జాతీయాలు | Proverbs | Sakshi
Sakshi News home page

జాతీయాలు

May 29 2016 1:35 AM | Updated on Sep 4 2017 1:08 AM

అందరినీ ఒకేలా చూడాలి. ఒకరు తక్కువేమిటి? ఇంకొకరు ఎక్కువ ఏమిటి? ఆ శ్రీను కూడా మాలాంటివాడే.

వెన్ను చలవ
‘అందరినీ ఒకేలా చూడాలి. ఒకరు తక్కువేమిటి? ఇంకొకరు ఎక్కువ ఏమిటి? ఆ శ్రీను కూడా మాలాంటివాడే. మీరు మాత్రం...అతడిని  వెన్ను చలవ బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు’
 ‘నువ్వు నా కన్నబిడ్డ కంటే ఎక్కువ... నా వెన్నుచలవ బిడ్డవు నువ్వు’... ఇలాంటి మాటలు నిత్యజీవితంలో వినిపిస్తుంటాయి.
 వెన్ను చలవ బిడ్డ ఎవరు?
 సంతానం లేని దంపతులు వేరే వాళ్ల బిడ్డను తెచ్చుకొని పెంచుకోవడాన్ని  ‘వెన్ను చలవ’ అంటారు. ఈ బిడ్డను కళ్లలో పెట్టి చూసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే సొంతబిడ్డ కంటే ఎక్కువ ప్రేమతో పెంచుకుంటారు.
  పరాయి బిడ్డను పెంచుకోవడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానయోగం కలుగుతుందనేది ఒక నమ్మకం. పెంచుకుంటున్న బిడ్డను వెన్ను మీద ఉప్పు బస్తాలా మోస్తే... వెన్నుచల్లబడి సంతానం కలుగుతుందనేది కూడా ఆ  నమ్మకాలలో ఒకటి.
 
పందిరి మందిరమైనా సరే...
ఎంత కష్టమైనా సరే ఆ పని సాధిస్తాం అనే పట్టుదల ఉన్నప్పుడు ఉపయోగించే మాట ఇది.
 ‘అతడిని తక్కువ అంచనా వేయకు...పందిరి మందిరం అయినా సరే సాధిస్తాడు’లాంటి మాటలు నిత్యం వినబడుతూనే ఉంటాయి.
 పందిరికి మందిరానికి ఎలాంటి సంబంధం లేదు.
 పందిరి మందిరం కావడం అనేది అసాధ్యమైన పని.
 ‘ఆరు నూరైనా నూరు ఆరైన’లాంటిదే ‘పందిరి మందిరమైన సరే’ వాడుక.
 
పిష్ట పేషణం!

కొందరు చెప్పిందే చెబుతూ, మాట్లాడిందే మాట్లాడుతూ అవతలి వ్యక్తులను తెగ విసిగిస్తుంటారు. సహనాన్ని పరీక్షిస్తుంటారు.
 కొందరేమో...పని చేస్తారుగానీ ఆ పని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు.  ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే ‘పిష్ట పేషణం’
 పిండిని మళ్లీ పిండి చేయాల్సిన అవసరం ఉంటుందా?
 ఉండదుగాక ఉండదు!
 అలా చేయడం తెలివి తక్కువ పని అవుతుంది. ఎందుకు ఉపయోగపడని పని అవుతుంది.
 పిష్టం అంటే పిండి. పేషణం అంటే నూరడం.
 పిండిని మళ్లీ పిండిగా మార్చాలనుకోవడమే ‘పిష్ట పేషణం’. చెప్పినదాన్నే మళ్లీ మళ్లీ చెప్పడాన్ని ‘పిష్ట పేషణం’తో పోల్చుతారు.
 
 
ధృతరాష్ట్ర కౌగిలి!
దుర్యోధన వధ తరువాత పాండవులు ధృతరాష్ర్టుడిని  కలవడానికి వస్తారు.
 భీముడే దుర్యోధనుడిని చంపాడని అతడి మీద కోపం పెంచుకుంటాడు ధృతరాష్ట్రుడు.
  భీముడిని ఆశీర్వదించే నెపంతో కౌగిలించుకొని  నలిపివేయాలని పథకం వేస్తాడు.
 భీముడిని దగ్గరకు రమ్మని పిలుస్తాడు.
   ధృతరాష్ర్టుడి మనసులోని కుట్రను పసిగట్టిన కృష్ణుడు...భీముడి ఉక్కుప్రతిమను ధృతరాష్ర్టుడి ముందు ఉండేలా ఏర్పాటు చేస్తాడు.
 ధృతరాష్ట్రుడి కౌగిలిలో ఆ ప్రతిమ పిండి పిండి అవుతుంది.
 పైకి ప్రేమగా నటిస్తూ, లోపల వినాశనం కోరే వారిని. వారి పనులను ‘ధృతరాష్ట్ర కౌగిలి’తో పోల్చుతారు. ధృతరాష్ట్ర కౌగిలి అనేది వినాశన సంకేతంగా ప్రాచుర్యం పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement