ప్రపంచ మేధావుల్లో వారే అధికం.. తెలివి తేటలు, గ్రహించే శక్తి అన్నీ ఎక్కువే

World Left Handers Day Genetic Changes Scientific Theories - Sakshi

నేడు ప్రపంచ లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే 

సాక్షి, కర్నూలు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది ఎడమ చేతి వాటం (లెఫ్ట్‌ హ్యాండర్స్‌) కలిగి ఉన్నారు. వీరెక్కడ కనబడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. కుడి ఎడమైతే పొరపాటే లేదోయ్‌ అన్నాడో సినీ కవి. ఎడమ చేతి వాటం కేవలం జన్యుప్రభావం వల్ల ఎర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్‌హ్యాండర్స్‌ డేగా జరుపుకుంటున్నారు. 

కుడి చేతి వాటం కలిగిన వారి కన్నా ఎడమ చేతి వాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని, వారికి తెలివి తేటలు, గ్రహించే శక్తితో పాటు మంచి అలోచన శక్తి ఉంటుందని అంటారు. అంతేకాదు ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎడమ చేతితోనే రాస్తారు. క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్, అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, బిల్‌క్లింటన్, సినీ నటుడు అమితాబ్, సావిత్రి ఇలా ఎందరో లెఫ్ట్‌హ్యాండ్‌ వాటం వారే. ఎడమ చేతి వాటం ఉన్న వారిలో క్రియేటివిటీ, మ్యూజిక్, ఆర్ట్స్‌ అధికంగా ఉంటాయి. వీరికి మాట్లడే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం మెండుగా ఉంటుంది.  

వీరి ప్రత్యేకతల్లో కొన్ని 
చేతులకు ఉన్నట్లే కాళ్లకు కూడా వాటం ఉంటుంది. కుడి  చేతి వాటం ఉన్న వారిలో కుడికాలు వాడకం, ఎడమ చేతి వాటం ఉన్న వారు ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఎదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. 
మహిళలకు మాత్రం సృజనాత్మకతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి 
ఎడమ చేతివాటం వారు వేగంగా, సులభంగా పనులు మంచి టెక్నిక్‌తో పూర్తి చేస్తారు. వీరికి మెమొరీ పవర్, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న విషయాలు వెంటనే మరచిపోగలరు.  

వారికీ ఇబ్బందులు.. 
ఎడమ చేతి వాటం వాళ్లలో టైలర్లు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, సూయింగ్‌ మిషన్‌ డిజైన్‌ పూర్తిగా కుడి చేతి వారికి సరిపోయే విధంగా తయారై ఉంటాయి. కంప్యూటర్‌ మౌస్, డ్రైవింగ్‌ చేసేవారు ఇలా ఎందరో ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం వారి కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్లు            తయారవుతున్నాయి.   
ఈ చిత్రంలో కపిస్తున్న బాలిక పేరు షాజిదాబి (లెఫ్ట్‌ హ్యాండర్‌). క్రిష్టిపాడు గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, ఉసేన్‌బీల రెండో కూతురు. బాలిక ప్రస్తుతం ఉయ్యాలవాడ మండలం హరివరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి  చదువుంది. చదువులో ముందంజలో ఉంటుంది. తెలుగు, ఆంగ్లం కంటే హిందీ రైటింగ్‌ బాగా రాస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బాలిక చెల్లెలు రిజ్వానతో పాటు మేనత్త కొడుక్కి ఎడమ చేతివాటం ఉండటం గమనార్హం. 
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నోడి పేరు శివకేశవ (లెఫ్ట్‌ హ్యాండర్‌). దొర్నిపాడులోని ఎంపీపీ స్పెషల్‌ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. క్యారమ్స్‌ క్రీడలో చురుగ్గా రాణిస్తున్నాడు. చదువుతో పాటు క్రీడల్లో ముందుంటాడని టీచర్లు చెబుతున్నారు.  
ఇక్కడ చిత్రలేఖనం చేస్తూ కనిపిస్తున్న బాలిక పేరు మానస (లెఫ్ట్‌ హ్యాండర్‌). డబ్ల్యూ.కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుంది. చదువుతో పాటు చిత్రలేఖనంలో రాణిస్తుంది. తమ కుటుంబంలో ఎవరికీ ఎడమ చేతి వాటం లేదని మానసకు మాత్రమే వచ్చిందని తండ్రి బాలచంద్రుడు పేర్కొన్నాడు. 

జన్యు మార్పులతోనే ఎడమ చేతివాటం
ఒక మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీర భాగాన్ని మెదడు ఎడమవైపు భాగం నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం వస్తుంది. మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్‌గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దు. వయస్సు పెరిగే కొద్ది సాంప్రదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని మన పద్ధతులను బట్టి నడుచుకోగలరు. 
–డాక్టర్‌ నాగేంద్ర, దొర్నిపాడు పీహెచ్‌సీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top