కథ: కర్రాబిళ్లా | Funday Story of the week : Karra billa | Sakshi
Sakshi News home page

కథ: కర్రాబిళ్లా

Feb 9 2014 3:38 AM | Updated on Sep 2 2017 3:29 AM

కథ: కర్రాబిళ్లా

కథ: కర్రాబిళ్లా

ఆంగ్లేయ భావజాలం కలిగి ఉన్న మన మిత్రులు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేనైతే అంటాను, ‘కర్రా బిళ్లా’ అన్ని ఆటలకు రాజు. ఇప్పటికి కూడా ఎప్పుడైనా పిల్లలు ‘కర్రాబిళ్లా’ ఆడుతూ ఉంటే చూసి ఒళ్లు పులకరించిపోతుంది.

ఆంగ్లేయ భావజాలం కలిగి ఉన్న మన మిత్రులు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేనైతే అంటాను, ‘కర్రా బిళ్లా’ అన్ని ఆటలకు రాజు. ఇప్పటికి కూడా ఎప్పుడైనా పిల్లలు ‘కర్రాబిళ్లా’ ఆడుతూ ఉంటే చూసి ఒళ్లు పులకరించిపోతుంది. ఈ ఆటకు ఎలాంటి ఖర్చూ ఉండదు. ఏదైనా చెట్టు ఎక్కండి, కొమ్మను నరకండి, కర్రా బిళ్లా చేసుకోండి. ఇక ఇద్దరు వ్యక్తులు వచ్చినా చాలు ఆట మొదలు కావడానికి. మరెందుకో మన స్కూళ్లలో ఇలాంటి భారతీయ ఆటలను ప్రోత్సహించరు. ఆటల పేరుతో మన స్కూళ్లలో సంవత్సరానికి 3-4 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. ఆంగ్లేయ ఆటలు ఉన్నది డబ్బున్నవారికి. బీద పిల్లలపై ఆ వ్యసనాన్ని ఎందుకు రుద్దుతారో? కర్రా బిళ్లా ఆట వల్ల కంటికి దెబ్బలు తగులుతాయని అంటారు. ఏం క్రికెట్ వల్ల తగలవా? గాయాలు కావా? సరే! ఎవరి రుచి వారిది. నాకు కర్రాబిళ్లా అంటే ఇష్టం. చిన్నప్పటి మధుర జ్ఞాపకాలలో కర్రాబిళ్లాయే అన్నిటికన్నా మధుర జ్ఞాపకంగా మిగిలింది.

ఉదయాన్నే ఇంటి నుండి వెళ్లిపోవడం, చెట్టు ఎక్కి కొమ్మను నరికి కర్రాబిళ్లా చేసుకోవడం, ఆ ఉత్సాహం, ఆట పట్ల ఆ ధ్యానం, ఆటగాళ్ల ఆనందం, ఒంటికాలి (కుంటి)తో పరుగెత్తడం, పరిగెత్తించడం, ఆ కొట్లాటలు, ఆ సరళ స్వభావాలు, అందులో ఎలాంటి కుల, మత వర్గ భేదాలు లేకుండటం... ఇంట్లోవాళ్లు కోప్పడుతున్నా నా ఆట ధ్యాసలో నేను నిమగ్నమై ఉండేవాణ్ని. స్నానం చేయాలన్న తలంపు లేదు, భోజనం చేయాలన్న ధ్యాస లేదు. బిళ్ల అయితే చిన్నదే గాని అందులో లోకంలోని అన్ని మధురమైన మిఠాయిలూ, ఆనందాలూ ఇమిడివున్నాయి.


 నా వయస్సే ఉన్న ‘గయా’ అనే పిల్లవాడు ఉండేవాడు. అతను నాకన్నా రెండు, మూడు సంవత్సరాలు వయసులో పెద్దవాడై ఉండవచ్చు. బక్కపలుచగా, పొడుగ్గా, సన్నటి వేళ్లు గలిగినవాడు అతను. బిళ్ల ఎలా ఉన్నా దాన్ని పట్టుకోవడానికి పురుగులపై బల్లి దాడి చేసినట్టు చేసి పట్టుకునేవాడు. అతని తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడుంటారు? తెలియదు గాని అతడు మా కర్రాబిళ్లా క్లబ్ ఛాంపియన్. అతను ఎవరి వైపు ఉంటాడో వాళ్ల గెలుపు తథ్యం. మేమంతా అతను వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్లి స్వాగతం పలికి మా జట్టు వైపుకు తీసుకువెళ్లేవాళ్లం.
 ఒకరోజు నేను, గయా ఇద్దరమే ఆడుతున్నాం. అతను నన్ను ఒంటికాలితో పరుగెత్తిస్తున్నాడు (కుంటిగిచ్చ చేయిస్తున్నాడు). నేను చేస్తున్నాను. కానీ దీని నుండి ఎలా తప్పించుకోవాలా అని నేను శతవిధాలుగా ఆలోచించినా లాభం లేకపోయింది. చివరకు అతన్ని కరిచాను. అతను నా వీపుపైన కర్రతో కొట్టాడు. నేను ఏడ్చాను. గయా నా ఈ అస్త్రాన్ని ఎదుర్కోలేకపోయాడు. నేను అక్కడి నుండి పరుగెత్తాను. వెంటనే కన్నీళ్లు తుడుచుకున్నాను. కర్ర దెబ్బను మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయాను. నేను సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకుని. ఒక నిమ్నకులం పిల్లవాడి చేతిలో దెబ్బలు తిన్నాను. ఇది నాకు అవమానంగా అనిపించింది. కానీ ఇంట్లో ఎవరి దగ్గరా ఫిర్యాదు చేయలేదు.
 (2)  ఆ రోజుల్లో నాన్నగారికి బదిలీ అయ్యింది. కొత్త లోకం చూడాలన్న ఆనందంలో నాకు తోటి మిత్రులను వదిలివెళుతున్న బాధ కలిగినట్టు లేదు.
 ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను.  ప్రభుత్వ ఇంజనీర్‌గా అదే జిల్లాలో పర్యటిస్తూ ఆ పట్టణానికే వెళ్లాను. డాక్ బంగ్లాలో బస చేశాను. ఆ ప్రదేశాన్ని చూస్తేనే మధురమైన బాల్యస్మృతులు తండోపతండాలుగా మేల్కొన్నాయి. నేను పట్టణాన్ని అలా చుట్టి వద్దామని బయలుదేరాను. కళ్లు దప్పికగొన్న బాటసారిలాగా చిన్ననాటి ఆట మైదానాన్ని చూడటానికి ఉబలాటపడుతున్నాయి. కానీ పరిచయమున్న ఆ పేరు తప్ప ఎవ్వరూ పరిచయస్తులు అక్కడ లేరు. చిన్నతనంలో పోగైన అమర స్మృతులు చేతులు చాచి, తన పాత మిత్రులను కౌగిలించుకోవడానికి వ్యాకులమవుతున్నాయి. కానీ లోకం మారిపోయింది.
 అప్పుడే ఒక మైదానంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కర్రా బిళ్లా ఆడుతుంటే, చూసి ఒక పిల్లవాడిని పిలిచి అడిగాను, ‘‘బాబూ! ఇక్కడ ‘గయా’ అనే పేరు గలవారు ఎవరైనా ఉన్నారా?’’ అని.
 ఆ పిల్లవాడు - ‘‘గయా చర్మకారుడా?’’ అన్నాడు.
 ‘‘అవును. కొద్దిగా పిలుచుకొస్తావా?’’
 పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఒక్క క్షణంలోనే ఐదు అడుగుల నల్లటి దైవాన్ని వెంబడి పెట్టుకుని వస్తున్నట్టు కనబడింది. దూరం నుండే నేను గుర్తుపట్టాను. అతన్ని కౌగిలించుకోవడానికి అతని వైపు గభాలున దుమికి వెళ్లాలనుకున్నాను. కానీ ఏదో ఆలోచించి ఊరుకున్నాను.
 ‘‘చెప్పు గయా! నన్ను గుర్తుపట్టావా?’’ నేను అడిగాను.
 గయా వంగి దండం పెడుతూ, ‘‘అవును. అయ్యగారూ! ఎందుకు గుర్తుపట్టనయ్యా. మీరు ఆనందంగా ఉండాలి.’’
 ‘‘చాలా ఆనందంగా ఉన్నాను. నీ గురించి చెప్పు?’’
 ‘‘డిప్యూటీ సార్‌గారి దగ్గర గుర్రం బాగోగులు చూస్తూ ఉంటాను.’’
 ‘‘మతయా, మోహన్, దుర్గా - వీళ్లంతా ఎక్కడున్నారు? ఏమైనా తెలుసా?’’
 ‘‘మతయా అయితే చనిపోయినాడు. దుర్గా, మోహన్‌లిద్దరూ తపాలా బంట్రోతులైనారు. మరి మీరు?’’
 ‘‘నేను జిల్లా ఇంజనీర్ అయ్యాను.’’
 ‘‘అయ్యగారూ! మీరు చిన్నప్పటినుండే చాలా తెలివైనవారు.’’
 ‘‘ఇప్పుడు ఎప్పుడైనా ‘కర్రాబిళ్లా’ ఆట ఆడుతావా?’’
 గయా నావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు - ‘‘ఇప్పుడు ‘కర్రాబిళ్లా’ ఏమి ఆడుతాం అయ్యగారూ. బతుకుబండిని ఈడ్చడంలోనే తీరిక దొరకడం లేదు.’’
 ‘‘పదా! ఈ రోజు నువ్వు నేను ఆడుదాం. నువ్వు కుంటి గిచ్చ చేయించు. నేను కుంటి గిచ్చ చేస్తాను. నేను నీకు ఒక కుంటిగిచ్చ బాకీ ఉన్నాను. ఈ రోజు తీసేసుకో.’’
 గయా చాలా కష్టంగా ఒప్పుకున్నాడు. ఊరి బయట ఎవ్వరూ లేని చోట ఆడటానికి అతన్ని మోటారు కారులో తీసుకెళ్లాను. మాతో పాటు ఒక గొడ్డలిని కూడా.
 మోటారు కారులో వెళుతూ అడిగాను, ‘‘గయా! నీకు నేను ఎప్పుడైనా గుర్తుకొస్తానా? నిజం చెప్పు.’’
 గయా సంకోచపడుతూ, బిడియపడుతూ అన్నాడు, ‘‘నేను మీకు ఏం అని జ్ఞాపకం అయ్యగారూ! నా స్థాయి ఏమున్నదని? నా అదృష్టంలో మీతో కొన్ని రోజులు ఆడటం రాసి ఉంది లేకపోతే నాదేం లెక్క?’’
 నేను కొద్దిగా దిగాలుపడుతూ అన్నాను, ‘‘కాని నాకు మాత్రం నీవు ఎప్పుడూ గుర్తుకొస్తుంటావు. నీ ఆ కర్ర దెబ్బ బాగా బిగబట్టి కొట్టావు కదా! గుర్తుందా?’’
 గయా పశ్చాత్తాపపడుతూ అన్నాడు, ‘‘అది పసితనం అయ్యగారూ! దాన్ని జ్ఞాపకం చేయకండి.’’
 ‘‘ఆహా! అది నా చిన్ననాటి అత్యంత మధురమైన స్మృతి. నీ ఆ కర్రలోని ఆ మధురత్వాన్ని నేడు ఆదరాభిమానాలలో గానీ, ధనంలో గానీ పొందను. నిజంగా నేటికీ మనస్సు ఆనందపడిపోతూ ఉంటుంది.’’
 ఇంతలో ఊరి బయటికి వచ్చాం.  నేను ఓ చెట్టుపైకి ఎక్కి కొమ్మను నరికి చటుక్కున కర్రాబిళ్లా చేశాను. ఆట మొదలైంది.  నేను కర్రపై బిళ్లను పెట్టి ఎగరేసి కొట్టాను. గయా బిళ్లను పట్టుకోలేకపోయాడు. అప్పుడు నాకు అనిపించింది. ఏంటి? ఇతను ఆ గయాయేనా? ఒకప్పుడు బిళ్ల తనకు తాను అతని చేతుల్లోకి వచ్చి చేరేది. అతని చేతుల్లో అయస్కాంతం ఉన్నట్టు అనిపించేది. కానీ నేడు బిళ్లకు అతని పట్ల ప్రేమ లేకపోయింది. నేను అతన్ని కుంటి గిచ్చ చేయించాను. నేను రకరకాలుగా తొండి ఆట ఆడాను. అతను నన్ను చాలాసార్లు ఔటు చేయలేదని మొండి వాదన చేశాను. గయా నా తొండి ఆటను గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఆట నియమాలు మరిచిపోయినట్టు అతను పల్లెత్తు మాట అనలేదు.
 అతని గురి ఎంత బాగుండేదంటే, అతను చేతి నుండి బిళ్లను విసిరాడంటే, సూటిగా కర్రకు వచ్చి ‘ఠన్’మని తగలాల్సిందే. కానీ నేడు అది తగలడం లేదు. ఎటో పడిపోతోంది.  అర్ధగంట అయిన తర్వాత ఒకసారి బిళ్ల వచ్చి కర్రకు తగిలింది. నేను తగలలేదు అన్నాను. అతను ‘సరే తగలలేదేమో’ అని ఒప్పుకున్నాడు. అదే చిన్నప్పుడు అయితే, ఇతన్ని ఇలా మోసగించి బతికి బట్టకట్టేవాడినా? ఇంత తొండి ఆట ఆడినా అతని సరళ స్వభావంలో ఎలాంటి మార్పూ లేదు. నాకు అతని పట్ల దయ కలిగింది. మూడోసారి బిళ్ల కర్రకు వచ్చి తగిలింది. నేను చాలా ఉదారంగా కుంటిగిచ్చ చేయడానికి సిద్ధమయ్యాను
 గయా అన్నాడు, ‘‘ఇక చీకటి పడుతుంది. రేపు ఆడుదాం!’’
 అప్పుడు నేను అనుకున్నాను, ‘‘రేపు అయితే చాలా సమయం ఉంటుంది. ఎంతసేపు నాతో కుంటి చేయిస్తాడో. ఇప్పుడే చేస్తే అయిపోతుంది కదా!’’
 గయా ఒప్పుకున్నాడు. గయా నాతో ఎక్కువసేపు కుంటి చేయించలేకపోయాడు. ప్రాక్టీస్ తప్పిపోయిందేమో, ఒక నిమిషంలోగా కుంటిగిచ్చ అయిపోయింది. పాపం! అతను గంటసేపు కుంటిగిచ్చ చేశాడు.  దీపాలు వెలిగేటప్పటికి డాక్ బంగ్లా చేరుకున్నాం. దారిలో గయా మాట్లాడుతూ, ‘‘రేపు ఇక్కడ ‘కర్రా బిళ్లా మ్యాచ్’ ఉంది. పూర్వపు ఆటగాళ్లందరూ ఆడతారు. మీరు వస్తారా?’’ అన్నాడు.
 3
 నేను మరుసటి రోజు మ్యాచ్ చూడటానికి వెళ్లాను.   నేను సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకుని. ఒక నిమ్నకులం పిల్లవాడి చేతిలో దెబ్బలు తిన్నాను. ఇది నాకు అవమానంగా అనిపించింది. కానీ ఇంట్లో ఎవరి దగ్గరా ఫిర్యాదు చేయలేదు.పది పది మంది రెండు జట్లుగా ఉన్నారు. అందులో కొందరు నా చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. చాలామంది యువకులు ఉన్నారు. వాళ్లను నేను గుర్తుపట్టలేను. ఆట మొదలైంది. నేను మోటారుకారుపై ఎక్కి కూర్చొని ఆటను ఆస్వాదిస్తున్నాను. ఈ రోజు గయా ఆట ప్రదర్శన, అతని నైపుణ్యం చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాను. అతడు బిళ్లను కొడితే ఆకాశానికి తగులుతూ ఉంది. నిన్నటి బెరుకు, జంకు, సంకోచం అతనిలో నేడు లేవు. అతని బాల్యంలోని క్రీడానైపుణ్యం నేడు ప్రౌఢత్వాన్ని పొందింది. నిన్న కూడా ఇలాగే ఆడి ఉంటే, నా పని అయిపోయేది. ఇంతలో కుంటి చేసే యువకుడు ఒకడు తొండి చేశాడు. గయా ముఖం ఎర్రబారింది. గయను చూసి ఆ యువకుడు భయంతో చల్లబడిపోయాడు. లేకపోతేనా అతని ఒళ్లు హూనం అయ్యేది. నేను ఆటలో లేను కానీ ఇతరులు ఆడుతూ ఉంటే చూస్తూ, ఆటలో నిమగ్నమైపోతే అదే ఆనందం మనకు కలుగుతుంది.
 
 ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. నిన్న నాతో గయా ఆడలేదు. కేవలం ఆడినట్టు నటించినాడు. అతను నన్ను దయాపాత్రునిగా భావించినాడు. నేను ఎంత అన్యాయంగా, తొండిగా ఆడినా అతనికి కోపం రాలేదు. ఎందుకంటే అతను ఆట ఆడలేదు. నన్ను ఆడించాడు. ఇప్పుడు నేను ఒక అధికారిని. ఈ అధికారం మా ఇద్దరి మధ్య గోడగా మారిపోయింది. ఇప్పుడు నేను అతని నుండి గౌరవం, మర్యాద పొందగలుగుతున్నాను. కానీ సహచర్యాన్ని పొందలేను. బాల్యంలో నేను అతనికి సమ ఉజ్జీగా ఉండేవాణ్ని. మాలో ఎలాంటి భేషజాలూ ఉండేవి కావు. ఇప్పుడు నేను ఈ పదవి హోదా పొంది అతని దయకు యోగ్యుడిగా మాత్రం ఉన్నాను. అతడు నన్ను తన జోడీగా భావించడు. అతను చాలా ఎదిగిపోయినాడు. నేను చిన్నవాణ్ని అయిపోయాను.  ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. నిన్న నాతో గయా ఆడలేదు. కేవలం ఆడినట్టు నటించాడు. ఇప్పుడు నేను అతని నుండి గౌరవం, మర్యాద పొందగలుగుతున్నాను. కానీ సహచర్యాన్ని పొందలేను.
 
 - మూలం: ప్రేమ్‌చంద్
 అనువాదం: డా॥నరసింహారావు కళ్యాణి

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement