కుడి ఎడమైతే..!

కుడి ఎడమైతే..!


కొత్తగా పరిచయమైన వ్యక్తి ఎవ్వరైనా పెన్నందుకొని ఏదైనా రాస్తున్నారంటే, వాళ్లు రాస్తున్నప్పుడు చూస్తూ అడగగల ప్రశ్నలు మహా అయితే ఏముంటాయ్‌? ‘‘ఏం రాస్తున్నావ్‌?’’ అని అడుగుతారేమో!నాకు మాత్రం ఎన్ని ప్రశ్నలొస్తాయో తెల్సా..     

‘‘హే నువ్వు లెఫ్ట్‌హ్యాండరా?’’ ఆశ్చర్యంగా!    

‘‘అయ్యా! నువ్వు లెఫ్ట్‌హ్యాండ్‌తో రాస్తావా?’’ మరింత ఆశ్చర్యంగా!

వీటికి చాలాసార్లు ‘‘అవును’’ అని కాస్తంత గర్వంగా సమాధానం ఇస్తూంటా.
ఇంతవరకు బాగుంది. చాలా బాగుంది. ఆ తర్వాతే కొన్ని వెటకారపు ప్రశ్నలు కూడా రావొచ్చు. సినిమాల్లో విలన్‌ పాత్రలకే ఎడమచేతి వాటం ఎక్కువగా పెడుతుంటారు. డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా ఎడమ చేతిని వాడొద్దని వారిస్తూంటారు. ఎంత తక్కువ చూపో కదా? మరేం పర్లేదు. మాకు కూడా చెప్పుకోవడానికి ఓ రోజు (ఆగస్టు 13) ఉంది. మాలాగే ప్రపంచం మొత్తమ్మీద 10 శాతం జనాభా ఉన్నారు. మాకంటూ ఓ ప్రత్యేక మార్కెట్‌ (నిజంగానే!) ఉంది. మా కథ ఇది..ఎప్పుడు తెలుస్తుంది?

ఎడమ చేతి వాటమా, కుడి చేతి వాటమా అన్నది ఎప్పుడు తెలుస్తుందీ? చిన్నప్పుడే ఏ చెయ్యిని ఎక్కువగా వాడుతున్నామో దాన్నిబట్టి చెప్పేస్తాం కానీ, ఏ చెయ్యితో రాస్తామన్నదే కచ్చితంగా కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి ఒక ప్రామాణికంగా చేసుకున్నాం(రు). నిజానికి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ ఏ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకుంటుందో గమనించి ఏ చేతివాటమో చెప్పేయొచ్చు. సైన్స్‌ ఎప్పట్నుంచో ఎడమ చేతి వాటంపై పరిశోధనలు చేస్తూనే ఉంది. మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్, జీన్స్‌లో చిన్న చిన్న మార్పులు దీనికి కారణమని ప్రస్తుతానికి ఒక దగ్గర ఆగారు.ఎన్నెన్ని ఇబ్బందులో!  

‘‘వీడేంటీ ఎడమచేతి వాటంలా ఉన్నాడు?’’ అని ఇంట్లో వాళ్లు అనుకోవడం దగ్గర్నుంచి మొదలవుతాయి ఇబ్బందులు. కొంతమంది ‘మా పిల్లలు స్పెషల్‌’ అని సంబరపడతారు. ఇంకొందరు ‘చెయ్యి మార్చు.. చెయ్యి మార్చు’ అని బాధపెడతారు. ఇప్పుడైతే బాధపెట్టడం తగ్గిందనే చెప్పొచ్చు. సో, ఎడమచేతి వాటాన్ని పూర్తిగా యాక్సెప్ట్‌ చేసేసింది సమాజం! ఇబ్బందులు యాక్సెప్ట్‌ చేయడంతో ఆగిపోవు కదా.. కొన్ని ఉన్నాయి అలాంటివి. మరీ చిన్న వయసులో అంటే పెన్సిల్, షార్ప్‌నర్‌ తెగ ఇబ్బంది పెట్టే వస్తువులు. ఇక కొంచెం పెద్దయ్యాక డోర్లు తెరవడం కాస్త ఇబ్బంది పెట్టేదే!  రైట్‌ హ్యాండెడ్‌ కుర్చీలు ఉంటాయి.. ఎంత కష్టంగా ఉంటుందో! కంప్యూటర్‌ నేర్చుకునే కొత్తలో మౌస్‌ వాడడం అంటే ఏదో యుద్ధంలోకి దిగినట్టు చెయ్యి వణికిపోతుంది (కుడి చెయ్యే వాడాలి కదా!). కత్తెర.. బాబోయ్‌ ఇదీ అసలైన పరీక్షంటే! కుడిచేత్తో తినడం బాగానే అలవాటైపోతుంది కానీ, స్పూన్‌ పట్టుకుంటే మాత్రం ఎడమ చెయ్యి వాడాల్సిందే! (చూసేవాళ్లు వింతగా చూస్తారే!!) వడ్డించమని ఎవరైనా అడిగితే నవ్వును సమాధానంగా ఇస్తాం చూడూ.. ఇందుకే!  చెప్పుకుంటూ పోతే ఎదిగే ప్రతి దశలో ఓ సవాల్‌ ఉంటుందంటారు. వాడే వస్తువుల్లో, అలవాటైన చిన్న చిన్న పనుల్లోనూ సవాళ్లుంటాయని ఎడమచేతి వాటం పరిచయం చేస్తుంది.అందుకే ఓ సెపరేట్‌ మార్కెట్‌!

లెఫ్ట్‌హ్యాండర్స్‌కు ఓ మార్కెట్‌ ఉంది తెల్సా? ఇది వింతగానే కనిపించినా నిజం. కుడిచేతి వాటం వారికి తయారు చేసిన వస్తువులన్నీ వాడలేక ఇబ్బంది పడే ఎడమచేతి వాటం గాళ్ల కోసం ప్రత్యేకంగా అన్ని వస్తువులూ తయారు చేస్తున్నారు. కత్తెర, గిటార్‌ దగ్గర్నుంచి ఎన్నో వస్తువులు ఇప్పుడు ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి. కొంచెం స్పెషల్‌ ప్రోడక్ట్స్‌ కదా.. ఖర్చూ ఎక్కువే మరి!!ఇదీ స్పెషల్‌!

మెదడులో కుడి, ఎడమ అని రెండు భాగాలుంటాయి. కుడి చేత్తో చేసే పనుల వల్ల ఎడమ వైపుండే భాగం యాక్టివేట్‌ అవుతుంది. ఎడమ చేత్తో చేసే పనుల వల్ల కుడివైపుండే భాగం యాక్టివేట్‌ అవుతుంది. ఇందుకే ఎడమచేతి వాటం వాళ్లలో కుడి వైపు భాగం చురుగ్గా పనిచేస్తుంది. ఈ భాగం షార్ప్‌గా, క్రియేటివ్‌గా ఆలోచింపజేసేలా చేస్తుందని అంటారు. ఇది స్పెషలే మరి!వీళ్లు టాప్‌.. వీళ్లు స్పెషల్‌ కూడా!

ప్రతి రంగంలో టాప్‌ అనిపించుకున్న వారిలో లెఫ్ట్‌ హ్యాండర్స్‌ చాలామందే ఉన్నారు. సినిమాల్లో ఒక అమితాబ్‌ బచ్చన్, క్రికెట్‌లో ఓ సచిన్‌ టెండూల్కర్, బిజినెస్‌లో బిల్‌గేట్స్, మార్క్‌ జూకర్‌బర్గ్, పాలిటిక్స్‌లో బరాక్‌ ఒబామా, నరేంద్ర మోదీ.. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్లంతా టాప్‌.. అదే వీళ్లంతా స్పెషల్‌ అనే జాబితా పెద్దదే! చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. లెఫ్ట్‌ హ్యాండర్స్‌గా పుట్టడం అనేదేం పెద్ద నేరం కాదు. పిల్లాడు ఎడమ చెయ్యి పట్టాడని ఏ తండ్రో చెయ్యి కాల్చి, కుడి చెయ్యిని పట్టించాడట. ఇంత స్పెషల్‌ పిల్లలను అలా చూడడం తప్పు కదూ..! సవాళ్లను ఎదుర్కొని మరీ టాప్‌ అనిపించుకోవట్లేదూ..!!లెఫ్ట్‌ హ్యాండర్స్‌ పడే ఇబ్బందులను, వారి ఆలోచనలను, చుట్టూ ఉండే పరిస్థితులను ప్రపంచానికి పరిచయం చేయడానికి లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే పుట్టింది. దీన్ని1976లో మొదటిసారిగా నిర్వహించారు.– వి. మల్లికార్జున్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top