తాళాల్లేవు... నమ్మకముంది! | Shani Shingnapur, a village having houses without doors | Sakshi
Sakshi News home page

తాళాల్లేవు... నమ్మకముంది!

Oct 12 2014 1:12 AM | Updated on Sep 2 2017 2:41 PM

తాళాల్లేవు... నమ్మకముంది!

తాళాల్లేవు... నమ్మకముంది!

బయట గార్డు ఉంటాడు.. బ్యాంకు తాళాలేసి ఉంటాయి.. లోపల స్ట్రాంగ్ రూంకు ఇంకో తాళమేసి ఉంటుంది.. అందులో హైలెవెల్ సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య డబ్బు, బంగారం దాచి ఉంటాయి.. అయినా ఆ డబ్బు, బంగారం పోదని గ్యారెంటీ లేదు

దైవాదీనం:
బయట గార్డు ఉంటాడు.. బ్యాంకు తాళాలేసి ఉంటాయి.. లోపల స్ట్రాంగ్ రూంకు ఇంకో తాళమేసి ఉంటుంది.. అందులో హైలెవెల్ సెక్యూరిటీ ఏర్పాట్ల మధ్య డబ్బు, బంగారం దాచి ఉంటాయి.. అయినా ఆ డబ్బు, బంగారం పోదని గ్యారెంటీ లేదు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నా బ్యాంకు దొంగతనాలు ఆగని రోజులివి! అలాంటిది అసలు తాళాలే వేయకుండా, తలుపులే మూయకుండా ఓ బ్యాంకు నడపడం సాధ్యమా? లోపలున్న కోట్ల రూపాయల డబ్బు భద్రంగా ఉంటుందా? ఈ ఆలోచన అసలు ఊహకైనా అందుతుందా?
 
కానీ మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లో ఈ అద్భుతమే చోటు చేసుకుంది. అక్కడ తాళాల్లేని, తలుపులే మూయని బ్యాంకు మొదలైంది. ఇదెలా సాధ్యమైంది? ఈ బ్యాంకు కథేంటి?
శని శింగనాపూర్.. పేరును బట్టే ఈ ఊరి కథేంటో చెప్పేయచ్చు. శనీశ్వరుడి ఆలయానికి ప్రసిద్ధి ఈ ఊరు. అహ్మద్‌నగర్ జిల్లాలో మూడు వేల జనాభాతో ఉన్న ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయముంది. తమ గ్రామాన్ని శనీశ్వరుడే పాలిస్తాడని.. ఆయనే తమకు రక్ష అని ఆ ఊరి ప్రజల నమ్మకం.
 
ఎవరైనా తప్పు చేస్తే శని ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి.. తిష్టవేసుకుని కూర్చుంటాడని.. అతనికి ఎప్పటికీ కష్టాలే అన్నది వారి నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆ గ్రామంలో ఏ ఇంటికీ తాళాలు వెయ్యరు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగతున్న సంప్రదాయం. ఎలాంటి స్థితిలోనైనా గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు మూయడం, తాళాలు వేయడమన్నది జరగదు. ఐతే శని శింగనాపూర్‌లో ఎప్పుడూ దొంగతనాలు లేకుండా ఏమీ లేదు. 2010లో ఓసారి, తర్వాతి ఏడాది మరోసారి రెండు దొంగతనాలు జరిగాయి. అవి మినహాయిస్తే మరే కేసులూ లేవు. గత మూడేళ్ల కాలంలో చిన్న దొంగతనం కూడా జరగలేదు.
 
 
శని శింగనాపూర్‌లో తాళాలేయని సంప్రదాయం కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ దుకాణాలు, కార్యాలయాలు, గుళ్లు, పాఠశాలలు కూడా తాళాల్లేకుండానే పని చేస్తున్నాయి. తాళాలేయమన్న షరతులతోనే ఇక్కడ దుకాణాలు తెరవాల్సి ఉంటుంది. ఐతే వీటి సంగతి బాగానే ఉంది కానీ.. కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే బ్యాంకుల సంగతేంటి మరి! శని శింగనాపూర్ గ్రామ సంప్రదాయం గురించి తెలియక ఇక్కడ బ్రాంచి తెరుద్దామని చూశాయి చాలా బ్యాంకులు. కానీ బ్యాంకుకు తాళాలేస్తే ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నారు గ్రామస్థులు. తాళాల్లేకుండా బ్యాంకు తెరవడానికి ససేమిరా అన్నారు అధికారులు. దీంతో బ్యాంకుల ద్వారా కలిగే ప్రయోజనాలేవీ అందక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డారు శని శింగనాపూర్ గ్రామస్థులు.
 
ఐతే శంకర్ గడఖ్ అనే ఎన్సీపీ నేత ప్రయత్నంతో ఓ ముందడుగు పడింది. ఆయన యూకో బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఊరి సంప్రదాయం గురించి చెప్పి, గ్రామస్థులే బ్యాంకును కాపాడుకుంటారని హామీ ఇచ్చారు. ప్రతి బ్యాంకుకూ హై సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పక్కనబెట్టి మరీ యూకో బ్యాంకు శని శింగనాపూర్ తన బ్రాంచి ఆరంభించింది. గ్రామస్థుల కోరిక ప్రకారమే తాళాలేయకుండా బ్యాంకు లావాదేవీలు నడపడానికి అంగీకరించింది.
 
ఈ ఏడాది జనవరిలో మొదలైన శని శింగనాపూర్ యూకో బ్యాంకు బ్రాంచి ఏ ఇబ్బందులూ లేకుండా నడిచిపోతోంది. ఐతే ప్రధాన ద్వారానికి తాళాలు వేయనప్పటికీ.. నగదు, బంగారం ఇతరత్రా ముఖ్యమైన వస్తువులన్నింటినీ కొంచెం భద్రమైన చోటులోనే ఉంచి లావాదేవీలు సాగిస్తున్నారు. బ్యాంకు సిబ్బందిలో కొందరు ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేసుకోగా.. గ్రామస్థులు సైతం బ్యాంకుపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. స్థానిక పోలీసులు, అధికారులు బ్యాంకు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఈ సంప్రదాయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఏ ఇబ్బందులూ లేకుండా బ్యాంకు కార్యకలాపాలు సాగిపోతున్నాయి.
 
శని శింగనాపూర్‌లోని శనీశ్వరుడి ఆలయానికి రోజూ దాదాపు పది వేల మంది భక్తులు వస్తారు. వారాంతాల్లో ఆ సంఖ్య 50 వేల దాకా ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతుంది కూడా. ఇంతమంది వస్తూ పోతున్నా ఇక్కడి జనాలు ధైర్యంగా తలుపులు, తాళాలు వేయకుండా జీవనం సాగిస్తుండటం విశేషం. అందులోనూ ఓ బ్యాంకు తాళాలే లేకుండా తన కార్యకలాపాలు సాఫీగా సాగిస్తుండటం ఇంకా పెద్ద విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement