్లను మందలించింది. ఇలాంటి షోల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలు చేసినవారు తమ సామాజిక మాధ్యమాల్లో కూడా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సామేయ్ రైనా, విపున్ గోయల్, బల్ రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి థక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వంటి కమెడియన్లు వికలాంగులను అపహాస్యం చేశారంటూ ఎస్‌ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హాస్యం జీవితంలో భాగమే, కానీ అది ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయకూడదంటూ ధర్మాసనం హెచ్చరించింది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలంటూ ఆదేశించింది. ఇలాంటి కేసులలో భవిష్యత్తులో జరిమానాలు కూడా విధించవచ్చంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇకపై కమెడియన్లు ప్రతి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం.. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లపై విధించాల్సిన జరిమానాపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ వివాదం అనంతరం సమయ్ రైనా తన షో "ఇండియాస్ గాట్ లాటెంట్"ను నిలిపేసిన సంగతి తెలిసిందే.
